GI tag for Red ant Chutney: ఎర్ర చీమల చట్నీకి ప్రతిష్టాత్మక జిఐ ట్యాగ్, ఏంటీ జిఐ ట్యాగ్? దీన్ని ఎందుకు ఇస్తారు?
GI tag for Red ant Chutney: ఎర్ర చీమల చట్నీ అనగానే మనకు అదోలా ఉంటుంది కానీ ఒడిశా వాళ్లకు మాత్రం ఇది ఎంతో ఇష్టం

GI tag for Red ant Chutney: ఎర్ర చీమల చట్నీని మన దేశంలో ఒడిషాలో అధికంగా తింటారు. అలాగే గిరిజన తెగలకు చెందిన ప్రజలకు ఈ ఎర్ర చీమల చట్నీ అంటే ఎంతో ఇష్టం. పురాతన కాలం నుండి ఎర్ర చీమలతో చట్నీ చేసుకొని తినడం వారికి అలవాటుగా ఉంది. ఈ అరుదైన వంటకానికి ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా పుట్టినిల్లుగా చెప్పుకుంటారు. ఇక్కడ వారి వంటకాలలో ఈ రెడ్ యాంట్ చట్నీ ఒక భాగంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆ ప్రాంతానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కింది.
ఈ చట్నీని ఎర్ర చీమలు, కొన్ని రకాల మసాలా దినుసులు, మూలికలు వేసి రోట్లో దంచి చేస్తారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయని అక్కడి గిరిజనుల నమ్మకం. అందుకే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్‌ను ఒడిశాకు ఇచ్చారు. ఎర్ర చీమలు కుడితే ఎంతో బాధాకరంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు వచ్చేస్తాయి. ఈ ఎర్ర చీమలు ఒడిశాలోని మయూర్భంజ్, సిమిలిపాల్ అడవుల్లో, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో, ఛత్తీస్ ఘడ్ అడవుల్లో ఉన్నాయి. అక్కడ బతికే గిరిజనులు ఈ ఎర్ర చీమల చట్నీని అధికంగా తింటూ ఉంటారు.
ఈ ఎర్ర చీమల చట్నీ తినడం వల్ల క్యాల్షియం, ప్రోటీన్, జింక్, విటమిన్ బి12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు ఈ పచ్చడి తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఈ పచ్చడి ఎంతో మేలు చేస్తుందని వివరిస్తున్నారు. ఎవరైతే అలసట, డిప్రెషన్, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో, వారు ఎర్ర చీమల చట్నీని తినడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని చెబుతున్నారు నిపుణులు.
ఈ ఎర్ర చీమల చట్నీ ఒడిస్సాలోని స్థానిక వంటకాల్లో ఒక భాగం అయిపోయింది. చెట్లపై ఎర్ర చీమలు అధికంగా పుట్టలు పెట్టుకొని జీవిస్తూ ఉంటాయి. వాటిని బట్టి స్థానిక మార్కెట్లలో అమ్ముతూ ఉంటారు. అలాగే వేరుగా చీమల చట్నీ విక్రయిస్తారు. ఈ చీమలను, వాటి గుడ్లను సేకరించాక అనేకసార్లు శుభ్రపరిచాకే వాటితో చట్నీని చేస్తారు. అల్లం వెల్లుల్లి, మిరపకాయలు, ఉప్పు, వంటివన్నీ వేసి రోట్లో రుబ్బుతారు. మరీ మెత్తగా కాకుండా బరకగా ఈ చట్నీని తయారు చేస్తారు.
ఎందుకు ఇస్తారు?
జీఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఇది ప్రభుత్వం ఇచ్చే ఒక భౌగోళిక గుర్తింపు. కొన్ని ప్రాంతాలు కొన్ని రకాల ఆహార పదార్థాలకు, ఉత్పత్తులకు ప్రసిద్ధి. తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, కాశ్మీరీ కుంకుమపువ్వు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి. అవి ఆ ప్రాంతానికే చెందినవని గుర్తిస్తూ, అవి అక్కడే ఉత్పత్తి అయ్యాయని తేల్చిన తర్వాత ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇస్తారు. ఆ ఉత్పత్తులు ఉన్నంతకాలం ఆ ప్రాంతానికే వాటి విలువ దక్కుతుంది. ఇలా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందడం వల్ల ఆ ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. అంతేకాదు మార్కెట్లో ధర కూడా పెరుగుతుంది. ప్రముఖ ఆన్లైన్ సంస్థలు కూడా వీటిని విక్రయించేందుకు ముందుకు వస్తాయి.
జీఐ ట్యాగ్ అందించే సంస్థ చెన్నైలో ఉంది. ఇది ప్రభుత్వ సంస్థ. వ్యక్తులు, లేదా సంస్థలు తమ ప్రాంతానికి చెందిన ఉత్పత్తి గురించి వివరిస్తూ జీఐ ట్యాగ్ కావాలని వారికి దరఖాస్తు పెట్టుకోవాలి. వారు అన్ని రకాల పరిశీలనలు చేసి జీఐ ట్యాగ్ అందిస్తారు. ఈ ట్యాగ్ కాల పరిమిది పదేళ్లు. పదేళ్ల తరువాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
టాపిక్