Anirudh Ravichander : అనిరుధ్ కోసం క్యూ కట్టిన టాలీవుడ్ ఫీల్మ్ మేకర్స్.. భారీగా ఆఫర్
Anirudh Ravichander : మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. పెద్ద స్టార్ సినిమా అంటే.. అనిరుధ్ డేట్స్ కోసం ట్రై చేస్తారు. ఇప్పుడు అతడి క్రేజ్ తెలుగులోనూ బాగా పెరిగింది.
తమిళంలో పెద్ద స్టార్ సినిమా వస్తుందంటే చాలు.. అనిరుధ్ మ్యూజిక్(Anirudh Music) ఉండాల్సిందే. ఈ యువ సంగీత దర్శకుడు ఇచ్చే మ్యూజిక్ తో ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశాడు అనిరుధ్. అతడి మ్యూజిక్ ఉందని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం సినిమాకు వెళ్లేవారూ ఉన్నారు. కొన్ని రోజులుగా ఇతర ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్ కన్ను అనిరుధ్ పై పడింది. దీంతో ఎంత డబ్బు ఇచ్చైనా.. తీసుకోవాలనుకుంటున్నారు. తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది.
యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander)తో సినిమా చేసేందుకు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్(Tollywood Film Makers) ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్‌లో కష్టపడి విజయం సాధించిన వ్యక్తి అనిరుధ్. 2012లో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 3 సినిమాతో సంగీతకారుడిగా అరంగేట్రం చేశాడు. ధనుష్‌తో కలిసి ఆయన చేసిన కొలవెరి డి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఇండియాలో చాలా ప్రదేశాల్లో ఈ పాటను పాడుకుంటూ ఉంటారు.
32 ఏళ్ల అనిరుధ్.. పాటలను కంపోజ్ చేయడం, రాయడం, పాటలు పాడడం చేస్తుంటాడు. కోలీవుడ్‌లో వరుసగా విజయవంతమైన చిత్రాలను అందిస్తూనే ఉన్నాడు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ స్టార్ల భారీ బడ్జెట్ చిత్రాలను బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ గా ఎలివేట్ చేసిందనే చెప్పాలి. కమల్ హాసన్ విక్రమ్(Vikram), రజనీకాంత్ జైలర్(Jailer), ధనుష్‌తో సినిమాలే ఇందుకు ఉదాహరణ.
అనిరుధ్ 2017లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan), కీర్తి సురేష్ నటించిన 'అజ్ఞాతవాసి'తో నేరుగా తెలుగులోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మళ్లీ 2019లో నాని నటించిన జెర్సీ(Jersey)కి కంపోజ్ చేశాడు. అంతేకాదు.. డీజే టిల్లులో రాజా రాజా ఐటమ్ రాజా అనే పాట కూడా పాడాడు. అనిరుధ్ ఉంటే.. సినిమాకు మంచి హైప్ వస్తుంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ అతడి వైపు చూస్తుంది.
నిజానికి టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్.. మేకింగ్ విషయంలో అస్సలు రాజీ పడరు. చిత్రనిర్మాతలకు తమ సినిమా నిర్మాణంపై చాలా ప్రేమ ఉంటుంది. ఎంత డబ్బు పెట్టేందుకైనా వెనకడుకు వేయరు. మంచి సాంకేతిక నిపుణులను, నటీనటులను తీసుకురావడానికి చూస్తారు. అనిరుద్‌కి ఉన్న క్రేజ్, రికార్డు కారణంగా టాలీవుడ్ నిర్మాతలు అతని కోసం చూస్తున్నారట. అతడికి దాదాపు రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆఫర్ చేస్తున్నారని టాక్. ఇది ఎఆర్ రెహమాన్(AR Rehaman) రెమ్యునరేషన్ రూ. 8 కోట్లు కంటే ఎక్కువ. అయితే ఇప్పటికే తనకున్న కమిట్‌మెంట్‌ల కారణంగా అనిరుధ్.. టాలీవుడ్ నుండి ఎక్కువ చిత్రాలను పొందలేకపోతున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతాన్ని అందిస్తున్నాడు.