Viswam Review: విశ్వం రివ్యూ - గోపీచంద్, శ్రీనువైట్లలకు హిట్టు దక్కిందా? లేదా?
Viswam Review: గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం మూవీ శుక్రవారం రిలీజైంది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. విశ్వం మూవీ ఎలా ఉందంటే?
Viswam Review: హీరోగా గోపీచంద్, డైరెక్టర్‌గా శ్రీనువైట్ల సక్సెస్ అందుకొని చాలా కాలమైంది. హిట్టు కోసం ఎదురుచూస్తున్న వీరిద్దరు కలిసి చేసిన తాజా చిత్రం విశ్వం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వం మూవీని నిర్మించింది. విశ్వంతో గోపీచంద్‌కు సక్సెస్ దక్కిందా? తన మార్కు కామెడీ కథతో శ్రీనువైట్ల ఆడియెన్స్‌ను నవ్వించాడా? లేదా అంటే?
విశ్వం పోరాటం...
విశ్వం (గోపీచంద్) తాను ప్రేమించిన అమ్మాయి సమీరాను (కావ్య థాపర్) వెతుక్కుంటూ ఇటలీ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. సమీరా అన్న కూతురు దర్శనిని కాపాడి ఆమె కుటుంబానికి దగ్గరవుతాడు. తన పేరును గోపి అంటూ సమీరా ఫ్యామిలీకి అబద్ధం చెబుతాడు. కేంద్ర మంత్రి హత్యను కళ్లారా చూసిన దర్శనిని చంపేందుకు బాచిరాజుతో (సునీల్) కలిసి పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్ట్ ఖురేషి (జిషు సేన్ గుప్తా) ప్రయత్నిస్తుంటాడు.
బాంబు బ్లాస్ట్‌లతో విధ్వంసం సృష్టించాలని బాచిరాజు, ఖురేషి వేసిన ప్లాన్‌ను విశ్వం అడ్డుకున్నాడా? అసలు విశ్వం ఎవరు? దర్శనిని అతడు కాపాడటానికి కారణం ఏమిటి? నిజంగానే సమీరా ప్రేమ కోసమే విశ్వం హైదరాబాద్ వచ్చాడా? విశ్వం అసలు లక్ష్యం ఏమిటి? ఇటలీలో విశ్వం,సమైరా మధ్య ఎలా పరిచయం ఏర్పడింది? అన్నదే విశ్వం మూవీ కథ.
శ్రీను వైట్ల ఫార్ములా...
శ్రీను వైట్ల ఫార్ములా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తన ఐడెంటీటీని దాచిపెట్టి విలన్స్‌ను హీరో బకరా చేయడం, చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అనే ఫార్ములాను వాడుకుంటూ రెడీ నుంచి దూకుడు వరకు పలు సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాడు. సక్సెస్ కోసం చాలా రోజుల తర్వాత మళ్లీ ఇదే కాన్సెప్ట్‌ను నమ్మి శ్రీనువైట్ల చేసిన మూవీ విశ్వం.
టెర్రరిజం బ్యాక్‌డ్రాప్...
విశ్వం మూవీలో కథ పరంగా శ్రీనువైట్ల మూవీస్ ఓల్డ్ ఫ్లేవర్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కామెడీతో ఆ ఫీల్ ఆడియెన్స్‌లోకలగకుండా జాగ్రత్తపడ్డారు. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్, చెల్డ్‌సెంటిమెంట్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీ జోడించి శ్రీనువైట్ల విశ్వం మూవీ కథ రాసుకున్నాడు.
కామెడీతో టైమ్‌పాస్...
కథ విషయంలో విశ్వం ఆకట్టుకోకపోయినా కామెడీతో టైమ్‌పాస్ చేస్తుంది. డిఫరెంట్ మ్యానరిజమ్స్, పేర్లతో కామెడీ క్యారెక్టర్లను క్రియేట్ చేస్తూ ఎంటర్‌టైనర్ చేయడంలో శ్రీనువైట్ల స్పెషలిస్ట్. ఇందులో జాలీరెడ్డి (పృథ్వీ), మ్యాంగో శ్యామ్(నరేష్) పాత్రలు ఫస్ట్ హాఫ్‌లో హిలేరియస్‌గా నవ్విస్తాయి. ఇటలీ నుంచి వచ్చిన విశ్వం జాలీరెడ్డి సహాయంతో సమైరా ఫ్యామిలీకి ఎంటర్ కావడం, దర్శిని కాపాడే సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది.
అసలు విశ్వం ఎవరు? దర్శినితో అతడు ఎందుకు కాపాడుతున్నాడనే ప్రశ్నలకు సంబంధించిన చిక్కుముడులను సెకండాఫ్‌లో రివీల్ చేసుకుంటూ వెళ్లారు. రొటీన్‌గా సాగే సెకండాఫ్‌లో ట్రైన్ ఎపిసోడ్ కాస్త రిలీఫ్ నిస్తుంది. ఈ ట్రాక్‌లో వెన్నెలకిషోర్, వీటీవీ గణేష్ తమ కామెడీ టైమింగ్‌తో అలరించారు. క్లైమాక్స్ సాదాసీదాగా అనిపిస్తుంది.
గ్లామర్ రోల్...
కామెడీ కలగసిన యాక్షన్‌పాత్రలు గోపీచంద్ ఇదివరకు చాలానే చేశాడు. అందుకే విశ్వం పాత్రను ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కావ్య థాపర్ గ్లామర్ పరంగా సినిమాకు ప్లస్సయింది. పృథ్వీ, వెన్నెలకిషోర్, ప్రగతి, నరేష్, రాహుల్ రామకృష్ణ ఇలా సినిమాలో చాలా మందే కమెడియన్లు సినిమాలో కనిపిస్తారు. అందరూ తమ పరిధుల మేర నవ్వించారు. జిషు సేన్ గుప్తా విలనిజంలో కొత్తదనం లేదు.
విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీపడకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది.
కామెడీతో టైమ్‌పాస్...
శ్రీను వైట్ల మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. కథ, కథనాల పరంగా కొత్తదనం లేకపోయినా కామెడీతో విశ్వం టైమ్‌పాస్ చేస్తుంది.
రేటింగ్: 2.75/5