The Family Man season 3: ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చేస్తోంది.. గుడ్‌న్యూస్ చెప్పిన మనోజ్ బాజ్‌పాయీ
The Family Man season 3: అమెజాన్ ప్రైమ్ వీడియో సూపర్ హిట్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పాడు మనోజ్ బాజ్‌పేయీ. కొత్త సీజన్ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చాడు.
The Family Man season 3: ప్రైమ్ వీడియోలోనే కాదు బెస్ట్ ఇండియన్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలుస్తుంది ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి లీడ్ రోల్స్ నటించిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఇదే ప్రశ్న మనోజ్ ను అడుగుతుండగా.. మొత్తానికి అతడు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు.
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ ను మరో 20 రోజుల్లో ప్రారంభించబోతున్నట్లు మనోజ్ బాజ్‌పాయీ వెల్లడించాడు. ఈ సిరీస్ కొత్త సీజన్ ఇంత ఆలస్యం కావడం వెనుక కారణాన్ని కూడా అతడు చెప్పాడు. తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కించారు. కొత్త సీజన్ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఈ సందర్భంగా మనోజ్ తెలిపాడు.
ఈ సిరీస్ కు మంచి ఆదరణ లభించడంతో కొత్త సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయని, అలాంటప్పుడు బలమైన స్క్రిప్ట్ ఉన్నప్పుడే ముందడుగు వేయాలని అన్నాడు. "మళ్లీ మనం అదే పని చేస్తున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి. మరోసారి కొత్తగా మొదలవుతుంది. అందుకే దానిని తేలిగ్గా తీసుకోవద్దు. కొత్త ప్రక్రియను ప్రారంభించాలి. ఆ ప్రిపరేషన్ లో భాగం కావాలి.
నా ప్రిపరేషన్ మెరుగ్గా ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ షో ఇప్పుడు ఓ కల్ట్ సిరీస్ గా మారింది. అభిమానులు మరింత కోరుకుంటున్నారు. రెస్పాన్స్ బాగున్నప్పుడు ఆడియెన్స్ ఆలోచనలకు అనుగుణంగా వెళ్లాలి. కొత్త సీజన్ కోసం గొప్ప స్క్రిప్ట్ గురించి ఆలోచించాలి. మంచి స్క్రిప్ట్ లేకుండా కొత్త సీజన్ మొదలు పెట్టకూడదు. ఏదో వేగంగా ముగించేయకూడదు. మంచి స్క్రిప్ట్ రాసుకొని మళ్లీ మళ్లీ సరి చూసుకొని పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే ముందడుగు వేయాలి" అని మనోజ్ అన్నాడు.
ది ఫ్యామిలీ మ్యాన్ సూపర్ హిట్
ప్రైమ్ వీడియోలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయీ, ప్రియమణి నటించారు. తొలి సీజన్ లో కశ్మీర్ ఉగ్రవాదం, ఢిల్లీలో వాళ్లు చేయబోయే ఓ మారణహోమాన్ని ఓ ఫ్యామిలీ మ్యాన్ ఎలా అడ్డుకున్నాడన్నది చూపించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
ఇక రెండో సీజన్లో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసారి అదే ఫ్యామిలీ మ్యాన్ ఎల్టీటీఈ ఉగ్రవాదాన్ని సవాలు చేస్తాడు. ఈ సీజన్ లో సమంత ఓ ఎల్టీటీఈ ఉగ్రవాదిగా నటించింది. రెండో సీజన్ కూడా వచ్చి చాలా రోజులే అవుతోంది. అయితే ఆ తర్వాత రాజ్ అండ్ డీకే ఫర్జీ, సిటడెల్ లాంటి వెబ్ సిరీస్ లతో బిజీ అయ్యారు. ఈ ఏడాది చివరిలోగా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ప్రైమ్ వీడియోలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.