Aloe Vera For Hairs : జుట్టు పెరిగేందుకు కలబందను ఇలా ఉపయోగించాలి
Aloe Vera For Hair Growth : కలబందతో జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎలా ఉపయోగించాలని చాలా మందికి తెలియదు. కొన్ని పద్ధతులను పాటిస్తే.. మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
అలోవెరా జుట్టు సంరక్షణలో ఎంతగానో పనిచేస్తుంది. అనేక సమస్యలను నయం చేస్తుంది. అయితే దీనిని ఎలా ఉపయోగించాలని చాలా మందికి తెలియదు. కలబందకు జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చీలిపోవడం వంటి చాలా సమస్యలను తొలగించే శక్తి ఉంది. జుట్టు పెరుగుదలలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కలబంద హెయిర్ ప్యాక్ ను రెగ్యులర్ గా అప్లై చేయడంతో మీ జుట్టు వేగంగా పెరుగుతుంది. అలోవెరాతో పాటు కొన్ని పదార్థాలు అందులో కలపాలి. ఈ హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కలబంద ఆకుల నుండి తాజా జెల్‌ను నేరుగా తలకు రాయండి. కొన్ని నిమిషాల పాటు తలకు మసాజ్ చేయండి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. అలోవెరా జెల్‌తో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా జుట్టు పెరుగుతుంది.
కొబ్బరి నూనెతో అలోవెరా జెల్ మిక్స్ చేసి మీ జుట్టు, తలకు అప్లై చేయండి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కొబ్బరి నూనె జుట్టుకు పోషణను అందిస్తుంది. ఈ నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఇది కఠినమైన, పొడి జుట్టును తేమ చేస్తుంది. కలబంద జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఆముదం నూనెతో అలోవెరా జెల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. గంట తర్వాత షాంపూ పెట్టుకోవాలి. ఆముదం తలకు పోషణనిచ్చి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
పుల్లటి పెరుగుతో కలబంద జెల్ మిక్స్ చేసి జుట్టు, తలకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్ స్కాల్ప్ pHని బ్యాలెన్స్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అలోవెరా జెల్‌ని తేనెతో మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టుకు తేమను అందిస్తుంది. స్కాల్ప్, జుట్టును హెల్తీగా ఉంచుతుంది.
కలబంద ఆకుల నుండి తాజా జెల్ తీసుకొని మిక్సీలో పేస్ట్ చేయండి. గ్రీన్ టీని చల్లార్చి అలోవెరా జెల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తలపై పెట్టుకుని 30 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో కడుక్కోవాలి. గ్రీన్ టీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
అలోవెరా జెల్‌ను మెంతి పొడితో కలపండి. నానబెట్టిన మెంతి గింజలను కూడా ఉపయోగించవచ్చు. మెంతులు జుట్టు మూలాలను బలపరుస్తాయి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ మిశ్రమాన్ని జుట్టు, నెత్తిమీద మొత్తం అప్లై చేయండి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.