Anger Management । మీ కోపానికి కారణాలు సరైనవేనా? సహనంతో శాంతిని సాధించండి ఇలా!
Anger Management: మనకు కలిగే ఆగ్రహం కొన్నిసార్లు 'సత్యాగ్రహామే' కావొచ్చు, కానీ ఆగ్రహంతో ఏదీ సాధించలేమనేది అసలైన సత్యం. అన్ని వేళలా కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. అసలు మీకు కోపం ఎందుకు కలుగుతుంది, తగ్గించుకునే మార్గాలను ఇక్కడ చూడండి.
Anger Management: కోపం ఎవరికీ ఊరికే రాదు, అందుకు సరైన కారణాలు ఉండవచ్చు. ఎదుటి వారి ప్రవర్తన, పరిస్థితులు కూడా ఏ వ్యక్తికైనా కోపం తెప్పించవచ్చు. సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు కోపం వస్తే ఇబ్బందులు ఉండవు. కానీ, రోజూ ఏదో ఒక చిన్న విషయానికి కూడా తరచూ కోపం వస్తుంటే దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మనకు బాగా కోపం వచ్చినపుడు మన మాట్లాడే టెంపో మారుతుంది. దీంతో మన మాటలు, ఉపయోగించే భాషలో మార్పు వస్తుంది.
కోపంతో మనం ఏదీ సాధించలేం. ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మానసిక స్థితిపై నియంత్రణ కోల్పోతాము. క్షణిక కోపం మొత్తం జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీ కోపాన్ని వీలైనంత తగ్గించుకోవడం మీకే మంచిది.
Reasons for Anger and Tips to Cool Down- కోపానికి కారణాలు, పరిష్కారాలు
మీరు తరచూ నియంత్రణ కోల్పోతున్నారంటే అందుకు కొన్ని కారణాలు ఉండవచ్చు. కారణాలు తెలిస్తే అందుకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఇక్కడ కోపానికి గల కారణాలను, వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తున్నాం.
ఒత్తిడి
ఒత్తిడి అనేక అనారోగ్యాలకు కారణమవుతుంది. తీవ్రమైన ఒత్తిళ్ల కారణంగా కూడా మనకు చాలా సందర్భాలలో కోపాన్ని కలిగిస్తుంది. మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితిలో ఉంటే, మీకు కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో మీ ఏకాగ్రత దారితప్పి పోతుంది. ఇది ఒత్తిడితో కూడిన కోపం. కాబట్టి మీ కోపం తగ్గాలంటే, ముందుగా మీ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి కోపం ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు వీలైనంత ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి.
కుటుంబ పరిస్థితులు
ఇంట్లో అనారోగ్యకరమైన వాతావరణం ఉంటే, అది మిమ్మల్ని మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కోపం వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో నిత్యం గొడవలు, అరుపుల వాతావరణం పిల్లల మానసిక స్థితిని కూడా పాడు చేస్తుంది. తల్లిదండ్రులను నిరంతరం గొడవపడుతుంటే, పెరిగే పిల్లలు కూడా అందరిపై కోపం పెంచుకోవచ్చు. ఇది మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది. కుటుంబ పరిస్థితుల వలన మీకు కోపం కలిగితే కూర్చుని సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి.
చేదు అనుభవాలు
గతంలో ఏవైనా చేదు అనుభవాలు ఉంటే లేదా బాధాకరమైన పరిస్థితులను అనుభవించినట్లయితే, అటువంటి వ్యక్తులకు ఎటువంటి కారణం లేకుండానే నిరంతరం కోపంగా ఉండవచ్చు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ మీ గత గాయం వల్ల సంభవించవచ్చు. ఇది మీకు కోపం, నిరాశ లేదా భయాన్ని కలిగించవచ్చు. దేనికైనా కోపం రావడమే దీని ఫలితం. ఇలాంటి కోపం మీకు ఉంటే మీ ప్రియమైన వారి సహాయం తీసుకొని కోపం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
పెరిగిన బాధ్యతలు
బాధ్యతలు పెరిగే కొద్దీ మన వైఖరిలో కూడా మార్పు వస్తుంది. మనుషులతో కలవటం కూడా తగ్గుతుంది. ఇలాంటపుడు ఆర్థిక అవసరాలు కూడా పెరిగితే అది మానసికంగా మిమ్మల్ని ఉక్కిరి బికిరి చేస్తుంది. ఫలితంగా, తీవ్రమైన కోపం, అసహనం కలుగుతాయి. మీకు బాధ్యతలు ఎక్కువైతే అర్హులైన వారితో ఆ బాధ్యతలు పంచుకోవాలి. తద్వారా మీలో కోపం కొంత తగ్గుతుంది.
విచారకర సంఘటనలు
సమాజంలోని విచారకరమైన సంఘటనలు, నైరాశ్యం కూడా వ్యక్తులను మానసికంగా బలహీనపరుస్తాయి. ఇలాంటి వారు సమాజంలో జరిగే ఘటనల పట్ల సున్నితంగా ఉంటారు. ప్రియమైన వ్యక్తి చనిపోయినప్పుడు లేదా దూరంగా వెళ్లినప్పుడు ఒంటరిగా ఉండటం బాధాకరంగా ఉంటుంది. ఇతరులను మార్చలేక నిస్సహాయతతో కోపం పెరగవచ్చు. ఒక వ్యక్తిని పట్టించుకునే వారు లేనప్పుడు, వారు చేసే ప్రతి పని వారికి సరైనదిగా కనిపిస్తుంది. అలాంటప్పుడు వారికి విసుగు, విచారం కోపంగా కూడా మారవచ్చు. ఇలాంటపుడు దీనికి ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. ఎంత తక్కువ రియాక్ట్ అయితే అంత తక్కువ కోపం.
మానసిక ఆరోగ్య పరిస్థితులు
కొన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా కోపాన్ని కలిగిస్తాయి. ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారు కూడా కోపాన్ని అదుపు చేసుకోలేరు. చిన్న చిన్న విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు. అలాంటి సందర్భాలలో మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం, అందుకు తగిన ఔషధాలు తీసుకోవడం ఉత్తమం.
కోపం చాలా సందర్భాలలో బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. స్నేహాలను నాశనం చేస్తుంది. క్షణికావేశం అనేక విపత్తులకు దారి తీస్తుంది. తర్వాతి రోజుల్లో దీని వల్ల అనేక సమస్యలు తలెత్తి పశ్చాత్తాప పడాల్సి రావచ్చు. కాబట్టి మనపై మనకు కొంత నియంత్రణ అవసరం. మీ కోపాన్ని సహనంగా మార్చుకుంటే విజయం మీ వెంటే.
సంబంధిత కథనం