Moong Pakodi: పెసరపప్పుతో క్రంచీ మూంగ్ పకోడీ రెసిపీ, నిజామాబాద్ జిల్లా స్పెషల్ స్నాక్-how to make crispy moong pakodi for snacks which is nizamabad special snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moong Pakodi: పెసరపప్పుతో క్రంచీ మూంగ్ పకోడీ రెసిపీ, నిజామాబాద్ జిల్లా స్పెషల్ స్నాక్

Moong Pakodi: పెసరపప్పుతో క్రంచీ మూంగ్ పకోడీ రెసిపీ, నిజామాబాద్ జిల్లా స్పెషల్ స్నాక్

Koutik Pranaya Sree HT Telugu
Sep 08, 2024 03:30 PM IST

Moong Pakodi: పెసరపప్పు వాడి చేసే పకోడీల రుచి చూశారా? నిజామాబాద్ స్పెషల్ స్నాక్ అయిన మూంగ్ పకోడీ ఇంట్లోనే చేసుకోవచ్చు. దాని తయారీ ఎలాగో చూడండి.

మూంగ్ పకోడీ
మూంగ్ పకోడీ

బజ్జీలన్నా, పకోడీలన్నా శనగపిండి మాత్రమే గుర్తొస్తుంది. కానీ పెసరపప్పుతో చేసే మూంగ్ పకోడీ రుచే వేరు. చాలా క్రిస్పీగా, కారంగా ఉండే ఈ పెసరపప్పు పకోడీ లేదా మూంగ్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేయండి. ఇవి నిజామాబాద్ జిల్లాలో చాలా ఫేమస్ స్నాక్ కూడా. ఇక్కడ శనగపిండితో చేసే ఉల్లి పకోడీలకన్నా ఇవే ఎక్కువగా దొరుకుతాయి. శనగపిండి ఎక్కువగా తినకూడని వాళ్లు ఆరోగ్యకరంగా ఈ పెసరపప్పు పకోడీలు చేసుకుని లాగించేయొచ్చు.

పెసరపప్పు పకోడీల తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు పెసరపప్పు

ఒకటిన్నర కప్పు నీళ్లు

2 పచ్చిమిర్చి తరుగు

చెంచా సన్నటి అల్లం ముక్కలు

చిటికెడు ఇంగువ

1 టీస్పూన్ మిరియాలు

1 టీస్పూన్ ధనియాలు

తగినంత ఉప్పు

డీప్ ఫ్రైకి సరిపడా నూనె

పెసరపప్పు పకోడీ లేదా మూంగ్ పకోడీ తయారీ విధానం:

1. ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన పెసరపప్పును తీసుకుని కనీసం మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. నీళ్ల నుంచి పెసరపప్పు తీసేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

2. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఇంగువ, కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మరోసారి గ్రైండ్ చేయాలి.

3. మిరియాలు, ధనియాలు కొద్దిగా దంచుకొని వాటిని పెసరపప్పు మిశ్రమంలో కలిపేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకుని పిండి బాగా కలిపేసుకోవాలి.

4. ఒక కడాయిలో నూనె పోసుకుని వేడెక్కాక చిన్న చిన్నగా పకోడీలు వేసుకోవాలి. క్రిస్సీగా, రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పకోడీలు వేగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే నూనె పీల్చేసుకుంటుంది.

5. వీటిని కెచప్ లేదా ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో కొరుకుతూ ఈ పకోడీలను తింటే అద్దిరిపోతుంది. టీ తాగేటప్పుడు మంచి స్నాక్ లాగా కూడా అవుతుంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మూంగ్ పకోడీ ఒకసారి మీరూ ప్రయత్నించేయండి. 

Whats_app_banner