Juices To Drink For Hair Growth । జుట్టు రాలటాన్ని అరికట్టి, పెరుగుదలను ప్రోత్సహించే జ్యూస్‌లు
Hair fall Prevention and Regrowth: రాలిపోయిన జుట్టును తిరిగి పెంచాలంటే బయటి నుంచి లోపలి నుంచి సరైన పోషణ అవసరం. వెంట్రుకలు రాలటాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఈ జ్యూస్ లు తాగాలి.
కష్టపడి పండిచుకున్న పంటచేలు ఎండిపోతే ఒక రైతుకు ఎంత బాధ ఉంటుందో, ఇష్టపడి పెంచుకున్న జుట్టు రాలిపోతే కూడా ఏ వ్యక్తికైనా అంతే బాధ ఉంటుంది. జుట్టు రాలడం అనేది ఇప్పుడు చాలా మందిని పట్టిపీడిస్తున్న సమస్య. జుట్టు సంరక్షణ కోసం ఏం చేసినా, తలకు ఏం పూసినా, ఒక్కొక్క వెంట్రుక రాలిపోతూ ఉంటే గుండెల్లో సూదులు గుచ్చినట్లుగా ఉంటుంది.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, జీవనశైలి, జన్యుపరమైన కారణాలు మొదలైనవి జుట్టు రాలిపోవటానికి ప్రధాన కారణాలుగా ఉంటాయి. ముఖ్యంగా సీజన్ మారుతున్నప్పుడు, ఈ జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో జుట్టు రాలడాన్ని నివారించడానికి ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండదు. రసాయన ఉత్పత్తులు ఎంత ఖరీదైనవి అయినప్పటికీ మీ జుట్టుకు నష్టమే కలిగిస్తాయి కానీ ప్రయోజనం చేకూర్చవు.
అటువంటప్పుడు సహజ గుణాలు కలిగిన షాంపూ, కండీషనర్, ఆయిల్, హెయిర్ ప్యాక్‌లతో పాటు జుట్టు సంరక్షణ కోసం లోపలి నుంచి పోషణ అందించాలి. ఇందుకోసం తాజా పండ్లు, కూరగాయల రసాలు తీసుకోవాలి. జ్యూస్‌లు ఆరోగ్యానికే కాదు చర్మానికి, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తాయి. వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించే జ్యూస్‌లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Juices For Hair Fall Prevention And Hair Regrowth- వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించే జ్యూస్‌లు:
క్యారెట్ జ్యూస్
క్యారెట్ అనేది విటమిన్లు A , E లకు గొప్ప మూలం. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే అకాల తెల్ల వెంట్రుకలను కూడా నివారిస్తుంది. మీరు ఒత్తైన, పొడవాటి జుట్టును పొందాలనుకుంటే. ఆహారంతో పాటుగా రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్‌ని కూడా తాగండి.
కివీ జ్యూస్
కివీ జ్యూస్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగడం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కివీ పండులోని గుజ్జును మీ తలపై అప్లై చేయడం వల్ల మీ జుట్టు నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
కలబంద జ్యూస్
అలోవెరా జ్యూస్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో అనేక రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జుట్టును బలంగా చేస్తాయి. ఈ జ్యూస్ తరచుగా తాగుతుండటం వలన జుట్టు చిట్లిపోయే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. ఈ జ్యూస్‌లో ఉండే ఎంజైమ్‌లు స్కాల్ప్‌కు హైడ్రేట్, పోషణను అందిస్తాయి. కలబంద జ్యూస్‌ను తాగడమే కాకుండా తలకు కూడా పట్టిస్తే చుండ్రు, దురద వంటివి తొలగిపోతాయి. అంతే కాదు, జుట్టును సిల్కీగా, మెరిసేలా చేస్తుంది.
ఉసిరి జ్యూస్
ఉసిరి జ్యూస్‌లో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే విటమిన్-సి పుష్కలంగా ఉన్నందున, ఇది జుట్టు, స్కాల్ప్‌కు చాలా మంచిది. క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తాగడం వల్ల కొత్త కణాలు ఏర్పడేలా ప్రోత్సహిస్తుంది. మీకు ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే, ఉసిరి రసాన్ని తాగుతూ ఉండండి.
జామ జ్యూస్
జామ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు జుట్టుకు కూడా గొప్ప పోషణను అందిస్తాయి. జామ రసాన్ని తాగడమే కాకుండా జామ ఆకులను మరిగించి దానిని తలకు పట్టిస్తే జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు కూడా జుట్టు రాలటానికి ఒక కారణం. అనవసర ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. యోగ, ధ్యానం ఆచరించడం వలన గొప్ప మేలు కలుగుతుంది.
సంబంధిత కథనం