Crab Gravy: పీతల ఇగురు వండడం కష్టం అనుకుంటున్నారా? చాలా సులువు, ఇదిగోండి రెసిపీ-crab gravy recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Crab Gravy: పీతల ఇగురు వండడం కష్టం అనుకుంటున్నారా? చాలా సులువు, ఇదిగోండి రెసిపీ

Crab Gravy: పీతల ఇగురు వండడం కష్టం అనుకుంటున్నారా? చాలా సులువు, ఇదిగోండి రెసిపీ

Haritha Chappa HT Telugu
Oct 01, 2024 05:30 PM IST

Crab Gravy: పీతల ఇగురు అంటే ఎంతో మందికి ఇష్టం. కానీ దాన్ని తెచ్చి కడగడం, వండడం కష్టం అనుకుంటారు. పీతల కూర వండడం చాలా సులువు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపొయింది.

పీతల ఇగురు రెసిపీ
పీతల ఇగురు రెసిపీ

పీతల ఇగురు కూర చూస్తేనే నోరూరిపోతుంది. అన్నంలో కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. పీతల షెల్‌ని పగలగొట్టి లోపల ఉన్న మాంసాన్ని తినాలి. ఆ మాంసం చాలా రుచిగా ఉంటుంది. నిజానికి రొయ్యలు, చేపల కన్నా కూడా పీతల లోపల ఉండే మాంసమే చాలా టేస్టీ. కానీ దాన్ని వండడం రాక ఎంతో మంది పీతలను కొనేందుకు ఇష్టపడటం లేదు. ఇక్కడ మేము పీతల ఇగురు రెసిపీ ఇచ్చాము. దీన్ని చాలా సింపుల్ గా వండవచ్చు. కాకపోతే పీతలను కొన్న దగ్గరే శుభ్రంగా కడిగి కట్ చేసి తెచ్చుకోండి. ఇంట్లో వండడం సులభంగా మారుతుంది.

పీతల ఇగురు రెసిపీకి కావలసిన పదార్థాలు

పీతలు - అరకిలో

ఉల్లిపాయ - రెండు

టమోటోలు - రెండు

పచ్చిమిర్చి - ఐదు

కరివేపాకులు - గుప్పెడు

అల్లం - చిన్న ముక్క

వెల్లుల్లి రెబ్బలు - పది

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

గసగసాలు - ఒక స్పూను

దాల్చిన చెక్క - ఒకటి

లవంగాలు - మూడు

అనాసపువ్వు - ఒకటి

పీతల ఇగురు రెసిపీ

1. పీతలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

2. మిక్సీ జార్లో దాల్చిన చెక్క, పసుపు, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, గసగసాలు వేసి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో రుబ్బుకున్న గరంమసాలా పేస్టును వేయాలి.

5. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకులను కూడా వేయాలి.

6. సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి బాగా వేయించాలి.

7. తర్వాత సన్నగా తరిగిన టమోటాలను వేసి పైన మూత పెట్టి మగ్గించాలి.

8. అది మెత్తగా అయ్యాక ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.

9. గరం మసాలా వేసి బాగా కలపాలి.

10. ఈ మిశ్రమంలో పీతలను వేసి ఒకసారి బాగా కలపాలి.

11. ఒక కప్పు నీళ్లు వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపి పైన మూత పెట్టి పావుగంట సేపు ఉడికించాలి.

12. తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. తిరిగి మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడికించాలి.

13. ఆ తర్వాత కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

14. అంతే టేస్టీ పీతల కూర రెడీ అయినట్టే.

15. దీన్ని అన్నంతో తింటే రుచి అదిరిపోతుంది.

16. చేపలు, రొయ్యల కన్నా పీతల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది.

పీతల తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. పీతల్లో విటమిన్ డి, సెలీనియం, ఐరన్, జింక్, ఫోలేట్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడును కూడా కాపాడుతాయి. పీతల ఇగురు తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. మానసిక ఆరోగ్యానికి కూడా పీతల్లో ఉండే పోషకాలు సహకరిస్తాయి. చికెన్, మటన్ తో పోలిస్తే పీతల్లోనే పోషకాలు ఎక్కువ. వీటిని ఎంత తిన్నా బరువు పెరగరు. పీతల్లో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువ. ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Whats_app_banner