Love At 65: 65 ఏళ్ల వయసులో లేచిపోయిన జంట.. ప్రపంచాన్నే బహిష్కరిద్దామంటూ లవ్ @65
Rajendra Prasad Love At 65 Trailer: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరోయిన్ జయప్రద నటించిన లేటెస్ట్ మూవీ లవ్ @65. కామెడీ అండ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో 65 ఏళ్ల వయసులో ఓ జంట లేచిపోతే ఎలా ఉంటుందో లవ్ @65 ట్రైలర్‌లో చూపించారు.
Love At 65: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ హీరోయిన్, నటి జయప్రద మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ లవ్ @65 (లవ్ ఎట్ 65 మూవీ). ఒకే సమయంలో అనేక సినిమాలను నిర్మిస్తోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యూనిక్ కంటెంట్‌తో చిన్న నుంచి మీడియం-రేంజ్ సినిమాలను కూడా రూపొందిస్తోంది. అలా రూపొందించిన సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ మూవీనే లవ్ @65. బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు విఎన్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లవ్ @65 చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల శుక్రవారం (ఫిబ్రవరి 16) లవ్ @65 మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లవ్ @65 ట్రైలర్ ఆద్యంతం కామెడీతో సాగింది. "ఆయనకి డెబ్బై నిండాయి. ఆవిడకి ఓ అరవై ఐదు దాక ఉంటాయి. ఈ ఇద్దరూ కాలనీ నుంచి పారిపోయారు. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు" అంటూ ఆసక్తికరమైన సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.
అనంతరం వారు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని, వారి జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నారని తేలుతుంది. హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్‌తో పాటు, మనసును కదిలించే భావోద్వేగాలు కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ఆంటీ నా మీద ముచ్చటపడుతున్నట్లుందిరా శిష్యా, ఈ ప్రపంచం మన ప్రేమను తిరస్కరిస్తే.. ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకోవడంతోపాటు నవ్వించేలా ఉన్నాయి.
"ఒక అమ్మాయి ఇష్టానికి అంతలా వాల్యూ ఇచ్చేవాళ్లు ఉన్నారా.. మీ తాత ఉన్నాడుగా, అందరూ నన్ను ఏడిపించారు గానీ, నాకోసం ఏడిచింది నువ్వే" అంటూ వచ్చే డైలాగ్స్ ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయి. అనంతరం కారులో జయప్రదకు రాజేంద్ర ప్రసాద్ ముద్దు పెట్టడంతో ట్రైలర్ ముగుస్తుంది.
కాగా లవ్ @65 మూవీలో రాజేంద్ర ప్రసాద్, జయప్రదతోపాటు కార్తీక్ రాజు, స్పందన, క్రిష్, నిహంత్రీ రెడ్డి, నారాయణరావు, ప్రదీప్, సాయి శ్రీనివాస్, ప్రీతి నిగమ్ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే నటుడు అజయ్, సునీల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సుధీర్ చింటూ కథను అందించగా.. లక్ష్మీ భూపాల డైలాగ్స్ అందించారు. శ్యామ్ తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో లవ్ @65 విడుదల తేదిని ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు కామెడీ హీరోగా ఎవరు సంపాదించుకోలేని క్రేజ్ తెచ్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఎన్నో చిత్రాలు నవ్వులుపండించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్‌గా నిలిచాయి. అయితే, ఇటీవల కాలంలో మాత్రం హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్, పలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఏ పాత్ర చేసిన తనదైన స్టైల్‌తో నవ్విస్తున్నారు. ఇటీవలే లగ్గం అనే సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్నట్లు ఆయన చెప్పారు.