Satyam Sundaram Review: సత్యం సుందరం రివ్యూ - కార్తి, అరవింద్ స్వామి మూవీ ఎలా ఉందంటే?
Satyam Sundaram Review: కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన సత్యంసుందరం మూవీ శనివారం థియేటర్లలో రిలీజైంది. 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ తమిళ్ డబ్బింగ్ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా లేదా అంటే?
Satyam Sundaram Review: కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ సత్యం సుందరం. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి 96 ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళంలో శుక్రవారం రిలీజైన ఈ మూవీ తెలుగులో ఒక రోజు ఆలస్యంగా శనివారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే?
సత్యం...సుందరం కథ...
సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి) తండ్రి రామలింగం (జయప్రకాష్) హెడ్మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. ఆస్తి గొడవల్లో రామలింగం కుటుంబం మూడు తరాలుగా నివసిస్తున్న ఇళ్లు బంధువుల పరం అవుతుంది.
దాంతో సొంతూరు ఉద్ధండరాయునిపాలెం వదిలేసిన సత్యం...తండ్రితో కలిసి వైజాగ్‌లో సెటిల్ అవుతాడు. ఇరవై ఏళ్లయినా బంధువులు చేసిన మోసం మరచిపోలేకపోతాడు.
వారి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడడు. చాలా ఏళ్ల తర్వాత చిన్నాన్న కూతురు భువన (స్వాతి) పెళ్లికి కోసం సత్యమూర్తి తప్పనిసరి పరిస్థితుల్లో సొంతూరికివస్తాడు.ఆ పెళ్లిలోనే బావ అంటూ బంధుత్వం కలుపుతూ సత్యానికి దగ్గరయ్యేందుకు సుందరం (కార్తి) ప్రయత్నిస్తుంటాడు. సత్యాన్ని వదిలిపెట్టకుండా అతడి వెంటే తిరుగుతుంటాడు.
కానీ సత్యం మాత్రం సుందరాన్ని గుర్తుపట్టడు. అతడి పేరు కూడా మర్చిపోతాడు. ఆ విషయం సుందరానికి తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగా నటిస్తాడు. అనుకోకుండా బస్ మిస్ కావడంతో ఆ రాత్రి సుందరం ఇంట్లోనే సత్యం ఉండాల్సివస్తుంది. మొదట్లో సుందరం చూపించే అతి ప్రేమ కారణంగా ఇబ్బందులు పడ్డ సత్యం ఆ తర్వాత అతడి మంచి మనసును ఎలా తెలుసుకున్నాడు?
సుందరం కారణం తాను చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్ధుకున్నాడు. సుందరం పేరు సత్యానికి ఎప్పుడు తెలిసింది? ఎవరికి చెప్పకుండా సుందరం ఇంట్లో నుంచి సత్యం ఎందుకు పారిపోయాడు? సత్యం చేసిన ఓ మంచి సుందరం జీవితాన్ని ఎలా మార్చింది? అదేమిటి? అన్నదే ఈ మూవీ కథ.
రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా...
సత్యం సుందరంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫైట్లు, ఇమేజ్‌లు, కామెడీ, లవ్ ట్రాక్‌లు ఏవీ ఉండవు. ఇద్దరు వ్యక్తులు కలిసి సాగించిన జర్నీ, వారు పంచుకున్న జ్ఞాపకాల నేపథ్యంలో ఫీల్‌గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ మూవీని తెరకెక్కించాడు.
కథగా చెప్పకుంటే రెండు మూడు లైన్లలోనే ముగుస్తుంది. కానీ ఈ పాయింట్‌ను మనసుల్ని కదిలించేలా స్క్రీన్‌పై ఆవిష్కరించారు దర్శకుడు.
నాచురల్‌గా...
జీవితంలో ఒడిదుడుకులు ఎదురవ్వడం సహజం. వాటిని పక్కనపెట్టి మన మంచి కోరు నలుగురు మనుషుల మధ్య ఉండటంలోనే అసలైన ఆనందం ఇమిడి ఉంటుందని ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్. ఎలాంటి సాయం ఆశించకుండా మన మంచికోరుకునేవారు కూడా సొసైటీలో చాలా మంది ఉంటారని ఈ సినిమాలో దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది.
ఈ పాయింట్‌ను చాలా నాచురల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెసయ్యాడు. సినిమా చూస్తున్నట్లుగా కాకుండా నిజమైన జీవితాల్ని తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కార్తి, అరవింద్ స్వామి పాత్రల్లో ఆడియెన్స్ తమను తాము చూసుకునేలా చూసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యేలా చేశారు.
రెండు టైమ్ పీరియడ్స్‌లో...
1996 -2018 రెండు టైమ్‌పీరియడ్స్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ సాగుతుంది. సత్యం ఊరు వదిలిపెట్టివెళ్లిపోయే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఊరితో అతడికి ఉన్న ఎటాచ్‌మెంట్, బంధువుల మోసాన్ని గుర్తుచేసుకుంటూ అతడు పడే సంఘర్షణతో కథ ముందుకు సాగుతుంది. పెళ్లికోసం సొంతూరు వెళ్లిన సత్యానికి సుందరం పరిచయం అయ్యే సీన్ నుంచి అసలు కథ మొదలవుతుంది.
సిట్యువేషనల్ కామెడీ...
సత్యం వెంటపడుతూ సుందరం చెప్పే కబుర్లు, చేసే అల్లరి నవ్విస్తాయి. సుందరం పేరు తెలుసుకోవడానికి సత్యం పడే తిప్పలు, అతడు ఎవరో తెలియకున్నా తెలిసినట్లుగా నటించడం లాంటి సీన్స్ నుంచి సిట్యువేషనల్ కామెడీని రాబట్టుకున్నాడు.
సుందరం అతి ప్రేమ కారణంగా సత్యం పడే ఇబ్బందులు కామెడీ పంచుతాయి. నవ్విస్తూనే అక్కడక్కడ ఎమెషనల్ సీన్స్‌తో దర్శకుడు కథను ముందుకు నడిపించిన తీరు బాగుంది. సెకండాఫ్‌లోని సైకిల్ ఎపిసోడ్ బాగుంది. చివరకు సుందరం పేరు సత్యం తెలుసుకునే సీన్‌తోనే సినిమాను ఎమోషనల్‌గా ఎండ్‌చేశాడు డైరెక్టర్.సినిమాకు లెంగ్త్ మైనస్‌గా మారింది. కొన్ని చోట్ల ల్యాగ్ అయినా ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ట్ సినిమాలా అనిపిస్తుంది.
కార్తి వర్సెస్ అరవింద్ స్వామి...
కార్తీ, అరవింద్ స్వామి ఇద్దరు పోటీపడి నటించారు. ఎలాంటి కల్మషం లేని అమాయకత్వం, మంచితనం కలబోసిన సుందర పాత్రకు కార్తి ప్రాణం పోశారు. సత్యం పాత్రలో అరవింద్ స్వామి నటన అద్భుతంగా ఉంది. శ్రీదివ్య, దేవదర్శినితో పాటు మిగిలిన వారి నటన బాగుంది. గోవింద్ వసంత మ్యూజిక్ కథలోని ఫీల్‌ను మరింతగా ఎలివేట్ చేసింది.
ఫీల్‌గుడ్ మూవీ...
సత్యం సుందరం ఫీల్‌గుడ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ. బంధాల విలువలను, జీవితంలో తాము మర్చిపోయిన జ్ఞాపకాలు, అనుభూతులను ప్రతి ఒక్కరికి గుర్తుచేస్తుంది.