Vadakkupatti Ramasamy OTT: ఓటీటీలోకి వచ్చేసిన మేఘా ఆకాష్ తమిళ్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Vadakkupatti Ramasamy OTT: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఫస్ట్ తమిళ్ మూవీ వడకట్టు రామసామి ఓటీటీలోకి వచ్చేసింది. సంతానం, మేఘాఆకాష్ జంటగా నటించిన ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
Vadakkupatti Ramasamy OTT: సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన వడక్కుపట్టి రామసామి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం నుంచి అమెజాన్‌ప్రైమ్‌లో (Amazon Prime Video) ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. పీరియాడికల్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కార్తిక్ యోగి దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 2న తమిళంలో (Kollywood) థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. 1960, 70 కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది.
వడకట్టు రామసామి కథ ఇదే...
గతంలో సంతానం దర్శకుడు కార్తిక్ యోగి కాంబినేషన్‌లో డిక్కీలోనా అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలవడంతో వడక్కుపట్టి రామసామిపై అంచనాలు ఏర్పడ్డాయి. సంతానం కామెడీ బాగుందనే పేరొచ్చిన రోటీన్ స్టోరీ కారణంగా సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
ఓ ఊరిలో గుడి, దేవుడు పేరు చెప్పుకొని డబ్బులు గడిస్తుంటాడు రామసామి. అతడిపై కోపంతో కొందరు శత్రువులు గుడిని మూసేస్తారు. ఆ గుడిని తిరిగి తెరవడానికి రామసామి ఏం చేశాడు? ఓ డాక్టర్‌తో ప్రేమలో పడ్డ రామసామి ప్రియురాలి మనసును ఎలా గెలిపించుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ...
వడకట్టు రామసామి మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమాతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలోకి మాత్రం సంతానం మూవీతో అరంగేట్రం చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఫస్ట్ మూవీ వారికి నిరాశనే మిగిల్చింది.
దాదాపు 12 కోట్ల బడ్జెట్‌తో వడక్కుపట్టి రామసామి మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. థియేటర్లలో ఈ మూవీ కేవలం ఐదున్నర కోట్ల వరకు మాత్రమే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు ఆరు కోట్లకుపైగా నష్టాలను తెచ్చిపెట్టింది. వడక్కుపట్టి రామసామి మూవీ ఓటీటీలో తెలుగులోను రిలీజ్ కానున్నట్లు తెలిసింది. తెలుగు వెర్షన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
నితిన్ సినిమాతో ఎంట్రీ...
నితిన్ లై మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘాఆకాష్. సెకండ్ మూవీ ఛల్ మోహనరంగ కూడా నితిన్‌తోనే చేసింది. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. రజనీకాంత్ పేట, ధనుష్ తూటాతో పాటు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు చాలా వచ్చినా కమర్షియల్ హిట్టు మాత్రం దక్కలేదు. పరాజయాల కారణంగా స్టార్స్ సినిమాలకు దూరమైన మేఘా ఆకాష్ ప్రస్తుతం చిన్న సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.
గత ఏడాది తెలుగులో రవితేజ రావణాసురలో నెగెటివ్ షేడ్స్ పాత్రలో కనిపించింది. ఈ మూవీతో పాటు మను చరిత్ర, ప్రేమదేశం వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగులో ఓ మూడు సినిమాలు చేస్తోంది. కమెడియన్ నుంచి హీరోగా మారాడు సంతానం. జయాపజయాలకు అతీతంగా కామెడీ కథాంశాలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.