Secrets of Skin: చర్మం గురించి ఈ విషయాలు తెలుసా, శరీరంలో ఎన్ని పనులు చేస్తుందంటే!-do you know these things about the skin how many things it does in the body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Secrets Of Skin: చర్మం గురించి ఈ విషయాలు తెలుసా, శరీరంలో ఎన్ని పనులు చేస్తుందంటే!

Secrets of Skin: చర్మం గురించి ఈ విషయాలు తెలుసా, శరీరంలో ఎన్ని పనులు చేస్తుందంటే!

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 27, 2024 12:50 PM IST

Secrets of Skin: మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మమే… వినడానికి ఆశ్చర్యంగా ఉన్న గుండె, కాలేయం, ఊపిరితిత్తులలాగే చర్మం కూడా ఒక అవయవమే. అలాంటి ఈ అవయవం చేసే పనులు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

మనిషి శరీరంలో చర్మం చేసే పనులు ఏమిటో తెలుసా?
మనిషి శరీరంలో చర్మం చేసే పనులు ఏమిటో తెలుసా?

Secrets of Skin: మనిషి శరీరం మొత్తం మీద ఉన్న చర్మాన్ని బరువు తూకం వేస్తే అది 2.7 కిలోల నుంచి 4.5 కిలోల బరువుంటుందని ఓ అంచనా. చర్మం సగటు బరువు 3 కిలోలు ఉంటుంది. చర్మం బరువు శరీరం బరువులో 15 వ వంతు ఉంటుంది. శరీరం మీదున్న చర్మం వైశాల్యం 25 చదరపు అడుగులు ఉంటుంది.

ఒక చదరపు అంగుళం చర్మంలో 645 స్వేద గ్రంథులు, 196 అడుగుల రక్తనాళాలు, 77 అడుగుల నాడులుంటాయి. ప్రతి గంటకు ఆరు లక్షల చర్మకణాలు మానవ దేహ విసర్జిస్తుంది.

జీవిత కాలంలో సగటున 180 కిలో గ్రాముల బరువుండే చర్మ కణాలు దేహం నుంచి రాలిపోతాయి. చర్మంలోని కణాలు 50 రోజులకొకసారి రాలిపోయి కొత్త కణాలు పుడుతుంటాయి. చర్మంలో ఫైబ్రోబ్లాస్ట్లు, కెరటినోసైట్స్ అనే రెండు రకాల చర్మ కణాలుంటాయి.

6.5 అంగుళాల చదరపు వైశాల్యం గల చర్మంలో అనేక సూక్ష్మ రక్తనాళాలు, 65 దాకా వెంట్రుకలు, 100 దాకా నూనె గ్రంథులు, 650 దాకా స్వేద గ్రంథులు, లెక్కలేనన్ని నాడులు ఉంటాయని ఓ అంచనా!

చర్మం నిర్మాణం

దేహంపై భాగంలో చర్మం రెండు పొరలతో నిర్మించబడి ఉంది. చర్మంపై భాగాన్ని "ఎపిడెర్మిస్" (Epidermis) అనీ, లోపలి భాగాన్ని "డెర్మిస్" (Dermis) అంటారు. మనం చూసే చర్మం కేవలం చర్మం యొక్క ఉపరితల భాగం మాత్రమే. శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రత్యేకత కలిగిన చర్మం ఉన్నప్పటికీ అధిక శాతం ఒకే మందం ఉంటుంది.

చర్మం మందం ఒక్కో ప్రదేశంలో ఒక్కోరకంగా ఉంటుంది. కనురెప్పలమీద అతి పల్చగాను, అరికాలు, అరి చేతుల్లో అతి మందంగాను ఉంటుంది. చర్మంను స్థూలంగా 3 పొరలుగా విభజించవచ్చు.

1. ఎపిడెర్మిస్ (Epidermis) : ఎపిడెర్మిస్లో క్రింది వైపున ఉండే కణాలు నిరంతరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. క్రింది వైపున కొత్త కణాలు పుట్టేకొద్దీ పైవైపు కణాలు నశించి రాలిపోతుంటాయి. ఎపిడెర్మిస్ ఎలాంటి రక్తనాళాలు ఉండవు. డెర్మిస్ నుంచి ఎపిడెర్మిస్కి పోషక పదార్థాలు అందుతూ ఉంటాయి. ఎపిడెర్మిస్లో నాడులు ఉండవు కాబట్టి స్పర్శజ్ఞానం ఉండదు.

2. డెర్మిస్ (Dermis) : చర్మంలో డెర్మిస్ అనేది ముఖ్యమైన పొర. దీనిలోనే రక్తనాళాలు, గ్రంథులు, వెంట్రుకల కుదుళ్ళు మొదలైనవి. అన్నీ ఉంటాయి. డెర్మిస్లో సాగి ముడుచుకుపోయే "ఎలాస్టిక్ ఫైబర్స్" (Elastic Fibres) ఉంటాయి. డెర్మిస్ ఎపిడెర్మిస్ కంటే 4 రెట్లు ఎక్కువ మంగంలో ఉంటుంది. డెర్మిస్ పొర “కొల్లాజిన్" (Collagen) అనే "ఫైట్రస్ ప్రొటీన్" తోను, "ఎలాస్టిన్" అనే మరో ప్రొటీన్తోను తయారై ఉంటుంది. డెర్మిస్లో కొన్ని మిలియన్ల స్వేర గ్రంథులు స్వేదాన్ని తయారుచేసి చర్మం ఉపరితలానికి పంపిస్తుంటాయి.

చర్మవ్యాధులు

3. సబ్ క్యుటేనియస్ కణజాలం (Sub - cutaneous Tissue): చర్మంలో ఎన్నో రకాల జీవకణాలున్నట్లే "మెలనోసైట్లు" (Melanocytes) అనే జీవకణాలున్నాయి. చర్మానికి రంగునిచ్చే "మెలనిన్" (Melanin) అనే పదార్థాన్ని ఈ మెలనోసైట్లు తయారు చేస్తాయి.

చర్మం చేసే పనులు ఏమిటో తెలుసా

  • శరీరం మొత్తాన్నీ కప్పుతూ లోపలి అవయవాలన్నిటినీ వాటి వాటి నిర్ణీత స్థానాల్లో ఉంచి, వత్తిడి నుంచి, దెబ్బల నుంచి, రకరకాల భౌతిక, రసాయనిక పదార్థాల నుంచి చర్మం రక్షిస్తుంది.
  • శరీరం లోపలున్న నీటిని అవసరానికి మించి బయటకు పోకుండా కాపాడుతుంది.
  • శరీర ఉష్ణోగ్రతను ఒక నిర్ణీత స్థానంలో ఉంచుతుంది.
  • స్పర్శా జ్ఞానాన్నిస్తుంది.
  • చర్మం సాగి ముడుచుకుపోయే గుణాన్ని కలిగి ఉంటుంది.
  • చర్మంలో ఉండే స్వే గ్రంథులూ, సున్నితమైన రక్తనాళాలూ కలిసి మలిన పదార్ధాలను స్వేదం రూపంలో విసర్జించటం లాంటి కొన్ని విధులను నిర్వర్తిస్తాయి.
  • చర్మం శరీరానికి ఆకృతిని కలిగిస్తుంది. వెంట్రుకల పెరుగుదలకు దోహదపడుతుంది.
  • దీనికి రక్షణనిచ్చే వాటర్ ప్రూఫ్ గుణం ఉంది.
  • హాని కలిగించే క్రిములను లోనికి ప్రవేశించకుండా కాపాడుతుంది.
  • సూర్యరశ్మి నుంచి ఆల్ట్రా వయొలెట్ కిరణాలను గ్రహించి విటమిన్ “డి” ని తయారుచేసి శరీరానికందిస్తుంది.

చెమట గ్రంథులు

చర్మం కూడా ఒక విసర్జకావయవంగా పనిచేస్తుంది. శరీరంలోని మలిన పదార్థాలని “స్వేదం” లేదా “చెమట” ద్వారా బయటకు పంపుతుంది. శరీరం నుండి రోజుకి మన కంటికి కనిపించకుండా లీటరు పైగా స్వేదం వెలువడుతుంది. వేసవి కాలంలో ఎక్కువ చెమట పోస్తుంది. ఎప్పటి చెమట అప్పుడే ఆవిరయిపోవటం వలన మనకి అంత పరిమాణంలో కన్పించదు. చర్మమంతా పరుచుకొని 3.5 మిలియన్ల స్వేద గ్రంథులున్నాయి. స్వేద గ్రంధులు ఎక్కువగా చంకలలో (Axillaలో) మలద్వారం, జననాంగాలు వుండే చోట ఎక్కువగా వుంటాయి.

చెమట గ్రంధులలో ఎండోక్రైన్ గ్రంధులు, అపోక్రిన్ గ్రంథులు ఉంటాయి. "ఎపోక్రైన్" గ్రంథులు శరీరమంతటా ఉండి చెమటను తయారుచేస్తూ ఉంటాయి. అరిచేతులు, పాదాల అడుగునా, తలపైనా ఎక్కువ ఉంటాయి. భావోద్రేకం వలన, శరీర ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత వల్ల ఇవి ప్రేరేపణకు గురవుతాయి.