Ramadan 2022 | పండగలో తియ్యని వేడుక.. ఇఫ్తార్ విందులోకి చల్లని బటర్ రిచ్ డేట్స్
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన రంజాన్ మాసం వచ్చేసింది. ఈ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలో ఉంటారు. ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటారు. వారి కోసం ప్రత్యేకమైన బటర్ రిచ్ డేట్స్ రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం.. అందరితో ఈ రెసిపీని పంచుకోండి. పండగను మరింత మధురంగా మార్చుకోండి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతగానో ఎదురుచూస్తున్న రంజాన్ నెల రానే వచ్చేసింది. నేడు ఏప్రిల్ 3 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. నేటి నుంచే ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ప్రతిరోజు సెహ్రీ సమయం దాటిన తర్వాత సాయంత్రం వరకు ఈ ఉపవాస కఠిన దీక్ష కొనసాగుతుంది. మళ్లీ సాయంత్రం తర్వాత ఇఫ్తార్ విందుతో ఉపవాస విరమణ చేస్తారు.
రోజంతా ఆకలిదప్పికలను అదుపులో ఉంచుకొని కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు కాబట్టి బలవర్థకమైన పోషకాహారం స్వీకరించాల్సి ఉంటుంది. తినే ఆహారం విషయంలో సమతుల్యత కలిగి ఉండి సరైన ఆహారాన్ని ఎంచుకోవాలి. చాలా మంది ముస్లింలు రంజాన్ మాసంలో తమ సాంప్రదాయ విందులో భాగంగా ఖర్జూర పండ్లను తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇందుకోసమే పోషకాహార నిపుణులైన పూజా మఖిజా బటర్ చాక్లెటీ రుచిగల ఖర్జూర పండ్ల రెసిపీని పరిచయం చేస్తున్నారు.
బటర్ రిచ్ డేట్స్ రెసిపీకి కావలసినవి:
- ఖర్జూర పండ్లు
- పీనట్ బటర్
- కాజు, బాదాం లేదా పిస్తా పలుకులు
- డార్క్ చాక్లెట్
తయారీ విధానం
ముందుగా ఖర్జూరాలను తీసుకుని అందులోని గింజలను తొలగించండి. ఇప్పుడు తొలగించిన గింజ స్థానంలో బీనట్ బటర్ నింపండి, అలాగే ఖర్జూరాలకు పూర్తిగా పీనట్ బటర్ పట్టించండి. ఆపై బాదాం,పిస్తా లేదా కాజు పలుకులను చిన్నగా తురిమి, ఆ ముక్కలను బటర్ నింపిన ఖర్జూరాలపై చల్లుకోండి. ఇప్పుడు ఈ ఖర్జూరాలను డార్క్ చాక్లెట్‌లో ముంచాలి. ఇలా చాక్లెట్ కోట్ చేసి ఖర్జూరాలను రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి. ఆ మరుసటి రోజు వీటిని చల్లచల్లగా తింటూ రుచిని ఆస్వాదించండి. క్రీమీగా, క్రంచీగా, చాక్లెటీగా ఎంతో టేస్టీగా ఉండే ఇలాంటి ఖర్జూరాలను మీరు ఇదివరకు ఎప్పుడూ తిని ఉండరు. అయితే ఇకపై ఎప్పుడూ ఇలాగే తినాలనుకుంటారు.
సంబంధిత కథనం