OTT Action Thriller: ఓటీటీలో సైతాన్‍ను దాటేసిన విజయ్ సేతుపతి సినిమా.. ఇంకా ట్రెండింగ్‍లోనే..
Maharaja OTT Streaming: మహారాజ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రం భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో వ్యూస్‍లో బాలీవుడ్ మూవీ సైతాన్‍ను దాటేసింది. ఆ వివరాలు ఇవే.
మహారాజ సినిమా థియేటర్లలో బిగ్ హిట్ కాగా.. ఓటీటీలో అంతకు మించి అదరగొడుతోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా భారీ కలెక్షన్లతో పాటు ప్రశంసలను అందుకుంది. జూన్ 14వ తేదీన తమిళం, తెలుగులో ఈ చిత్రం రిలీజ్ అయింది. అంచనాలను మించి వసూళ్లను దక్కించుకుంది. ఓటీటీలోనూ నాలుగు వారాలుగా భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ మూవీని మహారాజ దాటేసింది.
సైతాన్‍ను బీట్ చేసి..
మహారాజ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళుతోంది. జూలై 12వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ఈ సినిమా ఆరంభం నుంచే భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. ఓటీటీ రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ మరింత పెరగడంతో ఫుల్ సక్సెస్ అయింది. దీంతో బాలీవుడ్ సినిమాలనే మహారాజ దాటేస్తోంది.
మహారాజ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అజయ్ దేవ్‍గణ్ ‘సైతాన్’ సినిమాను దాటేసింది. 2024లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ సినిమాల జాబితాలో ఈ సినిమా మూడో ప్లేస్‍కు వచ్చింది. షైతాన్‍ను నాలుగో ప్లేస్‍కు పంపి మూడో స్థానంలోకి మహారాజ ఎకబాకింది.
సైతాన్ చిత్రానికి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పటి వరకు 14.8 మిలియన్ వ్యూస్ రాగా.. మహారాజ తాజాగా 15.5 మిలియన్ వ్యూస్ మార్క్ దాటింది. దీంతో 2024లో ఆ ప్లాట్‍ఫామ్‍లో ఎక్కువ మంది చూసిన మూడో మూవీగా నిలిచింది. ఈ జాబితాలో మహారాజ కంటే ముందు క్రూ, లాపతా లేడీస్ ఉన్నాయి.
ఇంకా దూకుడు
మహారాజ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మొదటి నుంచి దుమ్మురేపుతోంది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయి స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. తమిళం, తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలోనూ ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. అదిరిపోయే వ్యూస్ రావటంతో కొన్ని రోజులు టాప్‍లో కూడా ట్రెండ్ అయింది. స్ట్రీమింగ్‍కు వచ్చి సుమారు నెల అవుతున్నా నెట్‍ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ సినిమాల్లో నేటికి (ఆగస్టు 10) కూడా టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఆ రేంజ్‍లో మహారాజకు వ్యూస్ దక్కుతున్నాయి. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సావి టాప్‍లో ఉంది.
మహారాజ చిత్రానికి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. కథ కొత్తది కాకపోయినా ఆయన తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా స్క్రీన్‍ప్లేతోనే కట్టిపడేశారు. భావోద్వాగాలు కూడా బాగా పండాయి. సినిమా మొత్తం ఉత్కంఠతో ఉండేలా నిథిలన్ తెరకెక్కించి ప్రశంసలు అందుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి మరోసారి అద్భుతంగా నటించారు. హీరోగా ఆయనకు ఇది 50వ మూవీ కావడం మరింత ప్రత్యేకంగా ఉంది. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి, అరుల్‍దాస్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
మహారాజ సినిమా సుమారు రూ.110కోట్ల కలెక్షన్లను రాబట్టింది. రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ మూవీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించి బంపర్ హిట్‍గా నిలిచింది. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ పతాకాలపై సుధాన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి అజ్నీశ్ లోకనాథ్ మ్యూజిక్ ఇచ్చారు.