Stye: కంటి కురుపు ఇబ్బంది పెడుతుందా? వీటికి చికిత్స ఏంటి?-get rid of eye stye with these tricks and remedies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Get Rid Of Eye Stye With These Tricks And Remedies

Stye: కంటి కురుపు ఇబ్బంది పెడుతుందా? వీటికి చికిత్స ఏంటి?

Manda Vikas HT Telugu
Dec 27, 2021 07:03 PM IST

కనురెప్పలపై లేదా కంటికి దిగువ భాగంలో అప్పుడపుడు చిన్నని గడ్డల్లాగా ఏర్పడతాయి, వీటినే మనం వాడుక భాషలో కంటికురుపులు అని పిలుస్తాము. వైద్య పరిభాషలో వీటినే హార్డియోలమ్ (hordeolum) లేదా స్టై (stye) అంటారు. ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చాలావరకు ఈ బ్యాక్టీరియాలతో ఎలాంటి హాని ఉండదు కానీ, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినపుడు మాత్రం అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి.

Eye Stye- Representational Image
Eye Stye- Representational Image (Stock Photo)

కంటికి బాహ్యవైపు కనురెప్పలపై లేదా కంటికి దిగువ భాగంలో అప్పుడపుడు చిన్నని గడ్డల్లాగా ఏర్పడతాయి, వీటినే మనం వాడుక భాషలో కంటికురుపులు అని పిలుస్తాము. వైద్య పరిభాషలో వీటినే హార్డియోలమ్ (hordeolum) లేదా స్టై (stye) అంటారు. ఇదొక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా కంటిరెప్పలకు ఉండే వెంట్రుకల కుదుళ్లలో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అభివృద్ధి చెందుతుంది. స్టెఫిలోకాకస్ వర్గానికి చెందిన బ్యాక్టీరియాలు ఈ రకమైన కురుపులు కలగజేయడానికి కారణమవుతాయి. అంతేకాకుండా ఇదొక అంటువ్యాధి, ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

సహజంగానే మన శరీరం అనేక బాక్టీరియాలు, వైరస్ లకు ఆవాసంగా ఉంటుంది. కంటిరెప్పల వద్ద ఉండే వెంట్రుకల కుదుళ్లలో ఒకరకమైన నూనె గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల్లోనే ఇవి ఆవాసం ఏర్పర్చుకుంటాయి, చాలావరకు ఈ బ్యాక్టీరియాలతో ఎలాంటి హాని ఉండదు కానీ, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినపుడు మాత్రం అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. ఇలా సంఖ్య వృద్ధి చెందిన భాగంలో ఎర్రని పొక్కులాగా మారి దురద, మంటను కలుగజేస్తాయి.

వీటికి చికిత్స ఏంటి?

ఎలాంటి కంటికురుపులైనా చికిత్సతో కానీ, లేదా చికిత్స లేకుండానే వాటంతటవే 1 నుంచి 2 వారాలలో అదృశ్యమవుతాయి. అయినప్పటికీ ఈ కంటికురుపులు ఉన్నంతకాలం నొప్పిని కలుగజేస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి వీటిని వదిలించుకోవటానికి ప్రయత్నిస్తాం. కంటి కురుపులను వివిధ పద్ధతుల్లో తొలగించుకోవచ్చు. అయితే పొరపాటున కూడా గిల్లడం, బలవంతంగా తొలగించే ప్రయత్నం చేయవద్దు. మాటిమాటికి కళ్లను తాకడం, రుద్దడం కూడా చేయవద్దు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్  మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ చికిత్స, కొన్ని నివారణ మార్గాలు సూచిస్తున్నాం, వాటిని పాటించండి.

వేడి గుడ్డతో తాపడం:

ఏదైనా మెత్తని కాటన్ గుడ్డను వేడి చేసి ఇన్ఫెక్షన్ ఉన్న చోట అదిమిపట్టి సున్నితంగా మర్ధన చేయాలి.  గుడ్డ వేడిమి మరీ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభించిన అనుభూతి కలుగుతుంది. ఇలా రోజుకు కొన్నిసార్లు చేస్తూ ఉండటం ద్వారా గ్రంథుల్లో తయారైన చీములాంటి పదార్థం కుచించుకుపోయే అవకాశం ఉంటుంది.

కంటి పరిశుభ్రత:

కంటికరుపులు ఏర్పడకుండా ఉండటానికి కంటి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం ముఖ్యం. స్టై అనేది ఒక అంటువ్యాధి కాబట్టి ఇతరుల నుంచి వ్యాప్తి చెందకుండా నివారించుకోగలగాలి. ఒకరు వాడిన కళ్ల కాటుక వాడటం, కంటికి ఇబ్బంది కలిగించే మేకప్ సామాగ్రి వాడటం లాంటివి చేయకూడదు. కంటిని చల్లటి, స్వచ్ఛమైన నీటితో అప్పుడప్పుడూ కడుగుతూ ఉండాలి. కడిగేటపుడు చేతులు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇన్ఫెక్షన్ తగ్గేవరకు కాంటాక్ట్ లెన్సెస్ ధరించకపోవడం మంచిది.

ఓవర్-ది-కౌంటర్ (OTC) మెడిసిన్: 

కంటికి ఉపయోగించే ఔషధాలు, కంటి చుక్కలు, నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్ లాంటివి ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తేవచ్చు. ఇబుప్రోఫెన్ లాంటి నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ల్ఫమేటరీ డ్రగ్స్ మంటను, వాపును తగ్గించగలవు.

యాంటీబయాటిక్స్:

యాంటీబయాటిక్స్ కంటికురుపు పెరగడానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అందువల్ల యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా వ్యాప్తి పెరగకుండా నిరోధించవచ్చు.

వీటితో ఫలితం లేదనుకుంటే వైద్యుడిని సంప్రదించాలి. సమస్య తీవ్రతను బట్టి వైద్యులు స్టెరాయిడ్లను ఇంజెక్ట్ చేయడం ద్వారా గానీ లేదా శస్త్ర చికిత్స చేసి నయం చేస్తారు.

WhatsApp channel