Srimathi Review: శ్రీమతి రివ్యూ - యూట్యూబ్‌లో రిలీజైన తెలుగు మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఉందంటే?
Srimathi Review: జాన్వీ రాయల, రూప రాయప్ప ప్రధాన పాత్రల్లో సందేశాత్మక కథాంశంతో తెరకెక్కిన శ్రీమతి మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ సినిమాకు శశిధర్ దర్శకత్వం వహించాడు.
Srimathi Review: జాన్వీ రాయల, రూప రాయప్ప ప్రధాన పాత్రల్లో నటించిన శ్రీమతి మూవీ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మెసేజ్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన రూపొందిన ఈ మూవీకి శశిధర్ దర్శకత్వం వహించాడు. ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?
జ్యోతి కష్టాలు…
జ్యోతికి (జాన్వీ రాయల) పెళ్లై ఎనిమిదేళ్లు అయినా పిల్లలు పుట్టరు. జ్యోతిలోనే లోపం ఉందని భర్తతో పాటు అత్త సూటిపోటి మాటలతో ఆమెను వేధిస్తుంటారు. జ్యోతికి ఉన్న సమస్యను దాచి ఆమె తల్లిదండ్రులు తనకు ఇచ్చి పెళ్లిచేశారని భార్య పుట్టింటివారిపై జ్యోతి భర్త ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఆమెకు విడాకులు ఇవ్వాలనే ఆలోచనతో ఉంటాడు. జ్యోతికి వెతుక్కుంటూ ఆమె ఇంటికి చిన్ననాటి స్నేహితురాలు సవిత (రూప) వస్తుంది.
కలివిడిగా మాట్లాడుతూ తన కష్టాలు చెప్పుకుంటూ జ్యోతికి దగ్గరవుతుంది. తాను, తన భర్త వ్యవసాయం చేస్తున్నామని, అందులో నష్టాలు రావడంతో బంగారం తాకట్టుపెట్టామని జ్యోతిని నమ్మిస్తుంది. ఆ బంగారు నగలను విడిపించి ఇవ్వడానికి ఐదు లక్షలు డబ్బు కావాలని, వారంలో ఆ డబ్బు తిరిగి ఇస్తానని జ్యోతిని ప్రాదేయపడుతుంది సవిత. సవిత మాటలు నమ్మిన జ్యోతి తన పుట్టింటివారు ఇచ్చిన బంగారం మొత్తం తాకట్టు పెట్టి సవిత నగలు విడిపిస్తుంది.
నగలు తీసుకున్న కొద్ది సేపటికే సవిత ఫోన్ స్విఛాఫ్ అవుతుంది. ఎంతో కష్టపడి, సవతి అద్దెకు ఉంటున్న ఇళ్లుతో పాటు ఊరి ఆచూకీ తెలుసుకొని అక్కడికి వెళుతుంది జ్యోతి. కానీ అక్కడ కూడా సవిత కనిపించదు. సవిత ఫోన్ ఎందుకు స్విఛాఫ్ చేసుకుంది. స్నేహితురాలి మోసం భర్తకు తెలియకుండా జ్యోతి ఏం చేసింది? కూతురి కాపురాన్ని నిలబెట్టడానికి జ్యోతి తండ్రి ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? తాను తల్లి కావాలన్న జ్యోతి కల ఎలా చెదిరిపోయింది? చివరకు జ్యోతి జీవితం ఏమైంది? అన్నదే శ్రీమతి మూవీ కథ.
వాస్తవ ఘటనలతో...
సోసైటీలో కామన్‌గా కనిపించే సమస్యలనే కథా వస్తువుగా చేసుకుంటూ వాస్తవ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు శశిధర్ శ్రీమతి మూవీని తెరకెక్కించారు. ఓ మధ్య తరగతి గృహిణి కష్టాలు, కన్నీళ్లతో భావోద్వేగభరితంగా ఈ మూవీ సాగుతుంది. సమాజంలో చాలా మంది ఆప్తులు, సన్నిహితుల చేతుల్లోనే ఆర్థికంగా మోసాలకు గురవుతున్నారని, ఎదుటివారిలోని బలహీనతల్ని, మంచితనాన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఎలాంటి కుట్రలు చేస్తారన్నది జ్యోతి, సవిత పాత్రల ద్వారా ఆలోచనాత్మకంగా చూపించారు.
మంచి మెసేజ్...
సాటివారికి సాయపడాలనే ఆలోచనలో కొన్నిసార్లు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఎలాంటి అనార్థాలను తెచ్చిపెడాయన్నదే సందేశాన్ని సినిమాలో ప్రజెంట్ చేసిన తీరు మెప్పిస్తుంది.
సంతాన లేమి విషయంలో సొసైటీ, కుటుంబ పరంగా మహిళలకు ఎదురయ్యే అవమానాలు, సంఘర్షణను అర్థవంతంగా శ్రీమతి మూవీలో ఆవిష్కరించారు. భార్యభర్తల బంధంలో తప్పొప్పుల విషయంలో పూర్తిగా ఒకరినే బాధ్యులను చేయడం సరికాదనే మెసేజ్‌ను ఇచ్చారు.
పాయింట్ బాగుంది...
శ్రీమతి మూవీ కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. సినిమాలా కాకుండా నిజంగానే గృహిణి జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు. ఆర్టిఫీషియల్ సీన్స్, పాటలు, కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించవు.
క్లైమాక్స్ కన్ఫ్యూజింగ్...
బడ్జెట్ పరంగా రాజీ పడటంతో షార్ట్ ఫిలిమ్ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా కన్వీన్సింగ్‌లేదు. ఎలా ఎండ్ చేయాలో అర్థంకానీ కన్ఫ్యూజ్‌లో ముగించినట్లు అనిపిస్తుంది.
జ్యోతి పాత్రకు ప్రాణం...
జ్యోతి పాత్రకు తన సహజ నటనతో ప్రాణం పోసింది జాన్వీ రాయల. సగటు గృహిణి జీవితాన్ని కళ్ల ముందు నిలిపింది. నెగెటివ్ క్యారెక్టర్‌లో రూప రాయప్ప నటన బాగుంది. సినిమా ఎక్కువగా వీరిద్దరి క్యారెక్టర్స్ నేపథ్యంలోనే సాగుతుంది.
ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా...
శ్రీమతి మూవీ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలిసిన నటీనటులు ఎవరూ లేకపోయినా సినిమా కథ మాత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. నిడివి కూడా గంటల నలభై రెండు నిమిషాలే.