Goat Cheese: మేకపాలతో చేసిన చీజ్ అప్పుడప్పుడు తినండి, సాధారణ చీజ్ కన్నా దీనిలో పోషకాలు ఎక్కువ-eat goats milk cheese occasionally it has more nutrients than regular cheese ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Goat Cheese: మేకపాలతో చేసిన చీజ్ అప్పుడప్పుడు తినండి, సాధారణ చీజ్ కన్నా దీనిలో పోషకాలు ఎక్కువ

Goat Cheese: మేకపాలతో చేసిన చీజ్ అప్పుడప్పుడు తినండి, సాధారణ చీజ్ కన్నా దీనిలో పోషకాలు ఎక్కువ

Haritha Chappa HT Telugu
Mar 13, 2024 10:30 AM IST

Goat Cheese: చీజ్ అనగానే ఆవు లేదా గేదెపాలతో తయారు చేసిన చీజ్ గుర్తుకొస్తుంది. అయితే మేకపాలతో కూడా చీజ్‌ను తయారు చేస్తారు. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మేక పాల చీజ్‌తో ఉపయోగాలు
మేక పాల చీజ్‌తో ఉపయోగాలు (pixabay)

Goat Cheese: చీజ్ అంటే ఎంతో మందికి ఇష్టం. పిజ్జా, బర్గర్లో చీజ్ వేస్తేనే దానికి ఆ టేస్ట్ వచ్చేది. చీజ్‌ను అధికంగా గేదె పాలతో తయారుచేస్తారు. బయట మార్కెట్లో దొరికే చీజ్ అధికంగా ఇలాగే తయారయ్యేది. అయితే మేకపాలతో కూడా దీన్ని తయారు చేస్తారు. ఎప్పుడూ గేదెపాలతోనే కాదు, మేకపాలతో కూడా చీజ్ తయారు చేస్తారు. పోషకాహార నిపుణులు ఇలా మేకపాలతో చేసిన చీజ్‌ను కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. దీన్ని గోట్ చీజ్ అంటారు.

గోట్ చీజ్ ఎందుకు.

ఆవు, గేదె పాలతో చేసిన చీజ్ వెరైటీలతో పోలిస్తే మేకపాల చీజ్ త్వరగా జీర్ణం అవుతుంది. ఆవు పాల చీజ్ కన్నా ఈ మేకపాల చీజ్ లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్యతో బాధపడుతున్న వారు గోట్ చీజ్‌ను తింటే అది సులభంగా అరుగుతుంది. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

మేకపాలతో తయారు చేసిన చీజ్ లో ప్రోటీన్, క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ ఏ... పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఎముకల ఆరోగ్యానికి, కండరాలా పనితీరుకు చాలా అవసరం. చీజ్‌లో నిజానికి క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ తినడం వల్ల ఇది బరువును పెంచుతుందని, ఎన్నో అనారోగ్యాలను తెచ్చిపెడుతుందని అంటారు. అయితే మేకపాలతో చేసిన చీజ్ అనారోగ్యాలు వచ్చే అవకాశం తక్కువ. దీనిలో కొవ్వులు తక్కువగా ఉంటాయి.

రుచి ఎలా ఉంటుంది?

సాధారణ చీజ్‌తో పోలిస్తే మేకపాలతో చేసిన చీజ్ ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. మట్టి రుచిని కలిగి ఉంటుంది. అయితే సాధారణ చీజ్‌లాగే, మేకపాలతో చేసిన చీజ్ కూడా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. అధికంగా తీసుకుంటే ఇది చిన్న చిన్న సమస్యలకు కారణం అవుతుంది. బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇంకా అనేక అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఆవుపాలతో చేసిన చీజ్ అయినా, మేకపాలతో చేసిన చీజ్ అయినా, సోయా పాలతో చేసినది అయినా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. ఎప్పుడైతే మీరు అవసరానికి మించి తీసుకుంటారో... అది శరీరంలో నష్టాన్ని కలుగజేస్తుంది.

Whats_app_banner