Razakar: సెన్సార్ వాళ్లకు 16 ప్రూఫ్స్ చూపించాను.. రజాకార్ మూవీ రిలీజ్‌పై డైరెక్టర్ కామెంట్స్-razakar director yata satyanarayana about censor board questions and proofs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Razakar Director Yata Satyanarayana About Censor Board Questions And Proofs

Razakar: సెన్సార్ వాళ్లకు 16 ప్రూఫ్స్ చూపించాను.. రజాకార్ మూవీ రిలీజ్‌పై డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 15, 2024 04:11 PM IST

Yata Satyanarayana About Razakar Proofs: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగిన రజాకార్‌ల అరాచకం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా రజాకార్. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ వాళ్లు అడిగిన ఆధారాలపై డైరెక్టర్ యాటా సత్యనారాయణ తెలిపారు.

సెన్సార్ వాళ్లకు 16 ప్రూఫ్స్ చూపించాను.. రజాకార్ మూవీ రిలీజ్‌పై డైరెక్టర్ కామెంట్స్
సెన్సార్ వాళ్లకు 16 ప్రూఫ్స్ చూపించాను.. రజాకార్ మూవీ రిలీజ్‌పై డైరెక్టర్ కామెంట్స్

Yata Satyanarayana Razakar Movie: పాపులర్ యాక్టర్ బాబీ సింహా, హీరోయిన్ వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, నటి ఇంద్ర‌జ‌, బాలీవుడ్ యాక్టర్ మ‌క‌రంద్ దేశ్ పాండే నటించిన సినిమా రజాకార్. స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వహించారు. దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరాఠీ, హిందీలో మార్చి 15న రజాకార్ మూవీ విడుదలైంది.

అయితే, సెన్సార్ సమయంలో రజాకార్ సినిమాకు సంబంధించిన కట్స్, ఆధారాలపై డైరెక్టర్ యాటా సత్యనారాణ ఆసక్తికర విషయాలు చెప్పారు. "చరిత్ర ఆధారంగా రజాకార్ చిత్రాన్ని తీశాను. మన జీవిత చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా తీశాం. అలాంటి సినిమాకు, అలాంటి చరిత్రకు రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే రేటింగ్స్ ఇవ్వొద్దు అన్నాను. సినిమా నచ్చలేదని, దర్శకుడు బాగా చేయలేదని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది" అని ఆయన తెలిపారు.

"చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. పైగా మన చరిత్రను చెప్పాలని కోరిక ఉండేది. నాకు ఈ నిర్మాతతో పదేళ్ల నుంచి పరిచయం ఉంది. కానీ, ఆయనకు సినిమాల్లోకి రావాలనే కోరిక లేదు. కొన్నేళ్లకు ఓ మంచి సినిమా తీయాలని, చరిత్రలో నిలిచిపోయేలా తీయాలని అన్నారు. రజాకార్ సినిమా చేద్దామని అన్నాను. ఆయన కూడా ఓకే అన్నారు. బడ్జెట్ సెట్ అవ్వదేమో అనుకున్నా. కానీ, ఆయనే పట్టుబట్టి తీద్దామని అన్నారు. అలా రజాకార్ మొదలైంది" అని డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు.

"సెన్సార్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఓ పదహారు పాయింట్లు అడిగారు. వాటికి అన్ని ఫ్రూప్స్ చూపించాను. కొన్ని మితి మీరిన వయలెన్స్ సీన్లు ఉన్నాయని, వాటికి మాత్రం కట్స్ చెప్పారు. పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఎన్నికల హడావిడి వచ్చింది. కానీ, అప్పటికీ షూటింగ్ కాలేదు. టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా షూటింగ్ పూర్తవ్వలేదు. సీజీ వర్క్ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎన్నికల కోసం ఈ సినిమాను తీయలేదు" అని సత్యనారాయణ అన్నారు.

"మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలీదు. అందరూ 1947 ఆగస్ట్ 15న వచ్చిందని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు కదా? అందుకే ఆ విషయం అందరికీ తెలియాలనే ఈ రజాకార్ సినిమాను తీశాను. రజాకార్ వ్యవస్థ పాల్పడిన దురాగతాలను తెరపై చూపించాను. ఈ చిత్రంలో ఒక ఊరు, ఒక ప్లేస్ అంటూ చూపించలేదు. 1947 ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగిన ఘటనలను ఇందులో చూపించాం. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా కనిపిస్తాయి" అని డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు.

"ఎన్నో పుస్తకాలు చదివాను. ఎంతో మంది ప్రత్యక్ష వ్యక్తుల్ని కలిశాను. అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్రను చూశాను. అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా రజాకార్ సినిమాను తీశాను. దాదాపు ఈ చరిత్రను పదిహేను చిత్రాలుగా తీయొచ్చు. ఎంత చూపించినా కొంత తక్కువే అనిపిస్తుంది. రజాకార్ వ్యవస్థ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో జరిగింది. ఆ సమయంలో చాలా ప్రాంతాలకు చాలా మంది పారిపోయారు. నాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు కేరళ, చెన్నై నుంచి ఫోన్‌లు వచ్చాయి. మన వాళ్లు ప్రతీ ఏరియాలో ఉన్నారు" అని సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

IPL_Entry_Point