Shah Rukh Khan: ‘హురున్ ఇండియా’ సంపన్నుల జాబితాలోకి తొలిసారి షారుఖ్ ఖాన్ ఎంట్రీ
Shah Rukh Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ 2024 నాటికి రూ.7,300 కోట్ల నికర సంపదతో హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నుంచే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ లో ఉన్న హోల్డింగ్స్ నుంచి కూడా ఈ నికర విలువను పొందారు.
2024 సంవత్సరంలో భారత్ లోని అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ప్రకటించింది. ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తొలి సారి చోటు దక్కించుకున్నారు. 2024 నాటికి షారుక్ ఖాన్ నికర సంపద రూ.7,300 కోట్లుగా ఉంది. తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నుంచే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ లో ఉన్న పెట్టుబడుల నుంచి కూడా ఈ నికర విలువను పొందారు. కోల్కతా నైట్ రైడర్స్ లో తన హోల్డింగ్స్ విలువ పెరగడంతో షారుక్ ఖాన్ ఈ జాబితాలో స్థానం సంపాదించాడు.
ముకేశ్ ను అధిగమించిన గౌతమ్
2024 సంవత్సర హురున్ రిచ్ లిస్ట్ లో తొలి స్థానాన్ని ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ సంపాదించారు. ఇప్పటివరకు అగ్ర స్థానంలో నిలిచిన రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీని వెనక్కు నెట్టి ఆదానీ ఆ స్థానంలో ప్రవేశించారు. గౌతమ్ ఆదానీ నికర సంపదర 2024 లో రూ.11.6 లక్షల కోట్లుగా ఉంది. ‘‘భారతదేశం ఆసియాలో సంపదను సృష్టించే ఇంజిన్ గా ఎదుగుతోంది. చైనాలో బిలియనీర్ల సంఖ్య 25 శాతం తగ్గగా, భారత్ లో ఆ సంఖ్య 29 శాతం పెరిగింది. ప్రస్తుతం భారత్ లో రికార్డు స్థాయిలో 334 బిలియనీర్లు ఉన్నారు’’ అని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, ప్రధాన పరిశోధకుడు అనాస్ రెహ్మాన్ జునైద్ వెల్లడించారు.
లిస్ట్ లో యంగెస్ట్ మెంబర్స్ జెప్టో ఫౌండర్స్..
2024 హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో అత్యంత పిన్న వయస్కులుగా ఇన్ స్టంట్ గ్రోసరీ డెలివరీ యాప్ జెప్టో (zepto) కు చెందిన కైవల్య వోహ్రా (21), అతని సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచా (22) నిలిచారు. ఈ జాబితాలోని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందినవారు కేవలం ఏడాదిలోనే రూ.40,500 కోట్లు సంపాదించారు.
టాప్ లో అంబానీ కుటుంబం
రూ.25.75 లక్షల కోట్లతో అంబానీ కుటుంబం దేశంలోనే అత్యంత విలువైన కుటుంబ వ్యాపారంగా అవతరించింది. బజాజ్ కుటుంబం రూ.7.13 లక్షల కోట్లతో రెండో స్థానంలో, బిర్లా రూ.5.39 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో అదానీ కుటుంబం విలువ రూ.15.44 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ మొదటి తరం కావడంతో హురున్ ప్రధాన జాబితాలో (hurun rich list) చోటు దక్కలేదు.
బాలీవుడ్ స్టార్స్ సంపద
జుహీ చావ్లా అండ్ ఫ్యామిలీ (రూ.4,600 కోట్లు), హృతిక్ రోషన్ (రూ.2,000 కోట్లు), అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ (రూ.1,600 కోట్లు), కరణ్ జోహార్ (రూ.1,400 కోట్లు)లను షారుక్ ఖాన్ అధిగమించారు. జూహీ చావ్లా, ఆమె కుటుంబం నైట్ రైడర్స్ గ్రూప్ కు చెందిన నైట్ రైడర్స్ స్పోర్ట్స్ కు యజమానులుగా ఉన్నారు. హృతిక్ రోషన్ తన ఫ్యాషన్ బ్రాండ్ హెచ్ఆర్ఎక్స్ నుండి, అమితాబ్ బచ్చన్ తన పెట్టుబడుల నుండి, కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నుండి నికర సంపదను పొందారు.