రూపం లేని జీవి అమీబా అని మీరు చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు. ఈ రూపంలేని సూక్ష్మజీవి మనిషి ప్రాణాలను తీస్తుందంటే నమ్ముతారా? దక్షిణ కొరియాకు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి ఇటీవలే థాయిలాండ్ పర్యటనను ముగించుకొని వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. గత సోమవారమే అతడు మరణించాడు. ది కొరియా టైమ్స్ వెల్లడించిన ప్రకారం, మృతుడు 'మెదడు తినే అమీబా' (brain-eating amoeba) అనే అరుదైన ఇన్ఫెక్షన్ సోకి మరణించాడు. ఇది నేగ్లేరియా ఫౌలెరీ (Naegleria fowleri) అనే అమీబా వలన కలిగే ఒక ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్.
అమీబా అనేది ఒక ఏకకణ స్వేచ్ఛా జీవి. దీనికి కణత్వచం అనేది లేదు కాబట్టి, ఇది నీటి వనరులలో స్వేచ్ఛగా కదులుతుంది, నీటిలో మృత కళేబరాలపై చేరిన బ్యాక్టీరియాలపై ఆవాసం ఏర్పరుచుకుంటుంది. ప్రజలు ఈత కొట్టడం, నీటిలో డైవింగ్ చేయడం లేదా సరస్సులు, నదులలో తలలు పెట్టినప్పుడు అమీబా వ్యక్తుల శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.
వ్యక్తులు నీటిలో మునిగినపుడు, అమీబా మొదట వారి ముక్కు లోకి దూరి, అక్కడి నుండి మెదడుకు చేరుకుంటుంది, అక్కడ అది మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది. ఇది ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వినాశకరమైన ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. అందుకే దీనిని మెదడు తినే అమీబాగా పిలుస్తున్నారు.
కొచ్చి నగరంలోని అమృతా హాస్పిటల్‌లో, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ దీపు TS ఈ మెదడు తినే అమీబా ఇన్ఫెక్షన్ గురించి వివరించారు. ఇది సోకినపుడు లక్షణాలు ఎలా ఉంటాయో తెలిపారు.
Neegleria fowleri అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరిన తర్వాత, మెదడు కణజాలాన్ని నాశనం చేసే ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) అనే మెదడు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఈ వ్యాధి (PAM) మొదటి లక్షణాలు సాధారణంగా సంక్రమణ జరిగిన తర్వాత 5 రోజుల తర్వాత ప్రారంభమవుతాయి. కానీ అవి బయటపడటానికి 1 నుండి 12 రోజుల వరకు పట్టవచ్చు. లక్షణాలు పరిశీలిస్తే.. మొదటగా తలనొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు కలిగి ఉండవచ్చు. రెండో దశ లక్షణాలు తీవ్రమవుతాయి. మెడ బిగుసుకుపోవడం, గందరగోళం, వ్యక్తులు, పరిసరాలపై శ్రద్ధ లేకపోవడం, మూర్ఛలు, భ్రాంతులు కలిగి చివరకు కోమా వరకు దారితీస్తాయి. 18 రోజులలో మరణం కూడా సంభవించవచ్చు.
అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి మాత్రం కాదు, ఇది కొంత ఊరట కలిగించే విషయం.
చికిత్స, నివారణ
నేగ్లేరియా ఫౌలెరి వల్ల కలిగే ఇన్ఫెక్షన్ వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీనికి సమర్థవంతమైన చికిత్స ఇప్పటివరకు లేదు. ప్రస్తుతం వైద్యులు లక్షణాలకు అనుగుణంగా యాంఫోటెరిసిన్ B, అజిత్రోమైసిన్, ఫ్లూకోనజోల్, రిఫాంపిన్, మిల్టెఫోసిన్, డెక్సామెథాసోన్ వంటి ఔషధాల కలయికతో చికిత్స చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే ఈ నేగ్లేరియా ఫౌలెరి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని నివారించడానికి ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వెచ్చని మంచినీటి వనరుల్లో ఆడకూడదు. ముఖ్యంగా డైవింగ్ చేయకుండా ఉండాలి. వేడి నీటి బుగ్గలు ( hot springs) లేదా ఇతర శుద్ధి చేయని నీటి వనరులలో తలలను ఉంచడం మానుకోవాలి. లోతు తక్కువగా ఉండే సరస్సులు, చెరువులు, నదులలలో అవక్షేపాలను త్రవ్వడం లేదా కదిలించడం మానుకోండి. క్లోరినేట్ చేసిన లేదా శుద్ధిచేసిన సురక్షితమైన నీటిని మాత్రమే ఉపయోగించండి.
సంబంధిత కథనం