RGV Interview: నేను రెబల్.. మతాన్ని, నైతిక విలువలను పట్టించుకోను.. రంగనాయకమ్మ బుక్ చదివాకే ఇలా..: రాంగోపాల్ వర్మ
RGV Interview: వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తానో రెబల్ అని, మతాన్ని, నైతిక విలువలను పట్టించుకోనని స్పష్టం చేశాడు.
RGV Interview: రాంగోపాల్ వర్మ.. షార్ట్‌గా ఆర్జీవీ.. ఒకప్పుడు శివ, క్షణక్షణం, రంగీలా, సత్యలాంటి సినిమాలతో ఇండియా గర్వించదగిన డైరెక్టర్లలో ఒకడిగా నిలిచాడు. కానీ ఈ మధ్యకాలంలో వరుస వివాదాలతోనే వార్తల్లోకి ఎక్కుతున్నాడు. అలాంటి ఆర్జీవీ తాజాగా ఫిల్మ్ కంపానియన్ సౌత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఓ రెబల్ అని, మతాన్ని పట్టించుకోనని అతడు చెప్పాడు.
ఆర్జీవీపై రంగనాయకమ్మ ఎఫెక్ట్
తాను రెబల్ గా, మతాన్ని ప్రశ్నించే దిశగా మారడంలో రంగనాయకమ్మ రాసిన బుక్ ప్రధాన పాత్ర పోషించిందని రాంగోపాల్ వర్మ వెల్లడించాడు. రంగనాయకమ్మ మార్క్సిస్ట్ దృక్పథంతో రాసిన రామాయణ విషవృక్షం పుస్తకం తనపై ఎలాంటి ప్రభావం చూపిందో అతడు చెప్పాడు. "ఆ బుక్ నాలో ఆలోచన రేకెత్తించింది. రామాయణంలాంటి గాథను ఆమె మార్క్సిస్ట్ దృక్పథంలో అర్థం చేసుకోవడం అద్భుతం.
నేను మార్క్సిజం కోణం తీసుకోలేదు. కానీ అసలు ప్రశ్నించడానికి వీలులేని రామాయణంలాంటి అంశాన్ని సవాలు చేయొచ్చని మాత్రం తెలుసుకున్నాను. అప్పుడే ఓ విషయాన్ని దానికి ఉన్న విలువను బట్టి, మన పెద్దవాళ్లు చెప్పినట్లుగా చూడాల్సిన అవసరం లేదని కూడా తెలుసుకున్నాను" అని ఆర్జీవీ చెప్పాడు.
ఇలాంటి ఎన్నో ఫిలసాఫికల్ బుక్స్ చదివిన తర్వాతే తాను రెబల్ గా మారినట్లు ఆర్జీవీ వెల్లడించాడు. "నేను ఓ రెబల్ లాగా బతుకుతాను. రెబల్ అంటే ఏంటి? అందరికీ ఆమోదయోగ్యం అయినదానికి వ్యతిరేకంగా వెళ్లడమే రెబల్. నేను ఎప్పుడూ ఒకటే ఫాలో అవుతాను.
నేను చట్టాన్ని ఫాలో అవుతాను. నేను నైతిక విలువలను, మతాన్ని ఫాలో అవను. ఎందుకంటే చట్టం అవసరం. ఓ సిటీలో ఉండాలంటే దాని కోసం కొన్నింటిని అనుసరించాల్సి ఉంటుంది" అని రాంగోపాల్ వర్మ అన్నాడు.
భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందే..
సినిమా ఓ బాధ్యత అన్న అంశంపైనా ఆర్జీవీ స్పందించాడు. "ఓ సినిమా ఏంటి? ఇది ఓ వినోదం లేదా అవగాహన కల్పించే అంశం లేదంటే ఓ మేకర్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి ప్రేక్షకుల దగ్గరికి చేరే సాధనం. తన దృక్ఫథాన్ని స్వేచ్ఛగా వెల్లడించే సాధనం సినిమా. భావ ప్రకటనా స్వేచ్ఛ ఇందుకు తగిన అవకాశం ఇస్తోంది" అని ఆర్జీవీ అన్నాడు.
ఇక నైతిక విలువల అంశాన్ని కూడా ఆర్జీవీ ప్రశ్నించాడు. ఒక్కో దేశంలో ఒక్కో అంశం సరైనదని అనిపిస్తే అసలు ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయించేది ఎవరు అని రాంగోపాల్ వర్మ అన్నాడు. "కొన్ని దేశాల్లో తమ మడమలు బహిరంగంగా చూపించడం నేరం. కొన్ని దేశాల్లో బికినీలు వేసుకున్నా ఏమీ కాదు.
మరి ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు అని ఎవరు నిర్ణయిస్తారు? ఆ సమాజంలోని చట్టాలకు కట్టుబడి ఉన్న వాళ్లు అలా చేయాలి. అది జరగాలంటే నియంత్రణం అవసరం. అలాంటి నియంత్రణ ఉంటే భావప్రకటన స్వేచ్ఛ ఉండదు. అది లేకపోతే ఆలోచనలు స్వేచ్ఛగా బయటకు వచ్చే వీలుండదు" అని ఆర్జీవీ స్పష్టం చేశాడు. ఈ వివాదాస్పద డైరెక్టర్ త్వరలోనే వ్యూహం, శపథం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.