Richest Heroine in India: ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే.. రూ.4600 కోట్ల సంపదతో ఎవరికీ అందనంత ఎత్తులో..
Richest Heroine in India: ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె సంపద విలువ ఏకంగా రూ.4600 కోట్లంటే నమ్మగలరా? తాజాగా రిలీజ్ అయిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో బాలీవుడ్ కింగ్ షారుక్ తర్వాతి స్థానం ఈమెదే కావడం విశేషం. విచిత్రం ఏంటంటే 15 ఏళ్లుగా ఆమె పెద్ద హిట్ ఇచ్చిందే లేదు.
Richest Heroine in India: ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అంత సులువేమీ కాదు. ఎందుకంటే ఈ హీరోయిన్ అసలు ఇప్పట్లో సినిమాలే చేయలేదు. ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో ఎవరూ కాదు. తాజాగా గురువారం (ఆగస్ట్ 29) హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రిలీజ్ కాగా.. అందులో ఆమె రూ.4600 కోట్ల సంపదతో నిలిచింది.
రిచెస్ట్ హీరోయిన్ జూహీ చావ్లా
బాలీవుడ్ లో ఒకప్పుడు తన అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ జూహీ చావ్లా. ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ గా ఇప్పుడు హురున్ ఇండియా రిచ్ లిస్టులో చోటు సంపాదించింది. సినిమాల సెలబ్రిటీల నుంచి షారుక్ ఖాన్ తోపాటు చోటు సంపాదించిన ఏకైక నటి ఆమెనే.
ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలాంటి భారత కుబేరులు ఉన్న ఈ జాబితాలో ఓ బాలీవుడ్ హీరోయిన్ ఉండటం విశేషమే. 15 ఏళ్లుగా అసలు పెద్దగా సినిమాలే చేయని ఈ నటికి ఏకంగా రూ.4600 కోట్ల సంపద ఉందంటే నమ్మశక్యం కాదు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో కనీసం రూ.1000 కోట్లకుపైగా సంపద ఉన్న భారతీయులకు చోటు దక్కుతుంది. ఈసారి ఈ జాబితాలో కొత్తగా 220 మంది చేరగా.. మొత్తం 1539 మంది ఇందులో ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఏకంగా రూ.7300 కోట్ల సంపదతో ఇండియాలో అత్యధిక ధనవంతుడైన సినిమా సెలబ్రిటీగా నిలిచాడు.
అయితే అతని తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి ఉన్న పేరు జూహీ చావ్లాదే. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈ ఇద్దరు కలిసి మంచి హిట్ మూవీస్ అందించారు. ఇప్పుడు రిచ్ లిస్ట్ లో జూహీ చావ్లా రూ.4600 కోట్ల సంపదతో ఇండియాలోనే అత్యంత ధనికవంతమైన నటిగా పేరు సంపాదించింది.
జూహీకి ఇంత సంపద ఎలా?
1990ల్లో హిందీ సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరు జూహీ చావ్లా. ఆమిర్ ఖాన్ తో కలిసి ఖయామత్ సే ఖయామత్ తక్ మూవీ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పదేళ్లకుపైగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 2000 తర్వాత సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టింది. మొదట డ్రీమ్స్ అన్‌లిమిటెడ్ అని, ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పేరుతో షారుక్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది.
2009లో లక్ బై ఛాన్స్ తర్వాత జూహీ నటించలేదు. సినిమా నిర్మాణంతోపాటు కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీలోనూ ఆమెకు వాటా ఉంది. వీటి ద్వారానే జూహీ భారీగా సంపాదించింది. ఆమె తర్వాత రూ.900 కోట్లతో ఐశ్వర్య రాయ్, రూ.850 కోట్లతో ప్రియాంకా చోప్రా, రూ.550 కోట్లతో ఆలియా భట్, రూ.400 కోట్లతో దీపికా పదుకోన్, రూ.240 కోట్లతో కత్రినా కైఫ్ ఉన్నారు.