Satyam Sundaram OTT Release Date: కార్తీ, అరవింద్ స్వామి బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక్కడ చూసేయండి
Satyam Sundaram OTT Release Date: కార్తీ, అరవింద్ స్వామి నటించిన బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది. తమిళం, తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.
Satyam Sundaram OTT Release Date: ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్ తమిళ మూవీ సత్యం సుందరం (మేయళగన్) రాబోతోంది. థియేటర్లో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. తెలుగులో దేవర మూవీ రిలీజైన రోజే వచ్చినా ఇక్కడి ప్రేక్షకులను కూడా ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ బాగా ఆకట్టుకుంది.
సత్యం సుందరం ఓటీటీ రిలీజ్ డేట్
కార్తీ, అరవింద్ స్వామి నటించిన మేయళగన్ మూవీ తెలుగులో సత్యం సుందరం పేరుతో రిలీజైంది. ఈ మూవీ వచ్చే ఆదివారం (అక్టోబర్ 27) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 96 మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తమిళ, తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకుపైగా వసూలు చేయడంతోపాటు ఐఎండీబీలోనూ 8.4 రేటింగ్ సాధించిందంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 27న తమిళంలో, 28న తెలుగులో థియేటర్లలో రిలీజైన సత్యం సుందరం మూవీకి ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సత్యం సుందరం మూవీ ఎలా ఉందంటే?
సత్యం సుందరంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫైట్లు, ఇమేజ్‌లు, కామెడీ, లవ్ ట్రాక్‌లు ఏవీ ఉండవు. ఇద్దరు వ్యక్తులు కలిసి సాగించిన జర్నీ, వారు పంచుకున్న జ్ఞాపకాల నేపథ్యంలో ఫీల్‌గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ మూవీని తెరకెక్కించాడు. కథగా చెప్పకుంటే రెండు మూడు లైన్లలోనే ముగుస్తుంది. కానీ ఈ పాయింట్‌ను మనసుల్ని కదిలించేలా స్క్రీన్‌పై ఆవిష్కరించారు దర్శకుడు.
జీవితంలో ఒడిదుడుకులు ఎదురవ్వడం సహజం. వాటిని పక్కనపెట్టి మన మంచి కోరుతూ నలుగురు మనుషుల మధ్య ఉండటంలోనే అసలైన ఆనందం ఇమిడి ఉంటుందని ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్. ఎలాంటి సాయం ఆశించకుండా మన మంచికోరుకునేవారు కూడా సొసైటీలో చాలా మంది ఉంటారని ఈ సినిమాలో దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది.
1996-2018 ఇలా రెండు టైమ్ పీరియడ్స్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగుతుంది. సత్యం ఊరు వదిలిపెట్టివెళ్లిపోయే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఊరితో అతడికి ఉన్న ఎటాచ్‌మెంట్, బంధువుల మోసాన్ని గుర్తుచేసుకుంటూ అతడు పడే సంఘర్షణతో కథ ముందుకు సాగుతుంది. పెళ్లికోసం సొంతూరు వెళ్లిన సత్యానికి సుందరం పరిచయం అయ్యే సీన్ నుంచి అసలు కథ మొదలవుతుంది.
కార్తీ, అరవింద్ స్వామి ఇద్దరు పోటీపడి నటించారు. ఎలాంటి కల్మషం లేని అమాయకత్వం, మంచితనం కలబోసిన సుందర పాత్రకు కార్తి ప్రాణం పోశారు. సత్యం పాత్రలో అరవింద్ స్వామి నటన అద్భుతంగా ఉంది. శ్రీదివ్య, దేవదర్శినితో పాటు మిగిలిన వారి నటన బాగుంది. గోవింద్ వసంత మ్యూజిక్ కథలోని ఫీల్‌ను మరింతగా ఎలివేట్ చేసింది.