Gongura Curry: పుల్లపుల్లని గోంగూర గ్రేవీ ఒకసారి వండి చూడండి
Gongura Curry: గోంగూరతో చేసే వంటకాలు టేస్టీగా ఉంటాయి. కానీ ఎక్కువమంది గోంగూర పచ్చడి మాత్రమే చేసుకుంటారు.
Gongura Curry: తెలుగు వారికి ఇష్టమైన ఆకుకూరల్లో గోంగూర ఒకటి. దీంతో చేసే గోంగూర పచ్చడి అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది. అంతేకాదు రొయ్యలు గోంగూర కూడా ఎంతో మందికి ఇష్టమైన కాంబినేషన్. పప్పు గోంగూరను వండుకునే వారి సంఖ్య ఎక్కువే. అయితే గోంగూరతో గ్రేవీనివండుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు. గోంగూర గ్రేవీ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే పులుపుగా టేస్టీగా అనిపిస్తుంది. దీని తయారు చేయడం చాలా సులువు. కూరలాగే ఉంటుంది కాబట్టి, ఇది వండుకున్నాక మరొక కూర వండుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాదు ఇది తక్కువ కూరే ఎక్కువ ఆనందంలో కలుస్తుంది. ఇదే ఈ గోంగూర గ్రేవీ స్పెషాలిటీ. దీన్ని ఎలా వండాలో ఒకసారి చూద్దాం.
గోంగూర ఇగురు రెసిపీకి కావలసిన పదార్థాలు
గోంగూర - రెండు కట్టలు
ఉల్లిపాయ - ఒకటి
టమోటాలు - రెండు
పచ్చిమిర్చి - మూడు
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో
పచ్చిశనగపప్పు - పావు కప్పు
బియ్యప్పిండి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - మూడు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూను
ఎండుమిర్చి - మూడు
నీరు - ఒక కప్పు
మినప్పప్పు - ఒక స్పూను
పసుపు - అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు- 10
కారం - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
జీలకర్ర - ఒక స్పూన్
గోంగూర గ్రేవీ రెసిపీ ఇదిగో
1. గోంగూరను ఏరి బాగా కడిగి తడి ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు సెనగపప్పును ఒక గంట ముందే నానబెట్టుకోవాలి.
3. కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి సెనగపప్పు, నీరు, గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
4. ఆ తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో మిశ్రమాన్ని బాగా మెత్తగా మెదపాలి.
5. ఇప్పుడు బియ్యప్పిండిని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కలిపి ఉంచాలి.
6. స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో పెట్టి గోంగూర మిశ్రమాన్ని మళ్లీ ఉడికించాలి.
7. అందులో బియ్యప్పిండి కలిపిన నీటిని వేసి బాగా కలపాలి.
8. చిక్కగా గ్రేవీలా అయ్యే వరకు ఉడికించాలి. కారం, పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
9. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి.
10. తాళింపు కోసం చిన్న కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేసుకోవాలి.
11. నూనెలో ఆవాలు, తరిగిన ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకులు వేసి బాగా వేయించి గోంగూరలో వేయాలి.
12. అంతే పుల్ల పుల్లని గోంగూర ఇగురు రెడీ అయినట్టే.
13. దీన్ని చపాతీలో తిన్నా బాగుంటుంది లేదా అన్నంతో కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది.
14. అన్ని వయసుల వారు దీన్ని తినవచ్చు. చలికాలంలో ఈ గోంగూర తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
15. ఇందులో వాడినవన్నీ మన ఆరోగ్యానికి అవసరమైనవి. కాబట్టి గోంగూర గ్రేవీని తిని ఎంజాయ్ చేయండి.
టాపిక్