Fathers Day Gift Ideas : ఫాదర్స్ డే రోజున మీ నాన్న కోసం ఈ గిఫ్ట్స్ ప్లాన్ చేయండి
Fathers Day Gift Ideas In Telugu : ఫాదర్స్ డే దగ్గరకు వస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున మీ నాన్న కోసం మీరు కొన్ని బహుమతులు ప్లాన్ చేస్తూ ఉండవచ్చు. కానీ ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటివారి కోసం కొన్ని ఐడియాలు.
ఈ ప్రపంచంలో తండ్రి ఇచ్చినంత మద్దతు ఎవరి దగ్గర నుంచి దొరకదు. చిన్నప్పటి నుంచి మీరు ఉద్యోగం చేస్తున్నంత వరకూ ఆయన మీకు ప్రతీ చోటా సపోర్ట్ చేస్తారు. మీ ప్రతీ అడుగులో అండగా నిలుస్తారు. ఎల్లప్పుడూ మనకు వెన్నుదన్నుగా ఉంటారు. మనకు రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నా.. కింద పడిపోతామేమోనని.. మన లక్ష్యాల సాధించేందుకు వెనకాలే ఉంటారు.
అమ్మ ప్రేమ చూపించినట్టుగా.. తండ్రి తన ప్రేమను చూపించలేడు. ఎక్కడో చీకట్లో నీ కోసం కన్నీరు కారుస్తూ ఉంటాడు తండ్రి. వెలుతురులో మాత్రం నీతో సీరియస్‌గానే ఉంటారు. ఎందుకంటే నువ్ తప్పు దారిలో వెళ్తావని ఆయన భయం. మనకు కావలసినవన్నీ అందిస్తారు. మన కలలను నిజం చేస్తారు. ఏదైనా కావాలి అని అడిగితే కొన్నిసార్లు నేరుగా ఇవ్వకుండా అమ్మ ద్వారా మీకు అందిస్తాడు. మీపై ప్రేమను తనలోనే దాచి పెట్టుకుని ప్రతీ విషయంలో మీకు అండగా ఉంటారు. అలాంటి తండ్రులకు ఫాదర్స్ డే రోజున మీరు ఇచ్చే బహుమతి ప్రత్యేకంగా ఉండాలి.
ఫాదర్స్ డే జూన్ 16న జరుపుకొంటారు. ఈ సమయంలో వారికి నచ్చిన బహుమతులు ఇవ్వండి. వారిని ఆనంద పెట్టండి. ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకొనేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. కానీ ఎలాంటి బహుమతి తండ్రికి ఇవ్వాలని అనే విషయంలో మాత్రం క్లారిటీ ఉండదు. వారిని ఆనందపరిచేలా ఆలోచనాత్మక బహుమతుల జాబితా ఇక్కడ ఉంది. వాటిని ఇవ్వండి..
పుస్తకాలు
మీ నాన్న పుస్తకాల పురుగులా? ఆయన పుస్తకం చదవడం మీరు ఎప్పుడైనా చూశారా? అప్పుడు ఇంకేమీ ఆలోచించకండి. ఎందుకంటే మీ తండ్రిని పుస్తకం కంటే మరేదీ సంతోషపెట్టదు. ఆయన పుస్తకాల లైబ్రరీలో మంచి పుస్తకం చేరేందుకు ప్రయత్నించండి. చాలా కాలంగా మీ నాన్న చదవాలని ఆశిస్తున్న పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. చాలా సంతోషపడతారు.
పువ్వులు
ఫ్లవర్ బొకే ద్వారా ఆరోజున ఉదయం మీ నాన్నకు విషెస్ చెప్పండి. పూల గుత్తితో మేల్కొలపడం ద్వారా రోజును మరింత ప్రత్యేకంగా చేయండి. దీని ద్వారా చాలా సంతోషంగా ఫీలవుతారు. తండ్రికి నచ్చిన పూలతో ఒక బొకే ప్యాక్ చేసి ఇవ్వండి.
రోడ్ ట్రిప్
మీ నాన్నతో కలిసి రోడ్ ట్రిప్‌కి వెళ్లండి. ఈ సమయంలో ఆయన చిన్నప్పటి విషయాలు గుర్తుచేసుకుంటాడు. ప్రకృతిలో చాలా ఎంజాయ్ చేస్తారు. ఆడటానికి సరైన ప్లేజాబితాను సిద్ధం చేయండి. మీ నాన్నతో కలిసి టూర్ ప్లాన్ చేయండి. అయితే ఏ తండ్రి అయిన తన కొడుకు బైక్ మీద ఎక్కేందుకు ఆశగా చూస్తాడు. ఎందుకంటే అందులో దొరికే ఆనందం బాగుంటుంది. మీ నాన్నతో కలిసి బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్లండి.
మొక్కలు
మీ నాన్నగారికి గార్డెనింగ్ పట్ల మక్కువ ఉందా? అప్పుడు ఆయన మొక్కలను బహుమతిగా ఇవ్వడం అత్యుత్తమ బహుమతిగా ఉంటుంది. ఎందుకంటే తోట పనిని ఇష్టపడే తండ్రికి మెుక్కలంటే చాలా ఇష్టం. మీ గార్డెన్‌లో లేని రకం మెుక్కను తీసుకొచ్చి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
కేక్
ఫాదర్స్ డే ముందు రోజే మీరే స్వయంగా ఒక కేక్ తయారు చేయండి. దానిని ఫాదర్స్ డే రోజున మీ నాన్నకు అందించండి. ఆయన కేక్ కట్ చేస్తున్నప్పుడు చాలా సంబరపడిపోతారు. మీ నాన్నకు నచ్చిన ఫ్లేవర్ తయారుచేసి ఆయన ఆనందాన్ని చూడండి.