Eye Care | ఇంటి చిట్కాలతో మీ కళ్లను ఇలా కాపాడుకోండి..
కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కంటి కింద నల్లటి వలయాలు, ఉబ్బడం, గీతలు, కంటి బ్యాగ్‌లు అన్నీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వస్తాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వీటిని దాచగలిగినప్పటికీ.. సహజ పదార్థాలను ఉపయోగించి.. వాటిని తగ్గించుకోవడమే మంచిది. అయితే ఈ చిట్కాలను ఫాలో అయిపోండి.
Eye Care | కంటి కింద నల్లని వలయాలు చాలా కారణాలతో ఏర్పడవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, సరైన నిద్ర లేనప్పుడు, ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కళ్లు నిర్జీవంగా మారిపోతాయి. వాటిని తగ్గించుకుని కళ్లకు రిలాక్స్ ఇచ్చేందుకు ఈ మాస్క్‌లను ప్రయత్నించండి. ఈ హోమ్ మేడ్ రెమిడీలు మీకు సత్వర ఫలితాలు ఇచ్చి.. మీ కళ్లను కాపాడుతాయి.
బాదం నూనె, తేనె
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన బాదం నూనె, తేనె రెండూ కలిసి కంటికింద వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మాన్ని దృఢంగా, మృదువుగా చేస్తాయి. కంటి ప్రాంతానికి పోషణిస్తూ.. ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒక చెంచా బాదం నూనెలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ కళ్ల కింద మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ లేదా అండర్ ఐ క్రీం రాయండి.
పసుపు పొడి, పెరుగు
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, బ్రైటెనింగ్ లక్షణాలతో నిండిన పసుపు నల్లటి వలయాలను తగ్గిస్తుంది. ఏదైనా అలెర్జీల వల్ల కళ్ల చుట్టూ మంటను తగ్గిస్తుంది. పెరుగు మీ కళ్లకింద మృదువుగా మారేలా చేస్తుంది. పెరుగులో పసుపును కలిపి.. ఈ మిశ్రమంలో కాటన్ ప్యాడ్‌లను ముంచి కళ్ల కింద అరగంట పాటు ఉంచండి. దీనివల్ల చర్మం కాంతివంతంగా.. దృఢంగా, నునుపుగా కనిపిస్తుంది.
కివి, పెరుగుతో..
పెరుగు, కివీతో చేసిన ఈ ఫ్రూటీ ఐ మాస్క్ మీ కంటి కింద చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. అలసిపోయిన, వాపు కళ్లను నయం చేయడానికి పెరుగు ఉత్తమంగా పనిచేస్తుంది. అయితే కివి మీ నల్లటి వలయాలను తేలికపరుస్తుంది. చిన్న కివీ ముక్కలను పెరుగుతో కలిపి మెత్తని పేస్ట్‌లా చేయండి. దీన్ని మీ కళ్ల కింద అప్లై చేయండి. కడిగే ముందు 10 నిమిషాలు ఆగి.. తర్వాత కడగండి.
కాఫీ, తేనె, విటమిన్ ఇ ఆయిల్
కాఫీలోని కెఫిన్ కంటి కింద వాపు, నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్లు రంగు మారడాన్ని తేలికపరుస్తాయి. తేనె, విటమిన్ ఇ నూనె కంటి ప్రాంతాన్ని తేమగా చేస్తాయి. కాఫీని గోరువెచ్చని నీటితో కలపండి. దానిలో విటమిన్ ఇ నూనె, తేనె వేసి బాగా కలపాలి. మిక్స్‌లో కాటన్ ప్యాడ్‌లను ముంచి.. వాటిని ఫ్రీజ్ చేసి మీ కళ్ల కింద అప్లై చేయండి. కడిగే ముందు 15-20 నిమిషాలు ఆగండి.
అలోవెరా మరియు రోజ్‌షిప్ ఆయిల్
అలోవెరా మీ కళ్ల కింద తక్షణమే తాజాదనాన్ని ఇవ్వడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. చర్మ తేమను మెరుగుపరుస్తుంది. రోజ్‌షిప్ ఆయిల్ చర్మాన్ని తేమగా చేస్తుంది. ఇవి క్యారీ బ్యాగ్స్‌ను తగ్గిస్తాయి. తాజా అలోవెరా జెల్‌ను, రోజ్‌షిప్ ఆయిల్‌తో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ కళ్ల కింద అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేయండి. సానుకూల ఫలితాలను పొందడానికి ఐ మాస్క్‌ను రాత్రంతా ఉంచండి.
సంబంధిత కథనం
టాపిక్