Good Friday 2024: క్రిస్మస్ వచ్చిందంటే ‘హ్యాపీ క్రిస్మస్’ విషెస్ వెల్లువలా ఫోన్లలో వచ్చి పడతాయి. ఇక సంక్రాంతి, ఉగాదులకు చెప్పక్కర్లేదు. కానీ గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని మెసేజ్‌లు పంపుకోరు. ఎందుకంటే ఇది క్రైస్తవ సోదరులు ఆనందంగా నిర్వహించుకునే పండుగ కాదు. ఒకరికొకరు ఎదురుపడినా కూడా చిరునవ్వుతోనే పలకరించుకుంటారు. హ్యాపీ గుడ్ ఫ్రైడే వంటి విషెస్ చెప్పుకోరు. ఎందుకంటే ఈ పండుగను పరమ పవిత్రుడైన యేసు మరణానికి సంతాపాన్ని తెలియజేయడానికి నిర్వహించుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజు అన్ని చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరగవు.
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే ఒక పుణ్య దినం. ఇదే రోజు యేసును తీవ్రంగా కొట్టి, జీవించి ఉండగానే శిలువ వేశారు. ఆయన శిలువ పైనే తన చివరి శ్వాసను వదిలారు. మరణించడానికి ముందు శిలువ పైనే 6 గంటల పాటు ఎంతో బాధను అనుభవించారని చెప్పుకుంటారు. చివరగా ఒక పెద్దగా ఓసారి అరిచి తన చివరి శ్వాసను విడిచి పెట్టారని అంటారు. అప్పుడు లోకమంతా వెలుగును కోల్పోయిందని, భూమి ఒక్కసారిగా కంపించిందని చెప్పుకుంటారు. యేసును ఏ రోజు శిలువ వేశారో కచ్చితంగా తేదీని ఎవరూ చెప్పలేరు. ఆ తేదీపై ఎక్కడా ఏకాభిప్రాయం కూడా లేదు. కానీ శుక్రవారమే ఇది జరిగిందని మాత్రం బైబిల్ చెబుతోంది. అందుకే శుక్రవారం గుడ్ ఫ్రైడే నిర్వహించుకుంటారు.
శుక్రవారం యేసు మరణించిన దినోత్సవం. కాబట్టి ఆ రోజున ఈ పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఫ్రైడే కి ముందు గుడ్ అనే పదం ఎందుకు చేర్చారు? అన్నది ఎక్కువ మందిలో ఉన్న సందేహం. యేసు మరణించడం అనేది మనసులను బాధపెట్టే సందర్భం. కానీ ఆ రోజున చాలా పవిత్రమైనదిగా ప్రతి ఒక్కరూ పరిగణిస్తారు. యేసు మరణించింది ప్రజల కోసం, ప్రజల పాపాలను కడిగివేయడం కోసం. అందుకే ఆయన చనిపోయిన శుక్రవారం అందరికీ మంచి చేసిందని నమ్ముతారు. అందుకే ఫ్రైడే కి ముందు గుడ్ అనే పదం చేరింది.
క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను పరమ పవిత్రంగా నిర్వహించుకుంటారు. గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. ఇవి దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు.
ఏ క్రైస్తవ సోదరునికి గుడ్ ఫ్రైడే రోజు విషెస్ చెప్పకండి. వారు ఆ రోజు ఆనందంగా ఉండరు. యేసును శిలువ వేసిన క్షణాన్ని తలుచుకొని బాధలో ఉంటారు. శిలువ వేసిన క్రీస్తును తలచుకొని చెక్కతో చేసిన శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు.
టాపిక్