V Mega Pictures : ది ఇండియా హౌజ్.. నిఖిల్ హీరోగా వీ మెగా పిక్చర్స్ పాన్ ఇండియా మూవీ..
The India House : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యూవీ క్రియేషన్స్ విక్రమ్ రెడ్డి కొత్త ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరితో అభిషేక్ అగర్వాల్ కలిసి పనిచేస్తున్నాడు. వీరంతా తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ మెంట్ వచ్చింది.
రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి కలిసి వీ మెగా పిక్చర్స్(V Mega Pictures) ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశారు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ఈ సంస్థను నెలకొల్పారు. అయితే వీరితో కలిసి ఓ సినిమాకు పని చేసేందుకు నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) కూడా ముందుకు వచ్చాడు. వీరంతా కలిసి చేసే సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. వీ మెగా పిక్చర్స్.. పాన్ ఇండియా సినిమాలో ఎవరు నటిస్తారోనని బాగా చర్చ జరిగింది. మెుదటి అక్కినేని అఖిల్ నటిస్తాడని అందరూ అనుకున్నారు.
వీ మెగా పిక్చర్స్ నుంచి రాబోయే సినిమాలో అఖిల్ కాదు.. నిఖిల్(Nikhil) హీరో అని కన్ఫార్మ్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ది ఇండియా హౌజ్(The India House) అనే టైటిల్ తో పాన్ ఇండియా ప్రాజెక్టును.. రామ్ చరణ్, విక్రమ్, అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఇందులో నిఖిల్ హీరో. కార్తీకేయ 2(Karthikeya 2)తో నిఖిల్ మంచి హిట్ అందుకున్నాడు. అప్పుడే అభిషేక్ అగర్వాల్ తో పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో నిఖిల్ కి నార్త్ లోనూ మంచి గుర్తింపు వచ్చింది.
రామ్ చరణ్ కూడా ఓ నిర్మాత కావడంతో ది ఇండియా హౌజ్ సినిమా రేంజ్ పెరుగుతుంది. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ 140 జయంతి సందర్భంగా.., ఆయన జీవితంపై ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. రామ్ వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నిఖిల్.. శివ పాత్రలో నటిస్తుండగా.. అనుపమ్ ఖేర్(Anupam Kher) మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తాడు.
అయితే ఇండియా హౌజ్ అనేది ఫిక్షనల్ కథ కాదు. ఒకప్పుడు ఉత్తర లండన్లో, హైగేట్ లోని క్రోమ్ వెల్ అవెన్యూలో ఉన్న విద్యార్థి వసతి భవనం. న్యాయవాది శ్యామ్ జి కృష్ణ వర్మ ప్రోత్సాహంతో బ్రిటన్లోని భారతీయ విద్యార్థులతో జాతీయవాద భావాలను పురికొల్పేందుకు దీన్ని మెుదలుపెట్టారు. ఈ సంస్థ ఇంగ్లండ్లో ఉన్నత చదువులు కోసం వచ్చే భారతీయ యువకులకు స్కాలర్ షిప్ మంజూరు చేస్తుండేది. తర్వాత రాజకీయ ఆలోచనలకు ఈ భవనం కేంద్రంగా మారింది. ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రికను ఈ హౌజ్ నుంచి నడిపేవారు. సావర్కర్ కథని లింక్ చేస్తూ ది ఇండియా హౌజ్ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.