Broccoli Breakfast: బరువు తగ్గించేందుకు హై ఫైబర్ ఉన్న బ్రకోలి బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఇదిగోండి
Broccoli Breakfast: బరువు తగ్గాలనుకుంటున్నారా? మీకోసం ఇక్కడ హై ఫైబర్ ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇచ్చాము. ఇందులో బ్రకోలీ, వేరుశెనగ పలుకులు వాడాము..ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
రోజులో తినే అతి ముఖ్యమైన భోజనం బ్రేక్ ఫాస్ట్. ఇందులో తినే ఆహారం కచ్చితంగా ఆరోగ్యకరంగా ఉండాలి. బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్‌లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటే ఆ రోజంతా తక్కువ ఆహారాన్ని తినే అవకాశం ఉంటుంది. తద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. ఎవరైతే బరువును తగ్గించుకోవాలనుకుంటున్నారో... వారి కోసం మేము ఇక్కడ హై ఫైబర్ కంటెంట్ ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇచ్చాము. ఇందులో బ్రకోలీ, ఎండుమిర్చి, వేరుశెనగ పలుకులు, వెల్లుల్లి మాత్రమే వినియోగించాము. ఇది కేవలం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పైగా పోషకాలను అందిస్తుంది. ఒకసారి దీన్ని తిని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
బ్రకోలీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బ్రకోలి - పావు కిలో
వెల్లుల్లి రెబ్బలు - మూడు
మిరియాల పొడి - పావు స్పూను
వేరుశనగలు - గుప్పెడు
చిల్లి ఫ్లెక్స్ - ఒక స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ఆలివ్ నూనె - రెండు స్పూన్లు
బ్రకోలీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ
1. బ్రకోలిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. అలాగే చిల్లీ ఫ్లెక్స్ ను కూడా తీసుకోవాలి.
3. వెల్లుల్లి రెబ్బలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టాలి.
4. వేరుశనగలను ఒకసారి వేయించి రెడీగా పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆలివ్ నూనె వేయాలి.
6. అందులో వెల్లుల్లిని వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
7. ఆ తర్వాత బ్రకోలీని, వేరుశెనగ పలుకులను వేసి వేయించాలి. పైన తరిగిన చిల్లీ ఫ్లెక్స్ ను వేసుకోవాలి.
8. రుచికి సరిపడా ఉప్పును కూడా కలిపి ఈ మొత్తాన్ని ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించుకోవాలి.
9. అంతే టేస్టీ అండ్ సింపుల్ బ్రకోలీ బ్రేక్ ఫాస్ట్ రెడీ అయినట్టే.
10. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం 10 నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుంది. కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
ఆధునిక కాలంలో బరువు పెరగడం అనేది ఎక్కువ మందికి సమస్యగా మారింది. ఇక్కడ మేము బ్రకోలీతో చేసిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇచ్చాము. ఇది మీరు నెల రోజులు పాటు తింటే కచ్చితంగా మూడు నుంచి ఐదు కిలోలు తగ్గే అవకాశం ఉంది. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనివల్ల మీరు ఇతర ఆహారాలు తినాలన్న కోరిక తగ్గిపోతుంది. రోజులో మీరు తినే ఆహారం తగ్గితే శరీరంలోని కొవ్వు కూడా కరిగిపోవడం మొదలవుతుంది. కాబట్టి బ్రకోలీ తో చేసిన ఈ బ్రేక్ ఫాస్ట్ రెసిపీని వారంలో నాలుగు ఐదు సార్లు తినేందుకు ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.