Vadakkupatti Ramasamy Review: వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన సంతానం కామెడీ మూవీ ఎలా ఉందంటే?-vadakkupatti ramasamy review santhanam megha akash tamil comedy movie review aha ott and amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vadakkupatti Ramasamy Review: వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన సంతానం కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Vadakkupatti Ramasamy Review: వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన సంతానం కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Mar 26, 2024 12:21 PM IST

Vadakkupatti Ramasamy Review: సంతానం, మేఘా ఆకాష్ జంట‌గా న‌టించిన త‌మిళ మూవీ వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి అమెజాన్ ప్రైమ్‌, ఆహా ఓటీటీల‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ త‌మిళ మూవీని టాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించింది.

వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి
వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి

Vadakkupatti Ramasamy Review: సంతానం, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా న‌టించిన త‌మిళ మూవీ వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ త‌మిళంలో నిర్మించిన ఈ తొలి మూవీకి కార్తిక్ యోగి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ఎలా ఉందంటే?

వ‌డ‌క్కుప‌ట్టి గుడి క‌థ‌...

వ‌ర‌ద‌ల కార‌ణంగా వ‌డ‌క్కుప‌ట్టి ఊరు ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతారు. అందులో రామ‌సామి కుటుంబం ఉంటుంది. ఇళ్లు, భూములు మునిగిపోవ‌డంతో త‌ల్లి కుండ‌లు చేస్తూంటే వాటిని అమ్మి రామ‌సామి (సంతానం) బ‌తుకుతుంటాడు. రామ‌సామి డ‌బ్బు మ‌నిషి. రామ‌సామి కార‌ణంగా ప్ర‌తి అమావాస్య రోజు ఆ ఊరిని చాలా ఏళ్లుగా వేధిస్తోన్న రాక్ష‌సుడి పీడ విర‌గ‌డ అవుతుంది.

రామ‌సామి చేసిన ఓ కుండ‌ను అమ్మ‌వారిగా ప్ర‌జ‌ల కొల‌వ‌డం మొద‌లుపెడ‌తారు. ప్ర‌జ‌ల భ‌క్తిని, వారి స‌మ‌స్య‌ల‌ను అడ్డం పెట్టుకొని త‌న ఇంటిస్థ‌లంలోనే అమ్మ‌వారి గుడి క‌ట్టిస్తాడు రామ‌సామి.

త‌న మ‌నుషుల‌తో గుడిని నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బు దొచుకుంటుంటాడు. రామ‌సామి ప్లాన్‌ను క‌నిపెడ‌తాడు కొత్త‌గా వ‌చ్చిన తాహ‌సీల్దార్ . రామ‌సామి దోచుకుంటున్న డ‌బ్బులో వాటా కావాల‌ని అంటాడు. అందుకు రామ‌సామి ఒప్పుకోక‌పోవ‌డంతో ఊరి పెద్ద‌ల (జాన్ విజ‌య్‌, రవి మ‌రియా) మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించి రామ‌సామి గుడిని మూసేయిస్తాడు తాహ‌సిల్దార్‌.

ఆ గొడ‌వ‌లు ఆగితేనే గుడిని తిరిగి తెరిచేందుకు అవ‌కాశం ఇస్తాన‌ని క‌లెక్ట‌ర్ చెబుతాడు. గొడ‌వ‌లు ఆపేందుకు రామ‌సామి ఏం చేశాడు? ఆ ఊరికే చెందిన డాక్ట‌ర్ క‌యాల్‌ను (మేఘా ఆకాష్‌) అడ్డంపెట్టుకొని రామ‌సామి ప్లాన్‌ను తాహ‌సీల్దార్ ఎలా తిప్పికొట్టాడు? చివ‌ర‌కు గుడి కోసం రామ‌సామి వ‌డ‌క్కుప‌ట్టి ఊరినే వ‌దిలి పెట్టాల్సిన ప‌రిస్థితి ఎందుకొచ్చింది? రామ‌సామి మంచిత‌నాన్ని క‌యాల్ అర్థం చేసుకుందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సెన్సిటివ్ పాయింట్‌...

ప్ర‌జ‌ల భ‌క్తి, మూఢ‌న‌మ్మ‌కాల‌ను అడ్డుపెట్టుకొని కొంద‌రు ఎలా డ‌బ్బు గ‌డిస్తున్నార‌నే క‌థ‌తో ద‌ర్శ‌కుడు కార్తిక్ యోగి వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సెన్సిటివ్ పాయింట్‌ను సీరియ‌స్‌గా కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఈ సినిమాలో ఆవిష్క‌రించాడు. హీరో సంతానంతో పాటు ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను డిఫ‌రెంట్ బాడీలాంగ్వేజ్‌తో గ‌మ్మ‌త్తుగా ఉండేలా డిజైన్ చేసుకున్నాడు డైరెక్ట‌ర్‌.

క‌న్ఫ్యూజ‌న్ కామెడీ...

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడ్డుపెట్టుకొని రామ‌సామి డ‌బ్బు దోచుకునే సీన్స్‌తోనే వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. త‌హ‌సీల్దార్ ఊరిలో అడుగుపెట్టిన త‌ర్వాతే క‌థ ఆస‌క్తిక‌రంగా మారుతుంది. రామ‌సామిపై ప‌గ‌ను పెంచుకున్న‌ త‌హ‌సీల్దార్ గుడిని మూసివేయ‌డం, ఆ గుడిని తెరిచేందుకు రామ‌సామి ప‌డే పాట్ల నుంచి కామెడీ బాగా ప‌డింది.

మ‌ద్రాస్ ఐ అనే కంటి స‌మ‌స్య‌ను అమ్మ‌వారి ఆగ్ర‌హం అంటూ ఊరి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేందుకు రామ‌సామి వేసిన ప్లాన్ ఆక‌ట్టుకుంటుంది. ఊరిపెద్ద‌లు జాన్ విజ‌య్‌, రవి మ‌రియా క్యారెక్ట‌ర్స్ కామెడీ ప‌రంగా ఈ సినిమాకు ప్ల‌స్స‌య్యాయి. క‌న్ఫ్యూజ‌న్ కామెడీ కొన్ని చోట్ల హిలేరియ‌స్‌గా వ‌ర్క‌వుట్ అయ్యింది. చివ‌ర‌లో నిళ‌ల్‌గ‌ల్‌ర‌వి, మోట్ట రాజేంద్రన్ కామెడీ ట్రాక్ ఆక‌ట్టుకుంటుంది. వారి సీన్స్‌లోని డైలాగ్స్ కొన్ని బాగా పేలాయి.

క్లైమాక్స్‌లో మెసేజ్‌...

చివ‌ర‌లో కొంద‌రు దేవుడిని న‌మ్ముతారు. కొంద‌రు న‌మ్మ‌రు. ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి. మ‌రికొరి న‌మ్మ‌కాల్ని త‌ప్పుప‌ట్ట‌వ‌ద్ద‌నే చిన్న సందేశం ఇచ్చాడు డైరెక్ట‌ర్‌.

హీరోయిన్ మేఘా ఆకాష్ క్యారెక్ట‌ర్ క‌థ‌లో బ‌ల‌వంతంగా ఇరికించిన ఫీలింగ్ క‌లుగుతుంది. సంతానం, మేఘా ఆకాష్‌ ల‌వ్ ట్రాక్ సినిమా నిడివిని పెంచ‌డానికే ఉప‌యోగ‌ప‌డింది. ఎండింగ్ అంత‌గా క‌న్వీన్సింగ్‌గా అనిపించ‌దు. సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకున్నాడు డైరెక్ట‌ర్‌.

సంతానం కామెడీ టైమింగ్‌...

రామ‌సామిగా సంతానం త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. అత‌డి పంచ్ డైలాగ్స్ క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. జాన్ విజ‌య్‌, ర‌వి మారియా, మోట్ట రాజేంద్ర‌న్‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు త‌మ కామెడీతో న‌వ్వించారు. మేఘా ఆకాష్ కు పీరియాడిక‌ల్ లుక్ స‌రిగ్గా సూట‌వ్వ‌లేదు.

మంచి టైమ్‌పాస్ మూవీ...

వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి రెండు గంట‌ల ఇర‌వై నిమిషాల పాటు న‌వ్వుల‌ను పంచే టైమ్‌పాస్ మూవీ. సంతానం కామెడీ టైమింగ్ ఆక‌ట్టుకుంటుంది.

Whats_app_banner