NTR Centenary Celebrations : శకపురుషునికి శతనీరాజనం, దేశ రాజకీయాలపై చెరగని ముద్ర 'ఎన్టీఆర్'
NTR Centenary Celebrations : తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదం పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్...దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేశారు. సంక్షేమ పథకాలు, సంస్కరణలతో నేటికి, ఏనాటికీ మరువలేని పాలన అందించారు.
NTR Centenary Celebrations : వెండి తెరపై మకుటం లేని మారాజు... రాజకీయాల్లో ప్రవేశించిన 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకున్న మహానేత. తెలుగు ప్రజలకు సంక్షేమ పాలన రుచిచూపిన పాలనాదక్షుడు. 1980 దశకంలో దేశ రాజకీయాలను ములుపుతిప్పిన తెలుగు బిడ్డ. తెలుగు వాడి ఆత్మగౌరవం అనే నినాదంతో రాజకీయ సంచనాలు సృష్టించిన యుగపురుషుడు... ఎన్టీఆర్. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఈ పేరు చెప్పగానే ముందుగా తెలుగు తెరపై కథానాయకుడు గుర్తొస్తే... మరోవైపు రాజకీయ సంచనాలు కళ్ల ముందు కనిపిస్తాయి. మద్రాసి అనే ముద్రను చెరిపేసి తెలుగుగడ్డ అనే గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్... రాజకీయాల్లో పెనుమార్పులే తీసుకొచ్చారు. సామాన్యుడికి రాజకీయ ఫలాలు, సంక్షేమ పాలన అందించాలనే లక్ష్యంతో 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ పెట్టారు.
తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో
1980వ దశకం వరకు దిల్లీ నాయకత్వానికి దక్షిణ భారతీయులంటే కేవలం మద్రాసీలే అనే భావం ఉండేది. ఆ మద్రాసీ ముద్ర నుంచి తెలుగువాడిని వేరుచేయాలని ఎన్టీఆర్ దృఢ నిర్ణయం తీసుకున్నారు. తెలుగువాడి ఆత్మభిమానాన్ని చాటాలనుకున్నారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అస్థితర ఉండడంతో.. తెర మీద జనంలోకి వెళ్లాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. 1978లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతర్గత కుమ్ములాటలతో ఐదేళ్ల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనించిన ఎన్టీఆర్.. తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకుని తెలగుదేశం మార్గం ఎంచుకున్నారు. 1982 మార్చి 29న కొత్త పార్టీ పెడుతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఎన్టీఆర్ పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేసింది.
రాజకీయాల్లో సరికొత్త ఒరవడి
ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండడంతో... రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు ఎన్టీఆర్. ప్రజలను చైతన్య పరిచేందుకు "చైతన్యరథం" ఎక్కి ప్రచారం మొదలుపెట్టారు. ఖాకీ దుస్తులు ధరించి చైతన్య రథంపై ఊరూరా తిరుగుతూ...ప్రచారం చేశారు. ఎన్టీఆర్ అనర్గళ ప్రసంగాలు తెలుగు ప్రజలను కట్టిపడేశాయి. ఎన్టీఆర్ ఉద్వేగ భరిత, ఉద్రేక పూరిత ప్రసంగాలు తెలుగు నాట కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడికి ఎన్టీఆర్ ఆనాడు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం కోసం ప్రత్యేక పాటలు రాయించి వారిని ఊరూరా పలికించారు. దీంతో 1983 జనవరి 7న వెలువడిన ఫలితాల్లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తూ... మొత్తం 294 స్థానాల్లో తెలుగుదేశం 199 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది.
సంక్షేమ పాలనకు ఆద్యుడు
తెలుగు ప్రజలకు సంక్షేమ పాలన ఎన్టీఆర్ తోనే మొదలైందనే అభిప్రాయంలేకపోలేదు. సంక్షేమం పథకాలకు కొత్త అర్థాన్ని ఇవ్వడమే కాకుండా, వాటి అమలులో రాజకీయాల్లో పండిపోయినవారినే ఆశ్చర్యపరిచారు. ప్రజలకు చేరువయ్యేలా ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైన వాటిల్లో రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఒకటి. ప్రతి పేదోడు కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు. జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికి కనీస అవసరమైన వస్త్రాలు అందించారు. అప్పట్లోనే బడుగు వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించారు. అప్పట్లో గంజి కేంద్రాలు పెట్టాలని వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తే...ఏకంగా అన్నం, సాంబార్ పథకమే తీసుకొచ్చారు ఎన్టీఆర్. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉన్న ప్రజా క్యాంటీన్లకు ఈ పథకమే ఆదర్శం. ఇక పేదల కోసం 5 లక్షల ఇళ్లు నిర్మాణం, పటేల్ పట్వారీ విధానం రద్దు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, నీటి పారుదల రంగాని ప్రాధాన్యత ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు, సంస్కరణలకు మూలం ఎన్టీఆర్.
దేశ రాజకీయ యవనికపై ఓ వెలుగువెలిగిన ధ్రువతార తెలుగు బిడ్డ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా హెచ్.టి తెలుగు శతనీరాజనం సమర్పిస్తోంది.