Raw Vegetables: ఈ 5 కూరగాయలను పచ్చిగా తినకూడదు! ఎందుకంటే..-5 vegetables you should never eat raw check details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raw Vegetables: ఈ 5 కూరగాయలను పచ్చిగా తినకూడదు! ఎందుకంటే..

Raw Vegetables: ఈ 5 కూరగాయలను పచ్చిగా తినకూడదు! ఎందుకంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 13, 2023 10:11 PM IST

Raw Vegetables: కూరగాయలను పచ్చిగా తినడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి. అయితే, కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తినకూడదు. అవేంటో ఇక్కడ చూడండి.

కూరగాయలు (Photo Credit: Unsplash)
కూరగాయలు (Photo Credit: Unsplash)

Raw Vegetables: కూరగాయలను వండడం ద్వారా వాటిలోని పోషకాలు తగ్గుతాయి. అందుకే చాలా వరకు కూరగాయలను పచ్చిగా తింటేనే మంచిది. శక్తి, మంచి చర్మం, జీర్ణక్రియకు మేలు జరిగేందుకు సహా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం కూరగాయలను పచ్చిగా తింటేనే మేలు. కూరగాయలను ఎక్కువగా ఉడికించినా.. ఫ్రై చేసినా వాటిలోనే పోషకాలు పోతాయి. అయితే, కొన్ని రకాల కూరగాయలను మాత్రం పచ్చిగా తినకూడదు. వండుకొనే తినాలి. ఎందుకంటే వాటిలో పురుగులు, బ్యాక్టీరియా, రసాయనాలు ఉండే అవకాశం ఉంటుంది. అలా.. పచ్చిగా తినకూడని ఐదు రకాల కూరగాయలు ఏవో ఇక్కడ చూడండి.

క్యాబేజీ

క్యాబేజీ తినడం వల్ల చాలా పోషకాలు అందుతాయి. అయితే, క్యాబేజీని పచ్చిగా మాత్రం అసలు తినకూడదు. ఎందుకంటే క్యాబేజీపై కంటికి కనిపించని పురుగులు, పురుగుల గుడ్లు ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి. క్రిమిసంహారక మందుల నుంచి తప్పించుకొని కొన్ని పురుగులు క్యాబేజీలో అలానే ఉంటాయి. అందుకే క్యాబేజీని బాగా కడగాలి. ఆ తర్వాత వేడి నీటిలో వేసి ఉడికించి తినాలి. కర్రీ చేసున్నా మరీ ఎక్కువగా ఉడికిస్తే క్యాబేజీలోని పోషకాలు తగ్గుతాయి.

క్యాప్సికమ్

క్యాప్సికమ్‍ను పచ్చిగా తినకండి. క్యాపికమ్‍లలో ఉండే విత్తనాలను తీస్తేనే మంచిది. ఎందుకంటే ఈ విత్తనాల్లో పురుగుల గుడ్లు ఉండే అవకాశం ఉంది. అందుకే విత్తనాలు తీసేయాలి. ఆ తర్వాత క్యాప్సికమ్‍ను వేడి నీటిలో ఉడికించి తినొచ్చు.

వంకాయ

వంకాయలను కూడా పచ్చిగా తినకూడదు. వీటిని కట్ చేసి నీటిలో శుభ్రంగా కడిగి వండుకోవాలి. వంకాయలను తప్పకుండా బాగా ఉండికించే తినాలి. వంకాయల్లో టేప్‍పామ్ అనే సన్నని పురుగులు ఉంటాయి. అందుకే సరిగా ఉడికిస్తే వాటి ప్రభావం పోతుంది. పొడవు వంకాయలను పచ్చిగా అసలు తినకూడదు.

క్యాలిఫ్లవర్

క్యాలీఫ్లవర్‌ను కూడా పచ్చిగా తినకూడదు. క్యాలిఫ్లవర్‌లో పురుగులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే క్యాలిఫ్లవర్‌ను వలిచి నీటిలో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత నీటిలో ఉడికించాలి. కర్రీ వండుకోవాలన్నా అందులో క్యాలిఫ్లవర్ నేరుగా వేయకుండా నీటిలో ఉడికించిన తర్వాత వేస్తే అత్యుత్తమం. బ్రకోలీ విషయంలోనూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

బంగాళదుంపలు

బంగాళదుంపలను కూడా పచ్చిగా తినడం మంచిది కాదు. వీటిని పచ్చిగా తింటే జీర్ణసంబంధిత సమస్యలు వస్తాయి. బంగాళదుంపలను ఉడికించి తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఫ్రై చేసి తింటే కాస్త పోషకాలు తగ్గుతాయి.

ఇవి మినహా.. చాలా రకాల కూరగాయలను పచ్చిగా తింటేనే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కూరగాయలను వండకుండా తింటే పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే, కూరగాయలను నీటితో శుభ్రంగా కడగాలి. దీంతో దానిపై ఏవైనా క్రిమిసంహారకాలు, రసాయనాలు ఉన్నా.. తొలగిపోతాయి.

Whats_app_banner