Monday Motivation: సంతోషం నిజంగా ఎక్కడుందో తెలుసుకో.. హాయిగా జీవించొచ్చు!
Monday Motivation: సంతోషంగా ఉండాలని అందరూ అనుకుంటారు. దేనిలో ఆనందం ఉందో వెతుక్కుంటూ ఉంటారు. జీవితాన్ని సంతోషంగా ఎలా గడపాలో అని అన్వేషిస్తుంటారు. అయితే, నిజంగా అది ఎక్కడ ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
సంతోషం.. దీన్ని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. జీవితాంతం ఆనందంగా గడపాలని ఆకాక్షిస్తుంటారు. దీని కోసమే ఆరాటపడుతుంటారు. అయితే, ఈ సంఘర్షణలో చాలా మంది ప్రస్తుతంలో సంతోషంగా ఉండలేరు. అయితే, దేని కోసమో తపిస్తూనే ఉంటారు. సంతోషంగా ఉండాలంటే ముందు అది నిజంగా ఎక్కడుందో తెలుసుకోవాలి.
సంతోషం.. మనలోనే..
విజయాలు సాధిస్తేనో.. భారీగా డబ్బు సంపాదిస్తేనో.. ఏదైనా గొప్పగా చేస్తేనో సంతోషం దక్కుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే, నిజమైన సంతోషం అనేది మనలోనే దాగి ఉంటుంది. ఏమీ లేకపోయినా సంతోషంగా ఉండాలని బలంగా అనుకుంటే అలాగే ఉండొచ్చు. బాహ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. విజయమే సంతోషాన్ని ఇస్తుందనుకుంటే.. ఓటమి ఎదురైనప్పుడు కుంగుబాటుకు గురి కావాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికీ ఆనందాన్ని బయట వెతుక్కోకూడదు. సంతోషాన్ని దేనికీ ముడిపెట్టకూడదు. జీవితంలో విజయాలు, ఎదుగుదల కోసం పూర్తిస్థాయిలో శ్రమించాలి. కానీ ఓటమి ఎదురైనా బాధపడకూడదు.
మనసులో సంతోషాన్ని చెదరనీయకుండానే పరిస్థితులతో పోరాడాలి. సంతోషంగా ఉండాలని మనసులో గట్టిగా అనుకుంటే.. అలాగే ఉండొచ్చు. ఏమీ లేకుండా.. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కూడా కొందరు చిరునవ్వులు చిందిస్తుంటారు. అలాంటి వారిని ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలి.
సంతృప్తి ముఖ్యం
జీవితంలో ఏదో దక్కితే సంతోషంగా ఉంటామనుకునేది వాస్తవం కాదు. ప్రస్తుతం ఉన్న దాంతో సంతృప్తిగా ఫీలై సంతోషంగా ఉండాలి. ఇలా ఆలోచించడం వల్ల ఇప్పుడే హ్యాపీగా ఉండొచ్చు. సంతోషమనేది వాయిదా వేయాల్సింది కాదు.. ఇప్పుడే అనుభవించాల్సింది. కావాల్సిన దాని కోసం కృషి చేస్తూ కూడా ఆనందంగా జీవితం గడపొచ్చు. ఏదో సాధిస్తేనో, మరేదో దక్కితేనే సంతోషంగా ఉండగలమనేది సరైన విషయం కాదు. ప్రస్తుతం ఉన్న వాటిని అనుభవిస్తేనే సంతోషంగా ముందుకు సాగొచ్చు. సంతోషం అనేది మనలోనే.. మన ఆలోచనల్లోనే ఉంటుంది.
సంతోషం మీ నిర్ణయమే
సంతోషంగా ఉండాలనే మీ నిర్ణయంగానే ఉండాలి. అలా ముందుకు సాగాలని మీరు అనుకుంటే జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆనందంగా ముందుకు సాగొచ్చు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొంటూ పోరాడవచ్చు. ఎందుకంటే ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగిపోవాలా.. ఉత్సాహంతో ఆనందంగా వాటిని ఢీకొట్టాలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సంతోషమనేది ఛాయిస్. నిరంతరం దాన్నే ఎంపిక చేసుకోవాలి.