Lava stone jewellery: భగభగమండే లావాతో నగలు, వస్తువులు.. లావాను ఇలా వాడతారని తెలుసా?
Lava stone jewellery: లావా స్టోన్ తో తయారు చేసే జ్యువెలరీ గురించి విన్నారా? లావా నుంచి వాటిని ఎలా తయారు చేస్తారు? వాటి ఉపయోగాలేంటో వివరంగా తెల్సుకోండి.
భూమి కడుపులో పుట్టి అగ్ని ద్వారా బయటికి వచ్చిన లావాకు ప్రత్యేక లక్షణాలుంటాయి. అగ్ని పర్వతం పేలినప్పుడు అందులో నుంచి బయటకు వచ్చిన లావా గట్టిగా రాయిలాగా మారిపోతుంది. భగభగ మండుతూ పొగలు గక్కే లావా భూమి ఉపరితలం చేరిన వెంటనే చల్లబడటం మొదలెడుతుంది. అలా చల్లబడి గట్టిగా మారిన రాయితోనే లావా స్టోన్ జ్యువెలరీ తయారు చేస్తారు. బంగారం, వెండి ఆభరణాలు ధరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అయితే అంతకుమించి ప్రయోజనాలు ఈ లావాతో చేసిన లావా స్టోన్ జ్యువెలరీతోనూ ఉంటాయి.
లావా స్టోన్ ఎలాగుంటుంది?:
మనం వాడే ప్యూమిస్ స్టోన్ ఉపరితలం లాగే లావా స్టోన్ కూడా ఉంటుంది. చూడ్డానికి మీద చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి. లావా చల్లబడేటప్పుడు దాంట్లో ఉన్న గాలి బుడగల వల్ల, కదలికల వల్ల లావా స్టోన్ మొత్తం అనేక రంధ్రాలుంటాయి. దీంట్లో ఎన్నో రకాల మినరళ్లుంటాయి.
లావా స్టోన్ రంగు:
లావా అంటే మండీ మండీ వేడెక్కి చల్లారాక తయారైంది. అందుకే వాటి రంగు సాధారణంగా నలుపు లేదా బూడిద రంగులో ఉంటుంది. కొన్ని లావా స్టోన్స్ మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. కొన్నిసార్లు లావా ప్రవాహంలో ఇనుము ఆక్సీకరణం చెందడం వల్ల లావా స్టోన్ రంగు ఎర్రగా ఉండొచ్చు.
లావా స్టోన్ వాడకం:
లావా స్టోన్‌ను చాలా రకాలుగా ఉపయోగిస్తారు. పాత్రల తయారీలో, రంగుల తయారీలో, వంట పాత్రలు, పూసలు ఈ రాయితో తయారు చేస్తారు. బట్టలకు రంగులు అద్దడానికి, ఫర్నీచర్ తయారీలో, గోడలు కట్టడానికి, ముఖం, శరీరం పెయింటింగుల కోసం దీన్ని వాడతారు. చర్మాన్ని శుభ్రం చేయడానికీ ఈ స్టోన్ వాడతారు. అలాగే అరోమా థెరపీ కోసం ఈ లావా స్టోన్ పూసలు పనిచేస్తాయి. లావా స్టోన్ తో తయారు చేసిన పాత్రల్లో వంటలు వండితే ఆహారం చాలా సేపు వేడిగా ఉంటుంది. అందుకే పాత కాలంలో కొన్ని చోట్ల లావా స్టోన్ పాత్రల్లోనే ఎక్కువ సేపు ఉడికించి ఆహారం చేసేవాళ్లు.
లావా స్టోన్ జ్యువెలరీ:
లావా స్టోన్ ఎన్ని రకాలుగా వాడినా వాటిలో ముఖ్యమైంది మాత్రం లావా స్టోన్‌తో తయారు చేసే జ్యువెలరీ. లావా స్టోన్‌ను పెద్ద పూసలుగా చేసి వాటిని మెడలో హారం లాగా, చేతికి బ్రేస్‌లెట్ లాగా వేసుకుంటారు. దీంతో చేసిన జ్యువెలరీ చర్మానికి ఎంత తాకితే అంత మంచిదని చెబుతారు. నాడీ కొట్టుకునే మణికట్టు, గుండె కొట్టుకునే చోట తాకితే ఎంతో మేలని నమ్ముతారు. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.
ఆందోళన తగ్గిస్తాయి:
ఈ లావా స్టోన్స్ ఆందోళనను తగ్గించి శరీరాన్ని శాంత పరుస్తాయట. కోపం ఎక్కువగా ఉన్నవాళ్లు, గాబరా పడేవాళ్లు, నెగటివి థింకింగ్ ఉన్నవాళ్లు వీటిని ధరించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంచి మానసిక స్థైర్యం పెరగుతుంది. మన శరీరంలో ఉండే మూల చక్రాన్ని ఈ లావా స్టోన్ జ్యువెలరీ ఉత్తేజితం చేస్తుంది. మొక్కకు వేర్లు ఎలాగో శరీరానికి మూల చక్రం అలాంటిదని యోగా శాస్త్రం చెబుతుంది. వేరు బలంగా ఉంటే చెట్టు ఆరోగ్యంగా ఉన్నట్లే.. మూల చక్రం ఉత్తేజంగా ఉంటే మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. ఇలా అనేక ఆరోగ్య సమస్యలు మన ధరిచేరకుండా కాపాడుతుంది.
అరోమాథెరపీ:
ఈ లావా స్టోన్ పూసలు ముట్టుకుంటే మృదువుగా ఉంటాయి. కానీ, వాటి నిండా సన్నం రంధ్రాలుంటాయి. ఈ లక్షణం వల్ల వీటిని అరోమాథెరపీ కోసం వాడతారు. చెప్పాలంటే సుగంధాలు వెదజల్లే డిఫ్యూజర్ లాగా ఇవి పనిచేస్తాయి. మార్కోట్లో వందల రకాల ఎసెన్షియల్ నూనెలుంటాయి. ఒక్కో నూనె ఒక్కో సమస్య తగ్గిస్తుంది. ఆందోళన, ఒత్తిడితో బాధపడేవాళ్లు ఈ పూసల్లో రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని మెడలో కానీ, చేతికి కాని జ్యువెలరీ పీస్ లాగా పెట్టుకుంటే చాలు. రోజంతా ఆ వాసనతో ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా నిమ్మ, ల్యావెండర్ ఎసెన్షియల్ నూనెలను ఈ పూసల్లో వేయడానికి వాడతారు.
టాపిక్