Dental Care with Neem: టూత్ పేస్ట్, మౌత్ వాష్ లాగా.. వేపను ఎలా వాడొచ్చో తెలుసా?
Dental Care with Neem: పంటి నొప్పి నుంచి దంతక్షయం వరకు వివిధ రకాల సమస్యలను వేపాకు తగ్గిస్తుంది. దాన్ని విభిన్న రకాలుగా వాడి ప్రయోజనాలు పొందొచ్చు. అవేంటో తెలుసుకోండి.
వేప చెట్టు.. దీనిలోని ప్రతి భాగమూ మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. వేరు, కాండం, ఆకులు, కాయలు.. ఇలా ఏదీ ఊరికే పోదు. వేప పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల అవి ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటాయి. నోటి, చిగుళ్లకు సంబంధించిన సమస్యలూ రావు. అందుకనే పూర్వ కాలం చాలా మంది వేప పుల్లతో మాత్రమే పళ్లు తోముకునేవారు. ఇప్పుడు వీటి స్థానంలో టూత్ పేస్ట్‌లు, టూత్ బ్రష్‌లు వచ్చి చేరాయి. ఫలితంగా పళ్ల సమస్యలే కాదు... మరెన్నో ఆరోగ్య సమస్యలకు ఇవి కారణం అవుతున్నాయి.
ఇప్పుడు మార్కెట్లో దొరికే అన్ని టూత్ పేస్ట్‌ల్లోనూ ట్రైక్లోసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని టూత్ పేస్ట్ పాడుకాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీటిలో దీన్ని కలుపుతుంటారు. దీని వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తేలింది. అలాగే పిల్లల్లో ఆస్తమా, థైరాయిడ్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని తెలిసింది. టూత్ పేస్ట్‌లో ఇదొక్కటే కాదు.. ఇలాంటి రసాయనాలు ఇంకా ఉంటాయి. అందుకనే టూత్ పేస్ట్‌కి బదులుగా సహజంగా దొరికే వేప ఉత్పత్తులను దంత సంరక్షణలో వాడటం మంచిది. మరి వీటిని ఏ విధంగా దంత సంరక్షణకు వాడొచ్చో తెలుసుకుందాం.
- వేప ఆకుల్ని తెచ్చి శుభ్రం చేసి ఎండలో ఎండబెట్టాలి. అవి పూర్తిగా తేమ లేకుండా తయారైన తర్వాత వాటిని మిక్సీ చేయాలి. ఆ మెత్తటి పొడిని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని నిల్వ చేసుకోవాలి. ఉదయాన్నే పళ్లు తోముకోవాలి అనుకున్నప్పుడు ఓ స్పూను వేప ఆకుల పొడికి కాస్త వంట సోడా కలపాలి. నీటి సహాయంతో పేస్ట్‌లా చేసుకుని దీనితో పళ్లు తోముకోవచ్చు. అందువల్ల పళ్లు గార, పచ్చదనం పోయి మెరుస్తూ ఉంటాయి. టూత్ పేస్ట్ కు ఇది ప్రత్యామ్నాయం అనుకోవచ్చు.
- వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని మీరు రోజు వారీ వాడే టూత్‌పేస్ట్‌పై రెండు చుక్కలు వేసుకుని బ్రషింగ్ చేసుకోండి. దీని వల్ల చిగుళ్ల వాపులు, పుచ్చు పళ్ల సమస్యలు దూరమవుతాయి.
- వేప పుల్లలతో పళ్లు తోముకోవడం అనేది అనాదిగా భారత దేశంలో ఉంది. దీని వల్ల పళ్లు, చిగుళ్ల సమస్యలు మటుమాయం అవుతాయి. ఎక్కడో సిటీల్లో ఉన్న వారికి వేప చెట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ సహజ ఉత్పత్తులను అమ్మే దుకాణాలు, ఆన్‌లైన్ వెబ్ సైట్లలోనూ ఈ వేప పుల్లలు అందుబాటులో ఉంటున్నాయి.
- గుప్పెడు వేపాకుల్ని తీసుకుని నీటిలో వేసి మరగనివ్వండి. తర్వాత దాన్ని వడగట్టండి. ఆ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని బాగా పుక్కిలించండి. తర్వాత వేలితో లేదా బ్రష్‌తో పళ్లను ఊరికే తోమి నోటిని శుభ్రం చేసుకోండి. నోటి దుర్వాసన, నోటిలో పుండ్లు లాంటి సమస్యలన్నీ దూరమవుతాయి. మంచి మౌత్ వాష్ లాగా పనిచేస్తుందిది.