Soap Alternatives: రసాయనాలు నిండిన సబ్బులకు బదులుగా.. ఇవి వాడి చూడండి..-best natural alternatives for soaps instead chemical soaps ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soap Alternatives: రసాయనాలు నిండిన సబ్బులకు బదులుగా.. ఇవి వాడి చూడండి..

Soap Alternatives: రసాయనాలు నిండిన సబ్బులకు బదులుగా.. ఇవి వాడి చూడండి..

HT Telugu Desk HT Telugu
Sep 11, 2023 05:19 PM IST

Soap Alternatives: రసాయనాలున్న సబ్బులకు బదులుగా ఇంట్లోనే సహజ సిద్దమైన పదార్థాలతో శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. అవేంటో చూసేయండి.

సబ్బుకు ప్రత్యామ్నాయాలు
సబ్బుకు ప్రత్యామ్నాయాలు (pexels)

మనం శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి రోజూ స్నానం చేస్తాం. స్నానం కోసం సబ్బుల్ని ఉపయోగిస్తాం. సబ్బుల నుంచి వచ్చే నురగ వల్ల మన శరీరంపై చేరిన మలినాలు, బ్యాక్టీరియాల్లాంటివి శుభ్ర పడతాయని అనుకుంటాం. అయితే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రసాయనాలు ఎక్కువున్న సబ్బులకు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోగల కొన్ని పదార్థాలను వాడటం చాలా మేలు. రసాయనాలు నిండిన సబ్బులకు దూరంగా ఉండేందుకు మనకు బోలెడు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా?

కమలా పండు తొక్కల పొడి:

కమలా పండ్లు తిన్నాక వచ్చే తొక్కలను ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి బాగా ఎండిన తర్వాత మిక్సీలో మెత్తటి పొడిలా చేసుకోవాలి. దీన్నిబాత్‌ పౌడర్‌లా శరీరానికి రుద్దుకుని స్నానం చేయాలి. దీనిలో ఉండే విటమిన్‌ సి, కొలాజిన్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మృత కణాలను తొలగిస్తుంది. అందువల్ల చర్మం మరింత తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది.

ఆర్గానిక్‌ సబ్బులు:

రసాయనిక సబ్బులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ సబ్బులను వాడొచ్చు. మొక్కల నుంచి వచ్చే నూనెలతో ఈ సబ్బులు తయారవుతాయి. కాబట్టి వీటిని వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గ్లిజరిన్‌ని తీసుకుని కరిగించి దాంట్లో మనకు నచ్చిన పండ్ల రసాన్ని కలిపి అచ్చులా పోసుకుంటే సేంద్రీయ సబ్బు రెడీ అయినట్లే. ఇవి తయారు చేసిచ్చే సంస్థలు బోలెడున్నాయి. సులువుగా అందుబాటులో ఉంటున్నాయి.

పండ్లు, కూరగాయల ముక్కలు:

బొప్పాయి, కమలా, కీర, టమోటా.. లాంటి ముక్కల్ని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానితో శరీరాన్ని రుద్దుకుని స్నానం చేయవచ్చు. వీటిలో ఉండే సహజ పోషకాల వల్ల శరీరం మృదువుగా తయారవుతుంది. చక్కగా శుభ్రపడుతుంది.

నూనె, పాలు :

పాలు, నూనె రెండూ చర్మాన్ని సహజంగా క్లెన్స్‌ చేస్తాయి. మృదువుగా ఉంచుతాయి. బకెట్‌లో ఓ కప్పు పాలను పోసి, సహజమైన సబ్బుతో స్నానం చేసి చూడండి. చర్మంపైన ఉన్న మృత కణాలు అన్నీ తొలగిపోయి, అది ఎంతో మృదువుగా మారుతుంది. అలాగే పొడి చర్మం ఉన్న వారు సబ్బు వాడటం కంటే నూనెను వాడటం మంచిది. చర్మాని కొద్దిగా నూనెను పట్టించి ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయండి. తర్వాత సున్నిపిండితో శరీరాన్ని రుద్దుకుని, గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది.

Whats_app_banner