Malli Pelli Release Issue: ఆ సినిమా విడుదల ఆపాలని పిటిషన్..కోర్టులో రమ్య పిటిషన్
Malli Pelli Release Issue: నటుడు నరేష్, పవిత్ర జంటగా నటించిన మళ్లీ పెళ్లి చిత్ర విడుదలను ఆపాలని కోరుతూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రమ్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
Malli Pelli Release Issue: మళ్లీ పెళ్లి చిత్ర విడుదలను ఆపాలని కోరుతూ సినీ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నరేష్-పవిత్ర జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదల కానుండటంతో సినిమా విడుదలను ఆపుతూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో రమ్య రఘుపతి పిటిషన్ దాఖలు చేశారు.
మళ్లీ పెళ్లి చిత్రంలో తనను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని రమ్య రఘుపతి ఆరోపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం మైసూరులో ఓ హోటల్ గదిలో నరేష్, పవిత్ర ఉన్న సమయంలో మీడియాతో కలిసి రమ్య రఘుపతి హడావుడి చేసిన తరహా దృశ్యాలను యథాతథంగా చిత్రీకరించడంతో పాటు తనను కించపరిచేలా సినిమాలో వ్యాఖ్యలు చేశారని రమ్య పిటిషన్‌లో ఆరోపించారు.
సినిమాట్రైలర్‌లో నిజ జీవితంలో జరిగిన సంఘటనలను చిత్రీకరించారని తనను అవమానించేందుకే వాటిని చిత్రీకరించారని ఆమె ఆరోపిస్తున్నారు. నరేష్‌తో వివాహం విషయంలో మూడోపెళ్లి అని తెలిసినా తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇటీవల బెంగుళూరులో రమ్య రఘుపతి ఆరోపించారు.
నరేష్ సినిమా పేరుతో తనను వేధిస్తున్నారని రమ్య రఘుపతి ఆరోపిస్తున్నారు. సినిమా ట్రైలర్‌లో “ఒళ్లంతా రోగాలతో ఉన్న నిన్ను” అని కించపరిచారని ఆరోపించారు. సినిమా ట్రైలర్‌లోనే తనను కించపరిచే దృశ్యాలు ఉండటంతో సినిమా విడుదల చేస్తే తన గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సెన్సార్ పూర్తి చేసుకుని శుక్రవారం విడుదలకు సిద్ధం కావడంతో, సినిమా విడుదలైతే తనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, తన వాదనకు పూర్తి భిన్నంగా, వాస్తవాలను వక్రీకరించేలా చిత్ర నిర్మాణం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సినిమా విడుదల కాకుండా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
నరేష్, రమ్య రఘుపతి మధ్య దాదాపు రెండున్నరేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ పవిత్రతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు. పలుమార్లు వారిపై దాడికి కూడా ప్రయత్నించారు. మైసూరు, బెంగుళూరు ప్రాంతాల్లో నరేష్ ఉన్న హోటళ్లపై రమ్య రఘుపతి దాడి చేసేందుకు ప్రయత్నించి వార్తల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో మళ్లీపెళ్లి పేరుతో నరేష్ ఏకంగా సినిమా చిత్రించి విడుదలకు రెడీ అయ్యారు. ఈ సినిమాలో రమ్య రఘుపతి పాత్రను వనిత పోషించారు. రమ్య పాత్రపై నెగిటివ్ షేడ్స్ ఉండేలా ట్రైలర్ సన్నివేశాలు ఉండటంతో ఆమె కోర్టును ఆశ్రయించారు.