Spy Action OTT: థియేటర్లలో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వచ్చిన విజయ్ ఆంటోనీ తుఫాన్ - ఎందులో చూడాలంటే?
Toofan OTT: విజయ్ ఆంటోనీ తుఫాన్ మూవీ థియేటర్లలో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వచ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ యాక్షన్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సత్యరాజ్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.
Toofan OTT: విజయ్ ఆంటోనీ తుఫాన్ మూవీ థియేటర్లలో రిలీజై వారం కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చింది. ఈ యాక్షన్ డ్రామా మూవీ ఈ నెల 11న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ గురువారం సడెన్‌గా ఓ టీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తుఫాన్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ మరో వారం తర్వాత స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
మేఘా ఆకాష్ హీరోయిన్...
తమిళంలో ఈ మూవీ మజై పిడిక్కాథ మణితాన్ పేరుతో తెరకెక్కింది. ఈ యాక్షన్ మూవీని తుఫాన్ పేరుతో తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తుఫాన్ మూవీకి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. ఇందులో శరత్‌కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ కీలక పాత్రలు పోషించారు. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించింది. ఈ యాక్షన్ మూవీకి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం గమనార్హం. విజయ్ ఆంటోనీతో పాటు అచ్చు రాజమణి, రాయ్, హరీ దఫుసీయా, వగు మజన్ మ్యూజిక్ అందించారు.
సీక్రెట్ ఏజెంట్ లవ్ స్టోరీ...
సలీం ( విజయ్ ఆంటోనీ) ఓ సీక్రెట్ ఏజెంట్. తన బాస్ (శరత్ కుమార్) అప్పగించిన ఆపరేషన్ కోసం అండమాన్ దీవుల్లోని ఓ ఊరికి వస్తాడు. ఆ ఊరిలో డాలీ (డాలీ ధనుంజయ) అనే వడ్డీ వ్యాపారి చెప్పిందే వేదం. అతడి కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వారిలో సౌమ్య(మేఘా ఆకాష్) కూడా ఉంటుంది. సౌమ్యతో సలీమ్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది?
డాలీ బారి నుంచి ఆ ఊరి ప్రజలను సలీమ్ ఎలా కాపాడాడు? సౌమ్య కంటే ముందే సలీమ్ జీవితంలో ఉన్న మరో అమ్మాయి ఎవరు? ఆమె ఎలా ప్రాణాలను కోల్పోయింది? అసలు సలీమ్...అండమాన్‌కు ఎందుకొచ్చాడు? ఈ కథలో కెప్టెన్ (సత్యరాజ్) పాత్ర ఏమిటనే పాయింట్‌తో డైరెక్టర్ విజయ్ మిల్టన్ ఈ మూవీని తెరకెక్కించాడు.
హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో...
హాలీవుడ్‌లో విజయవంతమైన పలు యాక్షన్ సినిమాల స్ఫూర్తితో దర్శకుడు విజయ్ మిల్టన్ తుఫాన్ మూవీ కథను రాసుకున్నాడు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడంతో తుఫాన్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
తమిళంలో ఆగస్ట్ 2న రిలీజ్...
తమిళ వెర్షన్ మజై పిడిక్కాథ మణితాన్ ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజైంది. అదే రోజు తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. పలు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలవడంతో ఆగస్ట్ 11కు తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేశారు. తెలుగు వెర్షన్ థియేటర్లలో ఉండగానే ఈ మూవీ ఓటీటీలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది విజయ్ ఆంటోనీకి ఇది రెండో డిజాస్టర్. అతడి గత మూవీ రోమియో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.