Gangavalli mango dal: గంగవాయిల ఆకుకూరతో.. రుచికరమైన మామిడికాయ పప్పు..
Gangavalli mango dal: గంగవాయిల ఆకుకూర, మామిడికాయ కలపి రుచికకరమైన పప్పు ఎలా చేసుకోవాలో చూడండి.
గంగవాయిల కూర
చాలా రకాల ఆకు కూరలు తింటూ ఉంటాం. కానీ చాలా మందికి ఈ గంగవాయిల కూర గురించి తెలీదు. వేసవిలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. ఇది సీజన్ లో దొరికే మామిడి కాయలతో దీని పప్పు రుచిగా చేసుకోవచ్చు. దీంట్లో పోషకాలు కూడా చాలా ఎక్కువ. గంగవాయిల పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
1 చిన్న మామిడి కాయ
1 కట్ట గంగవాయిల కూర
సగం కప్పు పెసరపప్పు
1 చిన్న ఉల్లిపాయ ముక్కలు
రెండు చెంచాల పల్లీలు
1 రెమ్మ కరివేపాకు
2 చెంచాల నూనె
సగం చెంచా ఆవాలు
సగం చెంచా జీలకర్ర
చెంచా జీలకర్ర పొడి
చెంచా ధనియాల పొడి
తగినంత ఉప్పు
సగం చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
సగం చెంచా పసుపు
1 స్పూన్ కారం
తయారీవిధానం:
- ముందుగా గంగవాయిల కూరను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కాడలతో సహా దీన్ని వాడుకోవచ్చు.
- ఇపుడు ఒక కడాయిలో నూనె వేసుకుని, ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు వేసుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక చెక్కు తీసి తరుగుకున్న మామిడి కాయ ముక్కలు వేసుకోవాలి. ఇపుడు గంగవాయిల ఆకు కూడా వేసుకోవాలి.
- అవి మెత్త బడ్డాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసుకుని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
- ఇపుడు పదినిమిషాలు నానబెట్టుకున్న పెసర పప్పు వేసుకుని కప్పున్నర నీళ్లు పోసుకోవాలి. పప్పు ఉడికాక దించేసుకుంటే కమ్మని గంగవాయిల మామిడి పప్పు కూర సిద్దం.