Saffron benefits: కుంకుమ పువ్వు గర్భవతులకే కాదూ.. రోజూవారీ వాడితే బోలెడు ప్రయోజనాలు..
Saffron benefits: కుంకుమ పువ్వు వల్ల కేవలం గర్భినులకే కాదు.. దానివల్ల చాలా ఇతర ప్రయోజనాలున్నాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలకు కుంకుమపువ్వు పనిచేస్తుందో తెలుసుకోండి.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పైస్‌గా కుంకుమ పువ్వుకు పేరుంది. చర్మ సౌందర్యం వరకే కాకుండా దీని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమ పువ్వుపై చేసిన అధ్యయనాల్లో కొన్ని ఆసక్తికరమైన ఆరోగ్య ప్రయోజనాలు వెలుగు చూశాయి. అవేంటో తెలుసుకుంటే ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు దీన్ని మీరూ కచ్చితంగా వాడతామంటారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్‌తో పోరాడే లక్షణాలు :
కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో ప్రమాదకరంగా ఉండే ఫ్రీ రాడికల్స్ తో ఇవి పోరాడతాయి. దీర్ఘ కాలిక వ్యాధులు, క్యాన్సర్ల వంటివి రానీయకుండా చేస్తాయి. కొన్ని పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. ఇది పెద్ద పేగులో పెరిగే క్యాన్సర్ కణాలను వృద్ధి కాకుండా చేసింది. ఇవే ఫలితాలు, చర్మ, ఎముక మజ్జ, పోస్టేట్, బ్రెస్ట్, ఊపిరితిత్తులు తదితర అవయవాల్లో పెరిగే క్యాన్సర్ కణాల విషయంలోనూ ఉంటాయని పరిశోధకులు తేల్చారు.
మహిళల పీరియడ్స్‌లో :
చాలా మంది మహిళలకు పీరియడ్స్ ముందు, పీరియడ్స్ సమయంలో ఆందోళన విసుగు, తలనొప్పులు, ఆకలి ఎక్కువగా వేయడం, ఒళ్లు నొప్పులు లాంటివి ఉంటాయి. దీన్నే పీఎంఎస్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు ఉన్న 20 నుంచి 45 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు రోజూ 30 మిల్లీ గ్రాముల చొప్పున కుంకుమ పువ్వును ఇచ్చి చూశారు. వీరిలో స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు గణనీయంగా తగ్గడం గమనించారు. అందువల్ల ఆ మహిళల్లో ఆందోళన, విసుగు తగ్గినట్లు ఆ అధ్యయనంలో తేలింది.
బరువు తగ్గడంలో :
చాలా మంది చిరుతిళ్లు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అయితే 8 వారాల పాటు చేసిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రోజూ కొంత మందికి సేఫ్రాన్ సప్లిమెంట్లను ఇచ్చి చూశారు. వీటిని తీసుకున్నవారిలో చిరు తిళ్లు తినడం బాగా తగ్గిపోయి. అలాగే వీరు బరువు కూడా బాగా తగ్గారట. దీంతో బరువు తగ్గాలనుకున్న వారికి కుంకుమ పువ్వు చాలా బాగా పని చేస్తోందని ఈ అధ్యయనంలో తేలింది.
డిప్రెషన్‌కి మందులా :
కుంకుమ పువ్వుకు సన్‌షైన్ స్పైస్ అనే ముద్దు పేరుంది. అది దాని రంగు, వాసన వల్ల వచ్చింది కాదు. ఇది మన మూడ్‌పైనా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మైల్డ్‌గా, మోడరేట్‌గా డిప్రెషన్ ఉన్న కొంత మంది రోజుకు 30 ఎంజీ చొప్పున కుంకుమపువ్వు సప్లిమెంట్లను వైద్యులు ఇచ్చి చూశారు. ఈ స్థాయిల్లో ఉన్న డిప్రెషన్‌ని ఇది అద్భుతంగా నయం చేసిందని మరో అధ్యయనంలో తేలింది.