Herbs and Spices । మీ రోగనిరోధక శక్తిని సహజంగా బలోపేతం చేసే కొన్ని మూలికలు, సుగంధాలు!
Herbs and Spices for Immunity: రానున్నది వర్షాకాలం మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కొన్ని అమూల్యమైన మూలికలు, సుగంధాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Herbs and Spices: వంటకాలకు రుచి రావాలంటే అందులో ఉప్పు వేసుకుంటాము. కానీ ఉప్పు ఎక్కువ తినడం అస్సలు మంచిది కాదు. ఈ ఉప్పుకు బదులు మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఉపయోగించాలి. ఇవి చప్పగా ఉండే భోజనాన్ని రుచికరంగా మార్చగలవు, అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించగలవు. మనకు చాలా రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలా వరకు యాంటీఆక్సిడెంట్ల శక్తితో నిండి ఉంటాయి.
భారతీయులు పురాతన కాలం నుండే వంటల్లో మంచి రుచి, వాసనల కోసం సుగంధద్రవ్యాలను ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం అనేక మూలికలను అనారోగ్యాలను నివారించడానికి సాంప్రదాయ ఔషధాలుగా ఉపయోగించమని సిఫార్సు చేస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను అదుపులో ఉంచడానికి కూడా మూలికలు, సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం సమర్థవంతంగా పనిచేస్తాయి అని అనేక శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి.
రానున్నది వర్షాకాలం (Monsoon 2023), అనేక సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులను ఎదుర్కోవడానికి మీకు బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. ఈ నేపథ్యంలో న్యూట్రిషనిస్ట్ అనుపమ మీనన్.. ఏ సీజన్‌లో అయినా మీ రోగనిరోధక శక్తిని (Immunity Power) మెరుగుపరచడానికి కొన్ని అమూల్యమైన మూలికలు, సుగంధాల గురించి తెలియజేశారు. అవేమిటో మీరూ ఇక్కడ తెలుసుకోండి.
1. పసుపు: పసుపులో కర్కుమిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. నొప్పి, గాయాల నివారణకు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక పనితీరు మెరుగుపరచడానికి పసుపు శక్తివంతమైన ఔషధంగా సహాయపడుతుంది.
2. అల్లం: ఘాటుగా ఉండే ఈ సుగంధంలో జింజెరాల్ ఉంటుంది, ఇది యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లం మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, నొప్పి, వాపులను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
3. వెల్లుల్లి: అల్లిసిన్ అనే సమ్మేళనం వెల్లుల్లిలో కనిపిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీమైక్రోబయల్, యాంటీవైరల్ లక్షణాలను ప్రదర్శిస్తుంది. అల్లిసిన్ అధిక కంటెంట్ కారణంగా వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ఒక గొప్ప సుగంధం. ఇది రోగనిరోధక కణాలను ప్రేరేపిస్తుంది, ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
4. దాల్చినచెక్క: దాల్చిన చెక్కలో రోగనిరోధక వ్యవస్థను పెంచే సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నొప్పి నివారణి లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
5. ఒరేగానో: ఈ సువాసభరితమైన మూలికలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. దీనితో పాటు ఇతర విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది, ఇది రోగనిరోధక పనితీరును పెంచుతుంది. ఒరేగానోలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇవి వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడతాయి.
6. రోజ్మేరీ: మీ వంటకాలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, రోజ్మేరీలో రోస్మరినిక్ యాసిడ్ ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంటట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక పనితీరును పెంచి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
7. థైమ్: థైమ్‌లో విటమిన్లు సి, ఎ లతో పాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఈ మూలిక యాంటీమైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది, ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది.
8. కాయెన్ పెప్పర్: ఈ సుగంధం కాప్సైసిన్ సమ్మేళనంను కలిగి ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాలకు ప్రసిద్ధి చెందింది. ఇంకా మిరియాలు మంటను తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, జలుబు తగ్గించటానికి సహాయపడటమే కాకుందా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
9. జీలకర్ర: జీలకర్ర అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక సుగంధ దినుసు. ఇది యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన ఖనిజాలను కలిగి ఉంటుంది, రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
10. తులసి: ఈ మూలిక రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచే విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. తులసిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి , శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి ఆకులు ఒత్తిడి, ఆందోళనలను కూడా తగ్గించగలవు.
సంబంధిత కథనం