ChickenGunya Symptoms: చికెన్ గున్యా మళ్లీ వచ్చేసింది, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోండి
Chicken Gunya Symptoms: చికెన్ గున్యా చెప్పడానికి చిన్న సమస్యలా ఉన్నా అనుభవిస్తే తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంటుందో. తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పెడుతుంది. చికెన్ గున్యా ఇతర లక్షణాలు ఏంటో తెలుసుకోండి.
ChickenGunya Symptoms: ఒకప్పుడు చికెన్ గున్యా విపరీతంగా వ్యాపించింది. మనిషిని కదల్లేకుండా మంచానికే పరిమితం చేసింది. ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ గన్యా విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. డెంగ్యూ కన్నా ఇప్పుడు చికెన్ గున్యా కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ జ్వరం వస్తే కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కనీసం నెల రోజులపాటు వెళ్ళినప్పుడు వేధిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులనే చికెన్ గున్యా టార్గెట్‌గా చేసుకుంటుంది. కాబట్టి దీనితో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. చికెన్ గున్యా లక్షణాలను తెలుసుకొని ప్రాథమిక దశలోనే వైద్యులను కలవడం మంచిది.
చికెన్ గున్యా లక్షణాలు
చికెన్ గున్యా సోకిన వ్యక్తికి హఠాత్తుగా తీవ్ర జ్వరం వస్తుంది. 102 డిగ్రీల వరకు ఆ జ్వరం ఉంటుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు మెల్లగా మొదలవుతాయి. అవి తీవ్ర స్థాయికి చేరుతాయి. కీళ్లు తీవ్రమైన నొప్పితో కదపలేని పరిస్థితికి వస్తుంది. చేతుల మణికట్టు, కాళ్లు, మడమలు, భుజాల్లో కూడా తీవ్రంగా నొప్పి బాధిస్తుంది. మనిషి ఈ నొప్పుల వల్ల చెయ్యి కూడా ఎత్తలేని పరిస్థితికి వస్తాడు. కూర్చున్న వ్యక్తి నిల్చోవాలన్నా కూడా తీవ్రంగా కీళ్ల నొప్పులు బాధిస్తాయి. చర్మం మీద దద్దుర్లు, దురదలు వంటివి కూడా కనిపించవచ్చు. అలాగే నల్లటి మచ్చలు కూడా రావచ్చు. జ్వరం త్వరగా తగ్గిపోయినా ఈ కీళ్ల నొప్పులు, కాలు నొప్పులు మాత్రం విపరీతంగా వేధిస్తాయి. కనీసం నెలరోజుల పాటు ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి పైన చెప్పిన లక్షణాల్లో మీకు ఏవి అనిపించినా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి తగిన చికిత్సను తీసుకోండి.
చికెన్ గున్యా అనేది దోమ వల్ల వ్యాపించే తీవ్ర జ్వరం. దోమ కుట్టాక రెండు రోజుల తర్వాత దీని లక్షణాలు మెల్లగా బయటపడుతూ ఉంటాయి. దోమలు ఇంట్లో చేరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏం తాగాలి?
ప్రస్తుతం డెంగ్యూ, చికెన్ గున్యా... రెండూ కూడా తెలుగు రాష్ట్రాల్లో తెగ వ్యాపిస్తున్నాయి. జ్వరంగా తగ్గాక కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్సను ప్రారంభించాలి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. పండ్ల రసాలు తాగాలి. మజ్జిగను తాగుతూ ఉండాలి. చికెన్ గున్యా బారిన పడినవారు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. కాబట్టి ఆ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి.
చికెన్ గున్యా వైరస్ రక్తంలో చేరుకుపోతుంది. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అందుకే చికెన్ గున్యా వల్ల వచ్చే నొప్పులు తగ్గాలంటే రెండు వారాలకు పైగా సమయం పడుతుంది. వైద్యులు వీరికి తగిన మందులను సూచిస్తారు. వాటిని వాడుతూ ద్రవాహారాన్ని అధికంగా తీసుకుంటే త్వరగా చికెన్ గున్యా నుండి బయటపడతారు.
చికెన్ గున్యా వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం రెండు, మూడు రక్త పరీక్షలు చేస్తారు. దాని ద్వారా చికెన్ గున్యాను నిర్ధారిస్తారు. చికెన్ గున్యా సోకిన వ్యక్తులు సమతులాహారాన్ని తీసుకోవాలి. తమ ఆహారంలో పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కీళ్ల నొప్పులు మరీ వేధిస్తూ ఉంటే ఫిజియోథెరపీ కూడా తీసుకోవచ్చు. అయితే చికెన్ గున్యా ఒక్కసారి వచ్చిందంటే మరొకసారి రాదని చెబుతారు. ఎందుకంటే ఒకసారి చికెన్ గున్యా వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. దాని వల్లే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. దీనికి ఎలాంటి టీకాలు మన దేశంలో అందుబాటులో లేవు.