Vijay Deverakonda: “నాకు నేనే శిక్ష వేసుకుంటున్నా”: ఖుషి ఈవెంట్‍లో విజయ్ దేవరకొండ.. లైగర్ వైఫల్యంతో తీరు మార్చుకున్నాడా!
Vijay Deverakonda: ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Vijay Deverakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‍లో మంచి క్రేజ్ ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యాడు. తన ఆటిట్యూడ్‍తో దేశమంతా ఫేమస్ అయ్యాడు. అయితే, గతేడాది భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‍లో వచ్చిన లైగర్ మూవీ ఫ్లాఫ్ అయింది. అయితే, లైగర్ ప్రమోషన్లలో విజయ్ వ్యవహరించిన తీరుపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. కొన్ని కామెంట్లు కొందరికి ఓవర్‌గా అనిపించాయి. ఇక లైగర్ మూవీ ఫ్లాఫ్ అవటంతో విజయ్ దేవరకొండపై సెటైర్లు గట్టిగా పడ్డాయి. అయితే, లైగర్ పరాజయంతో విజయ్ దేవరకొండ తన తీరును పూర్తిగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. నేడు (ఆగస్టు 9) హైదరాబాద్ వేదికగా ఖుషి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు చాలా కూల్‍గా, హుందాగా సమాధానాలు ఇచ్చాడు విజయ్. అలాగే, తనకు తాను వేసుకున్న శిక్ష గురించి చెప్పాడు.
ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వివిధ భాషలకు చెందిన రిపోర్టర్లు విజయ్ దేవరకొండను ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే లైగర్ పరాజయం గురించి అతడికి క్వశ్చన్ ఎదురైంది. దీనికి కూడా విజయ్ చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. “సినిమా సరిగా ఆడనప్పుడు నిరాశ చెందుతాం. అది బాధిస్తుంది. అయితే, నేను గతంలోనూ ఫ్లాఫ్‍లను చూశా. లైగర్ మొదటిది కాదు. నేను చాలా హిట్‍లను కూడా సాధించా. నేను హిట్‍లను, ప్లాఫ్‍లను కూడా అనుభూతి చెందడం కొనసాగిస్తా. మేం ముఖ్యంగా కథలను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏదైనా క్రియేటివ్‍గా చేయాలనేదే నా లక్ష్యం. నేను వైఫల్యాలకు భయపడను” అని విజయ్ దేవరకొండ చెప్పాడు.
లైగర్ సినిమాను (ఫైనల్ వెర్షన్) తాను ముందుగా చూడకుండానే ప్రమోషన్లు చేశాననేలా విజయ్ దేవరకొండ అన్నాడు. తాను ఏదైనా చెబితే జరుగుతుందని అనుకున్నానని, అందుకే హిట్ అని చెప్పానని.. కానీ కాలేదని అన్నాడు. అందుకే కాస్త నిరాశ చెందానని చెప్పాడు. అందుకే తర్వాతి మూడు సినిమాలకు తక్కువగా మాట్లాడాలని అనుకున్నట్టు విజయ్ దేవరకొండ చెప్పాడు. “తర్వాతి మూడు సినిమాల కోసం ఓ నిర్ణయం తీసుకున్నా. సినిమా హిట్ అని ఫీలయ్యాకే బ్లాక్‍బాస్టర్ అని అంటా. తర్వాతి మూడు సినిమాలకు నేను నా నోటిని మూసుకోవాలని అనుకుంటున్నా. నా పనే మాట్లాడాలని అనుకుంటున్నా. ఇది నాకు నేనే విధించుకున్న శిక్ష. ఎందుకంటే నాపై నాకే చిరాకు వేసింది. అందుకే నా తదుపరి మూడు చిత్రాలకు ఈ శిక్ష వేసుకున్నా. నోరు మూసుకొని ఉంటా” అని విజయ్ దేవరకొండ అన్నాడు. మొత్తంగా తర్వాతి మూడు చిత్రాల కోసం అతిగా మాట్లాడనని విజయ్ స్పష్టం చేశాడు.
మొత్తంగా ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చాలా ప్రశాంతంగా మాట్లాడాడు. వివాదాస్పద ప్రశ్నలకు కూడా నవ్వుతూ, ఓపికగా ఆన్సర్స్ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. లవ్, గొడవలు, ఎమోషన్లతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానుంది.
సంబంధిత కథనం