Ram Charan: రామ్ చరణ్‌ను అవమానించిన షారుక్ ఖాన్.. సంచలనం రేపుతున్న చరణ్ మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్-shah rukh khan humiliates ram charan alleges his makeup artist saying she walked out of anant ambani pre wedding event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan: రామ్ చరణ్‌ను అవమానించిన షారుక్ ఖాన్.. సంచలనం రేపుతున్న చరణ్ మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్

Ram Charan: రామ్ చరణ్‌ను అవమానించిన షారుక్ ఖాన్.. సంచలనం రేపుతున్న చరణ్ మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్

Hari Prasad S HT Telugu
Mar 05, 2024 07:37 AM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అవమానించాడంటూ అతని మేకప్ ఆర్టిస్ట్ జీబా హసన్ చెప్పడం సంచలనం రేపుతోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్ లో చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ ను షారుక్ ఖాన్ అవమానించాడంటూ మేకప్ ఆర్టిస్ట్ చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది
రామ్ చరణ్ ను షారుక్ ఖాన్ అవమానించాడంటూ మేకప్ ఆర్టిస్ట్ చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది

Ram Charan: రామ్ చరణ్ ను షారుక్ ఖాన్ అవమానించాడని, అందుకే తాను అంబానీల ప్రీవెడ్డింగ్ ఈవెంట్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసినట్లు చరణ్ మేకప్ ఆర్టిస్ట్ చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది. జామ్ నగర్ లో జరిగిన మూడు రోజుల ఈ ఈవెంట్లో ఖాన్ త్రయంతో కలిసి స్టేజ్ పై చరణ్ నాటు నాటు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ఆ ఘటన జరిగినట్లు జీబా హసన్ వెల్లడించింది.

రామ్ చరణ్‌కు అవమానం

ఖాన్ త్రయం స్టేజ్ పై నాటు నాటు స్టెప్పులు వేసిన వీడియో ఎంతగా వైరల్ అయిందో తెలుసు కదా. అయితే అంతకుముందు షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్ త్రయం ఈ స్టెప్పులు వేయడానికి ప్రయత్నించినా వాళ్లు సరిగా చేయలేకపోయారు. దీంతో స్టేజ్ కింద ఉన్న చరణ్ ను రావాల్సిందిగా షారుక్ పిలిచాడు. అయితే ఇక్కడే అతడు నోరు జారినట్లు జీబా హసన్ ఆరోపించింది.

"భేండ్, ఇడ్లీ, వడ రామ్ చరణ్ ఎక్కడున్నావ్ నువ్వు?" అని షారుక్ అన్నాడని, అది విన్న తర్వాత తాను చాలా అవమానంగా భావించి ఆ ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసినట్లు జీబా తెలిపింది. రామ్ చరణ్ లాంటి స్టార్ ను ఇలా అవమానించడం దారుణమని ఆమె విమర్శించింది. అంతేకాదు తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ పెద్ద పోస్టు కూడా చేసింది. సౌత్ ఇండియా స్టార్లంటే నార్త్ వాళ్లకు ఎంత చిన్నచూపో ఆమె ఆ పోస్టులో వివరించే ప్రయత్నం చేసింది.

నార్త్ స్టార్ల పొగరు

చాలా రోజులుగా రామ్ చరణ్ కు జీబా మేకప్ ఆర్టిస్ట్ గా ఉంది. ఆమె సోమవారం (మార్చి 4) తన ఇన్‌స్టా స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ లో అంతమంది సెలబ్రిటీల ముందు రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోకు ఇంతటి అవమానం జరగడంపై జీబా ఆవేదన వ్యక్తం చేసింది. తాను షారుక్ కు పెద్ద అభిమానిని అని, అయితే రామ్ చరణ్ ను అతడు స్టేజ్ పై అవమానించిన తీరు తనకు నచ్చలేదని జీబా స్పష్టం చేసింది.

మొదట రామ్ చరణ్ నువ్వు ఎక్కడ అని అడిగిన షారుక్.. తర్వాత తమిళం, తెలుగులో హేళనగా మాట్లాడుతూ ఇడ్లీ వడ రామ్ చరణ్ ఎక్కడ అంటూ అతడు అనడం ఓ వీడియోలో స్పష్టంగా వినిపించింది. జీబా చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది. చాలా మంది అభిమానులు ఆమె చెప్పింది నిజమే అంటూ చరణ్ కు అండగా నిలిచారు.

షారుక్ మాట్లాడిన తీరుపై అభ్యంతరం చెప్పారు. ఇక నుంచి మనం కూడా షారుక్ ఖాన్ ను ఆలూ పరాటా, గోల్ గప్పా అని పిలవాలంటూ ఓ అభిమాని ఘాటుగా స్పందించాడు. చరణ్ ఓ గ్లోబల్ స్టార్ అని, అలాంటి వ్యక్తిని షారుక్ అవమానించాడని మరో అభిమాని అన్నాడు. కొంతమంది మాత్రం దాన్నో జోక్ లాగా తీసుకోవాలని షారుక్ కు మద్దతుగా నిలిచారు.

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియాలో పెద్ద స్టార్ అయ్యాడు. నార్త్ లోనూ అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే బాలీవుడ్ హీరోలు కామెడీ పేరుతో ఇలా స్టేజ్ లపై ఇతర ఇండస్ట్రీల హీరోలు, అభిమానులు, సహచరులపై సెటైర్లు వేయడం ఇదేమీ కొత్త కాదు. అప్పుడప్పుడూ అది కాస్తా శృతి మించి విమర్శల పాలవుతుంటారు. తాజాగా రామ్ చరణ్ విషయంలో షారుక్ ఖాన్ నోరు జారడం కూడా అలాంటిదే.

WhatsApp channel