Ragi Murukulu Recipe: క్రిస్పీగా, టేస్టీగా రాగి మురుకులు.. తయారు చేసుకోండిలా..
Ragi Murukulu Recipe: రాగి మురుకులు కరకరలాడుతూ మంచి రుచికరంగా ఉంటాయి. స్నాక్‍గా తింటే అలా లోపలికి వెళుతూనే ఉంటాయి. ఈ రాగి మురుకులను ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
Ragi Murukulu Recipe: క్రిస్పీగా, టేస్టీగా రాగి మురుకులు.. తయారు చేసుకోండిలా..
రాగి పిండితో చాలా రకాల వంటకాలు చేయవచ్చు. ఆరోగ్యానికి మంచిదైన రాగుల పిండి వాడి క్రిస్పీగా ఉండే మురుకులు తయారు చేసుకోవచ్చు. కరకరలాడుతూ కాస్త కారంగా రాగి ఫ్లేవర్‌తో ఈ మురుకులు అందరికీ నచ్చేస్తాయి. చేయడం కూడా సులభమే. ఈ రాగి మురుకులు ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
రాగి మురుకుల తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల రాగి పిండి
- ఓ కప్పు బియ్యం పిండి
- అరకప్పు పుట్నాలు (మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి)
- ఓ టీస్పూన్ కారం
- రుచికి సరిపడా ఉప్పు
- ఓ టీస్పూన్ వాము
- పావు కప్పు తెల్ల నువ్వులు
- చిటికెడు ఇంగువ
- రెండు టేబుల్ స్పూన్‍ల నెయ్యి
- పిండి కోసం కావాల్సినంత నీరు
- వేయించుకునేందుకు వంట నూనె
రాగి మురుకులు తయారు చేసుకునే విధానం
- ముందుగా స్టవ్‍పై ఓ ప్యాన్ పెట్టి సన్నని మంటపై రాగి పిండిని వేయించుకోవాలి. పిండిలో పచ్చిన వాసన పోయే వరకు వేపుకోవాలి. ఆ తర్వాత పిండిని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి.
- పుట్నాలను మిక్సీలో మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత రాగి పిండిని ఓ పెద్ద గిన్నెలో వేసుకోవాలి. దానిపై పుట్నాల పొడిని జల్లించుకోవాలి.
- రాగి పిండి, పుట్నాల పొడిని కలపాలి. ఆ తర్వాత దాంట్లో బియ్యం పిండి, కారం, ఉప్పు, నలిపిన వాము, తెల్ల నువ్వులు, ఇంగువ వేసి ఆ వాటిని బాగా కలపాలి.
- పిండిలో వేసుకునేందుకు నెయ్యిని ఓ ప్యాన్‍లో వేడి చేయాలి.
- వేడయ్యాక నెయ్యిని పిండిలో వేసి చేతి వేళ్లతో బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెంకొంచెం నీరు వేసుకుంటూ పిండిని బాగా కలపాలి. పిండి సాఫ్ట్‌గా కలుపుకోవాలి.
- ఆ తర్వాత కలుపుకున్న పిండిని మురుకుల పావు (జంతికల గొట్టం)లో పెట్టుకోవాలి. మీకు ఇష్టమైన బిళ్లను పెట్టి మురుకులను వత్తుకోవచ్చు. రౌండ్‍గా మురుకుల్లా వత్తుకోవాలి.
- ఆ తర్వాత బాగా వేడెక్కిన నూనెలో వత్తుకున్న మురుకులను వేయాలి. ఆ తర్వాత మంటను మీడియంకు తగ్గించి మురుకులను ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూ వేయించుకోవాలి.
- మురుకులు బాగా ఫ్రై అయి నురగలు తగ్గాక బయటికి తీసుకోవచ్చు. వత్తుకున్న మురుకులన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతే రాగి మురుకులు సిద్ధమవుతాయి. కరకరలాడే వీటిని ఎంచక్కా తినేయవచ్చు.
టాపిక్