Silk Smitha Biopic: సిల్క్ స్మిత జీవితం ఇప్పటికీ ఓ మిస్టరీనే.. ఆ సినిమాతోనైనా సీక్రెట్స్ తెలుస్తాయా!-silk smitha biopic she was rebel and no one explored her personal character says director jayaram shankar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Silk Smitha Biopic: సిల్క్ స్మిత జీవితం ఇప్పటికీ ఓ మిస్టరీనే.. ఆ సినిమాతోనైనా సీక్రెట్స్ తెలుస్తాయా!

Silk Smitha Biopic: సిల్క్ స్మిత జీవితం ఇప్పటికీ ఓ మిస్టరీనే.. ఆ సినిమాతోనైనా సీక్రెట్స్ తెలుస్తాయా!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 15, 2024 05:41 PM IST

Silk Smitha Biopic: అలనాటి అందాల తార దివంగత సిల్క్ స్మిత జీవితంపై మరో బయోపిక్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆమె వ్యక్తిత్వం సహా చాలా విషయాలను చూపిస్తామని దర్శకుడు జయరాం శంకర్ అన్నారు. సిల్క్ స్మిత ఓ ఫైటర్ అని చెప్పారు. మరిన్ని ఆసక్తికర విషయాలు ఇవే.

Silk Smitha Biopic: సిల్క్ స్మిత జీవితం ఇప్పటికీ ఓ మిస్టరీనే
Silk Smitha Biopic: సిల్క్ స్మిత జీవితం ఇప్పటికీ ఓ మిస్టరీనే

Silk Smitha Biopic: సిల్క్ స్మిత.. ఈ పేరు 1980, 1990 దశకాల్లో భారత సినీ పరిశ్రమలో మార్మోగింది. సినిమాల్లో స్పెషల్ పాటలకు కేరాఫ్‍గా సిల్క్ వెలుగొందారు. గ్రేట్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కువ సినిమాల్లో ఆమెకు శృంగార ప్రాధాన్యమున్న పాటలు, క్యారెక్టర్లే దక్కాయి. దీంతో ఆమెను శృంగార తారనే చూసేవారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాలను సిల్క్ చేశారు. అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. సిల్క్ స్మిత జీవితం కూడా ఓ మిస్టరీనే. 1996 సెప్టెంబర్ 23న ఆమె హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఇప్పుడు సిల్క్ స్మిత జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కుతోంది. ‘సిల్క్ స్మిత - ది అన్‍ టోల్డ్ స్టోరీ’ పేరుతో రూపొందనున్న ఈ మూవీకి జయరాం శంకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, సిల్క్ స్మిత గురించి ఇంతకు ముందెప్పుడూ ఎవరూ చూపించని విషయాలను.. తాను ఈ చిత్రంలో చూపిస్తానని ఆయన చెప్పారు.

జయరాం తెరకెక్కిస్తున్న సిల్క్ స్మిత బయోపిక్‍లో ఆమె పాత్రలో చంద్రిక రవి నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. అయితే, తాను సిల్క్ స్మిత జీవితం గురించి ఎందుకు సినిమా తీయాలనుకుంటున్న విషయాలను దర్శకుడు జయరాం శంకర్ వెల్లడించారు. సిల్క్ స్మిత అనగానే అందరూ నెగెటివ్‍గా అనుకుంటారని, కానీ అది నిజం కాదని ఆయన చెప్పారు. ఆమె వ్యక్తిత్వాన్ని ఇప్పటి వరకూ పూర్తిగా చూపించలేదని ఆయన అన్నారు.

“ఆమె గురించి ఈ స్టోరీ తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. పురుషాధిక్యత ఉన్న సినీ ఇండస్ట్రీలో, సమాజంలో సిల్క్ స్మిత ఓ రెబల్, ఓ పోరాట యోధురాలు. అక్కడ కఠినమైన ఆర్థిక, లైంగిక రాజకీయాలు ఉన్నాయి. కానీ వేరే వారి వల్ల ఆమె ఆ భారాన్ని మోశారు. అన్నీ భరించారు. అవన్నీ నేటి కాలంలో ప్రజలకు అర్థమయ్యేలా చూపిస్తాం. అందుకు సంబంధించిన అంశాల ఇందులో ఉంటాయి. సిల్క్ స్మిత పేరు అంటేనే చాలా మంది నెగెటివ్‍గా భావిస్తారు. అయితే, ఆమె జీవితంలో అది నిజం కాదు. ఆమె వ్యక్తిత్వాన్ని ఎవరూ సరిగా చూపించలేదు. ఆమె మానసిక ఆరోగ్యాన్ని, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు” అని జయరాం శంకర్ అన్నారు.

ఆమె జీవితం చాలా మిస్టరీ

సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితం ఎప్పటికీ ఓ పెద్ద మిస్టరీగానే ఉంది. చాలా విషయాలు బయటికి తెలియదు. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. 2011లో సిల్క్ స్మిత జీవితంపై విద్యాబాలన్ ప్రధాన పాత్రలో మిలాన్ లుథ్రియా దర్శకత్వంలో ది డర్టీ పిక్చర్ సినిమా వచ్చింది. ఓ వెబ్ సిరీస్ కూడా తీసుకొస్తామని కొన్నేళ్ల క్రితం పా రంజిత్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు శంకరన్.. సిల్క్ స్మితపై బయోపిక్ చేస్తున్నారు.

అప్పట్లో సినీ ఇండస్ట్రీని సిల్క్ స్మిత ఆశ్చర్యంలో ముంచెత్తారని సినీ ట్రేడ్ ఎనలిస్ట్ శ్రీధర్ పిళ్లై చెప్పారు. “ఆంధ్రప్రదేశ్‍లోని ఏలూరు అనే ప్రాంతం నుంచి వచ్చిన స్మిల్క్ స్మిత.. తన డ్యాన్స్‌తో కల్ట్ స్టేటస్ తెచ్చుకున్నారు. హిందీ చిత్రాల్లో అప్పట్లో హెలెన్ ఉండేవారు. దక్షిణాదిన ఆమెకు సమానంగా సిల్క్ ఎదిగారు. ప్రతీ సినిమాలో ఆమె డ్యాన్స్ ఉండే పాట కచ్చితంగా ఉండాలన్న పరిస్థితి ఉండేది. అంతకు ముందు ఎవరూ చేయలేని విధంగా ఆమె ప్రేక్షకుల ఊహల్లోకి వెళ్లారు. సినిమాల్లో హీరోయిన్లు ఉండేవారు. కానీ వ్యాంప్ విషయానికి వస్తే సిల్క్ స్మితనే అప్పట్లో సూపర్. ప్రస్తుతం అలాంటి టెంప్లేట్స్ ఏమీ లేవు. నటీమణులు విభిన్న క్యారెక్టర్లు చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం చాలా మిస్టరీగా ఉంది. దానికి ప్రజలు ఆకర్షితులవుతారని నేను అనుకుంటున్నా” అని శ్రీధర్ చెప్పారు.

సౌతిండియా మారిలిన్ మోన్రాయ్ అని కూడా సిల్క్ స్మితను అనే వారు. చిత్రాలకు ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఆమె అందం చాలా ప్లస్ అయ్యేది. మలయాళంలో సాఫ్ట్ పోర్న్ మూవీలను కూడా సిల్క్ చేశారు. చాలా బోల్డ్ క్యారెక్టర్లు చేశారు. మొదట్లో ఆమె ఆర్థికపరమైన, సామాజిక కారణాల వల్ల ఆమె నటనలోకి వచ్చారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సినిమా ఇండస్ట్రీలో ఓ మహిళ సుదీర్ఘ కాలం కొనసాగాలంటే చాలా కష్టమైన విషయం. కానీ సిల్క్ స్మిత ఆ విషయంలో విజయం సాధించారు. సినీ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం, మారుమూల గ్రామం నుంచి వచ్చి కల్ట్ స్టేటస్ సంపాదించారు.

ఆమెను ఎవరూ అర్థం చేసుకోలేదు

తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడుదొడుకులు ఉన్నా.. వాటన్నింటికి ఎదురీదుతూ ఫేమ్, సక్సెస్ సాధించారు సిల్క్ స్మిత. “సిల్క్ స్మిత ఎప్పుడూ ఓ మిస్టరీ వ్యక్తిలానే ఉండేవారు. ఆమెను నిజంగా ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆమె వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉండేది. ఆమె అందంగా ఉండడం మాత్రమే కాదు.. కళ్లు కూడా చాలా పవర్ ఫుల్. మూన్రమ్ రిపై చిత్రంలో డైరెక్టర్ బాలు మహేంద్ర ఆమెను అద్భుతంగా చూపించారు. ఆమెకు చాలా పేరు వచ్చింది. ఆమెకు డ్రీమ్ గర్ల్ లుక్ ఉంది. జయమాలిని, అనురాధ నుంచి డిస్కో శాంతి వరకు ఎవరికీ అంత ఆకర్షణీయమైన కళ్లు లేవు. సిల్క్ స్మితతో నటించాలని ప్రతీ హీరో అనుకునే వారు. ఆమె వ్యక్తిత్వం కూడా అందుకు కారణంగా ఉండేది. ఆమె ఇప్పటికీ ఓ రహస్యంగా మిలిగిపోయేందుకు చాలా అంశాలు ఉన్నాయి” అని తమిళ నిర్మాత ధనంజయన్ వివరించారు.

సిల్క్ స్మిత చాలా సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేశారు. నిడివి తక్కువగానే ఉండేది. అయితే, ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్లపై మాత్రం ఆమె ఫొటోలను చాలా పెద్దగా వేసే వారు నిర్మాతలు. “నిజాయితీగా చెప్పాలంటే.. చాలా మంది రహస్య ఊహలను, కోరికలను ఆమె తీర్చారు. మహిళలను దూరంగా ఉంచుతున్నట్టు కొందరు ప్రవర్తిస్తారు. కానీ ఆమె ఊహలు చాలా మంది మదిలో ఉండేవి. సిల్క్ స్మిత దీన్ని సవాల్ చేశారు. తనను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చేయగలిగారు. ప్రస్తుత హీరోయిన్లకు ఆమె టార్చర్ బేరర్. క్యారెక్టర్ ప్రధానమైన పాత్రలు చేసేందుకు హీరోయిన్లు తమను మార్చుకునేందకు ఆమెనే స్ఫూర్తి” అని శంకరన్ చెప్పారు.

అయితే, సిల్క్ స్మిత గురించిన వ్యక్తిగత విషయాలు, ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విషయాలు తమ చిత్రంలో చూపిస్తానని సిల్క్ స్మిత - ది అన్‍ టోల్డ్ స్టోరీ దర్శకుడు జయరాం శంకరన్ చెప్పారు. ఈ చిత్రంతోనైనా సిల్క్ స్మిత గురించి రహస్యాలు తెలుస్తాయేమో వేచిచూడాలి. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.

Whats_app_banner