Bad Breath | మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి-bad breath home remedies symptoms halitosis prevention ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bad Breath | మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి

Bad Breath | మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి

Himabindu Ponnaganti HT Telugu
Feb 28, 2022 02:44 PM IST

నోటి దుర్వాసనతో బాధపడే వారి బాధ వర్ణనాతీతం. మాట్లాడాలి అని ఉన్నా మాట్లాడలేని పరిస్థితి వారిది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నోటి దుర్వాసనకు కారణాలు ఏంటో కూడా చూద్దాం.

<p>నోటి దుర్వాసన</p>
నోటి దుర్వాసన (pexels)

చిగుళ్ల సమస్యలు, దంతాల ఇన్ఫెక్షన్ ఉన్న వారు, జీర్ణ క్రియ సరిగ్గాలేని వారు, ధూమపానం, మద్యపానం చేసేవారి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ సమస్యతో బాధపడేవాళ్లు మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటూ నోరు పొడి బారకుండా చూసుకోవాలి. అలాగే భోజనం చేసిన తర్వాత నోటిని నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాల మధ్యలో ఇరుక్కోపోయిన ఆహారం బయటకు వస్తుంది.

నోటి దుర్వాసనను దూరం చేసే చిట్కాలు

- కొంచెం మెత్తటి ఉప్పును బ్రష్‌పై వేసుకుని పళ్లు తోముకోవాలి. ఇలా చేయడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోయి దుర్వాసన పోతుంది. అలాగే పళ్లకు పట్టిన గార కూడా పోతుంది.

- రెండు మూడు లవంగాలను నోట్లో వేసుకొని నమలడం వల్ల దుర్వాసన దూరమై నోరు ప్రెష్‌గా ఉంటుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియా గుణాల వల్ల ఉపశమనం లభిస్తుంది.

- ఉదయం పళ్లు తోముకున్న తర్వాత గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించాలి. ఆ తర్వాత నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. 

- కొంచెం మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె పేస్టులా చేయాలి. ఈ పేస్టుతో పళ్లు తోమితే చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

- ఒక కప్పు నీటిని వేడి చేసుకుని అందులో స్పూన్ మెంతులు వేసి రాత్రంతా ఉంచండి. మరుసటి రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత ఈ నీరు తాగాలి. ఇలా రోజూ తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరికినట్లే.

నిమ్మరసంతో నోరు పొడిబారకుండా

- టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి పుక్కిలించాలి. కావాలంటే చిటికెడు ఉప్పును కూడా నిమ్మరసానికి కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నోరు పొడిబారడం తగ్గుతుంది.

- భోజనం తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవడం వల్ల కూడా నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. అలాగే కుదిరినప్పుడు జీలకర్ర టీ తాగినా లాభమే.

- కొత్తిమీర‌లో ఉండే క్లోరోఫిల్ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది నోటి వాసనను నివారించడానికి సహాయపడుతుంది. కొత్తి మీరను తీసుకుని నోట్లో వేసి నలమడం లేదా కొత్తి మీర రసం తాగడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

- పెరుగు తినడం, గ్రీన్ టీ తాగడం ద్వారా కూడా నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. పెరుగులోని ప్రోబయోటిక్స్ నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం