Chiranjeevi Family Man: ఫ్యామిలీ మ్యాన్ క‌థ‌ను వ‌దులుకున్న చిరంజీవి - రివీల్ చేసిన అశ్వినీద‌త్‌-chiranjeevi rejected family man script producer ashwini dutt comments viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Family Man: ఫ్యామిలీ మ్యాన్ క‌థ‌ను వ‌దులుకున్న చిరంజీవి - రివీల్ చేసిన అశ్వినీద‌త్‌

Chiranjeevi Family Man: ఫ్యామిలీ మ్యాన్ క‌థ‌ను వ‌దులుకున్న చిరంజీవి - రివీల్ చేసిన అశ్వినీద‌త్‌

HT Telugu Desk HT Telugu
Aug 30, 2023 01:16 PM IST

Chiranjeevi Family Man: రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్ ఓటీటీలో పెద్ద హిట్ట‌య్యింది. తొలుత ఈ ఫ్యామిలీ మ్యాన్ క‌థ‌తో చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయాల‌ని డైరెక్ట‌ర్స్ రాజ్ డీకే భావించార‌ట‌. కానీ చిరంజీవి ఈ క‌థ‌ను తిర‌స్క‌రించిన‌ట్లు నిర్మాత అశ్వినీద‌త్ వెల్ల‌డించాడు.

చిరంజీవి
చిరంజీవి

Chiranjeevi Family Man: రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్ ఓటీటీ ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకున్న‌ది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ వ‌న్‌తో పాటు సీజ‌న్ 2 పెద్ద హిట్ట‌య్యాయి. అత్య‌ధిక మంది వీక్షించిన ఇండియ‌న్ వెబ్‌సిరీస్‌లుగా నిలిచాయి. తొలుత ఫ్యామిలీ మ్యాన్ క‌థ‌ను సిరీస్‌గా కాకుండా సినిమాగా చేయాల‌ని ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ డీకే భావించారాట.

చిరంజీవి హీరోగా వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని తెర‌కెక్కించాల‌ని డైరెక్ట‌ర్స్ రాజ్ డీకే ప్లాన్ చేశార‌ట‌. ఈ విష‌యాన్ని వైజ‌యంతీ మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ ఇటీవ‌ల ఇచ్చిన‌ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

ఫ్యామిలీ మ్యాన్ క‌థ‌కు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను మొద‌లుపెట్ట‌డంతో పాటు హీరో కొడుకు పాత్ర తాలూకు ఆడిష‌న్స్ పూర్తిచేసిన‌ట్లు అశ్వినీద‌త్ వెల్ల‌డించాడు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల చిరంజీవి ఈసినిమా చేయ‌డానికి తిర‌స్క‌రించ‌డంతో ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌లేద‌ని అశ్వినీద‌త్ అన్నాడు. చిరంజీవి కోసం రాసుకున్న ఫ్యామిలీ మ్యాన్ క‌థ‌ను ఆయన తిరస్కరించడంతో రాజ్ డీకే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.

ఫ్యామిలీ మ్యాన్ కథను ఉద్ధేశించి అశ్వినీదత్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. చిరంజీవి మంచి క‌థ‌ను మిస్ చేసుక‌న్నాడ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ క‌థ‌తో చిరంజీవి సినిమా చేసుంటే త‌ప్ప‌కుండా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ద‌క్కి ఉండేద‌ని అంటున్నారు.

ఇటీవ‌లే భోళా శంక‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు చిరంజీవి. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాచెల్లెళ్ల అనుబంధం నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

దాదాపు 70 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 20 కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో త‌దుప‌రి సినిమాను చేయ‌బోతున్నాడు చిరంజీవి. సోషియో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అలాగే క‌ళ్యాణ్ కృష్ణ‌, అనిల్ రావిపూడిల‌తో చిరంజీవి సినిమాలు క‌మిట్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.