Salaar vs Dunki Advance Bookings: సలార్, డంకీ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇప్పటి వరకూ పైచేయి ఎవరిదంటే?
Salaar vs Dunki Advance Bookings: సలార్, డంకీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ వార్.. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ప్రారంభమైంది.
Salaar vs Dunki Advance Bookings: సలార్, డంకీ సినిమాల్లో ఎవరిది పైచేయి కాబోతోంది? అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆదివారం (డిసెంబర్ 17) రాత్రి 10 గంటల వరకూ జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకుంటే.. సలార్ కంటే డంకీ బుకింగ్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి. డంకీ హిందీ వెర్షన్ దూసుకెళ్తుండగా.. సలార్ తెలుగు, హిందీల్లో దూకుదు ప్రదర్శిస్తోంది.
షారుక్ ఖాన్ నటించిన డంకీ మూవీ గురువారం (డిసెంబర్ 21), ప్రభాస్ నటించిన సలార్ శుక్రవారం (డిసెంబర్ 22) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. డంకీ కంటే సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయి. ఆదివారం రాత్రి వరకూ చూసుకుంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ డంకీ మూవీకి రూ.4.45 కోట్లు రావడం విశేషం. ఇక సలార్ విషయానికి వస్తే ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ.3.58 కోట్లుగా ఉంది.
సలార్ బుకింగ్స్ ఇవీ..
ఊహించినట్లే తెలుగు రాష్ట్రాల్లో సలార్ దూకుడు మామూలుగా లేదు. ఇప్పటి వరకూ ఏపీ, తెలంగాణల్లో కలిపి మొత్తం 84505 టికెట్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా సలార్ కు రూ.2.23 కోట్లు రావడం విశేషం. ఇక మలయాళంలో 42747 టికెట్లు అమ్ముడవగా.. రూ.63 లక్షలు వచ్చాయి. హిందీలో 18353 టికెట్లు అమ్ముడవడం ద్వారా రూ.61 లక్షలు రావడం విశేషం.
ఇండియా మొత్తం అన్ని భాషల్లో కలిపి 1,53,705 టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా రూ.3.58 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. రిలీజ్ కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటంతో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ మరింత భారీగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం (డిసెంబర్ 18) మరో ట్రైలర్ రిలీజ్ ఉండటంతో దీని తర్వాత బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
డంకీ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే?
ఇక డంకీ విషయానికి వస్తే షారుక్ మూవీకి ఇప్పటి వరకూ 1.44 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా రూ.4.45 కోట్లు వచ్చాయి. డంకీ మూవీ కేవలం హిందీలోనే రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు హైదరాబాద్ లో డిమాండ్ బాగానే ఉంది. ఇప్పటికే కొన్ని వేల టికెట్లు అమ్ముడయ్యాయి. షారుక్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో డంకీపై భారీ అంచనాలు ఉన్నాయి.